Share News

అక్షరాస్యత పెంచేలా..

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:42 PM

జిల్లాలో అక్షరాస్యత పెంపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. వయోజనుల్లో అక్షర కాంతులు నింపేందుకు ప్రభుత్వాలు మళ్లీ రాత్రిబడి కార్యక్రమ నిర్వహణకు సిద్ధమయ్యాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ (ఎన్‌ఐఎల్‌పీ) అనే కార్యక్రమాన్ని చేపట్టింది.

అక్షరాస్యత పెంచేలా..

వయోజన విద్యకు మళ్లీ శ్రీకారం

ఎన్‌ఐఎల్‌పీ ద్వారా అమలుకు సన్నాహాలు

వలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు

ఈ వేసవి నుంచే కార్యాచరణ ప్రారంభం

జిల్లాలో 16,075 మంది నిరక్షరాస్యులు

జనగామ కల్చరల్‌, మార్చి 27: జిల్లాలో అక్షరాస్యత పెంపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. వయోజనుల్లో అక్షర కాంతులు నింపేందుకు ప్రభుత్వాలు మళ్లీ రాత్రిబడి కార్యక్రమ నిర్వహణకు సిద్ధమయ్యాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ (ఎన్‌ఐఎల్‌పీ) అనే కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో సాక్షరభారత్‌ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం నిలిచిపోవడంతో ఎన్‌ఐఎల్‌పీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ పథకం పేరుతో విద్యాశాఖ సమన్వయంతో ఐదేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వాలు పూనుకున్నాయి. వయోజన విద్యాశాఖ అధికారులకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే వయోజన విద్య, డీఈవో సంయుక్త ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌తో సమావేశం కూడా నిర్వహించారు. ఈ పథకానికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

స్వచ్ఛంద నిర్వహణ ...

న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ద్వారా జిల్లాలో 50 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. గతంలో సాక్షరభారత్‌ కింద గ్రామా ల్లో నియమించిన కోఆర్డినేటర్లు వయోజనులకు బోధిం చేవారు. కొత్తగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వలంటీర్లను నియమించి వారితో బోధన చేయిస్తారు. స్వచ్ఛంద సంస్థలు, ఆసక్తి గల యువతను వలంటీర్లుగా నియమిస్తారు. వీరికి అవస రమైన శిక్షణ, సామగ్రిని అధికారులు అందిస్తారు.

జిల్లాలో 61.60ు అక్షరాస్యత...

2011 ఆర్థిక సంవత్సరం ప్రకారం దేశంలో 18,12,00,000 మంది నిరక్షరాస్యులుండగా రాష్ట్రంలో 40 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇవే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 66 శాతం అక్షరాస్యత ఉండగా జనగామ జిల్లాలో 61.60 శాతం అక్షరాస్యత ఉంది. 2025 వరకు జిల్లా లో వంద శాతం అక్షరాస్యత సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

జిల్లాలో 16,075 మంది నిరక్షరాస్యులు ...

జనగామ జిల్లాలో 2011 గణాంకాల ప్రకారం 16,075 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరిలో ఎస్సీలు 2894, ఎస్టీలు 1929, మైనారిటీలు 804, ఓబీసీలు 10,449 మంది ఉన్నారు. అన్ని కేటగిరీలలో కలిపి 6430 మంది పురుషులు కాగా, 9645 మంది స్త్రీలు ఉన్నారు. 2025 డిసెంబరు వరకు వీరందరినీ అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.

వేసవి నుంచి కార్యాచరణ ...

ఎన్‌ఐఎల్‌పీ ద్వారా సాగే ఈ కార్యక్రమాన్ని వచ్చే సమ్మర్‌ నుంచి ప్రారంభిస్తారు. ముందుగా అన్ని గ్రామాల్లో తిరిగి నిరక్షరాస్యుల జాబితా తయారు చేస్తారు. అనంతరం యూత్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా వలంటీర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. అనంతరం ఏ గ్రామంలోనైతే ఎక్కువ మంది నిరక్షరాస్యులున్నారో ఆ గ్రామానికి పైలట్‌ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 2025 వరకు ఆ గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కావలసిన పుస్తకాలు, పలకలు, ఇతర సామగ్రిని ప్రభుత్వం అందజేస్తుంది.

బోధనా లక్ష్యాలు ఇవీ ...

వయోజనుల్లో అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం కొన్ని బోధనా లక్ష్యాలను ఎంచుకుంది. ముందుగా వయోజనులకు అక్షరాలు, అంకెలు నేర్పించడం. సులభ భాషలో చట్టాలపై అవగాహన కల్పించడం. ప్రకృతి విపత్తుల పట్ల అవగాహన కల్పించడం. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకునే విధంగా చూడడం. శిశు సంరక్షణ, కుటుంబ సంరక్షణ తెలియజెప్పడం. అనంతరం వృత్తి పరమైన శిక్షణ ఇవ్వడం. ప్రాథమిక విద్య తదుపరి సాంస్కృతిక, క్రీడా రంగాలలో అభ్యున్నతి సాఽధించే విధంగా బోధనా లక్ష్యాలను ఎంచుకున్నారు.

అందరి భాగస్వామ్యంతో ...

సర్వేలో గుర్తించిన వారికి విద్య చెప్పేందుకు మూడు విధానాలు అనుసరిస్తారు. మొదట ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలతో అక్షరాలు నేర్పిస్తారు. రెండోది ప్రభుత్వ ఉపాధ్యాయులు, వలంటీర్లతో చదువు చెప్పిస్తారు. మూడోది 5వ తరగతి ఆపై చదువుతున్న పిల్లలతో వారి ఇంట్లో, చుట్టుపక్కల గల వయోజనులకు అక్షరాలు నేర్పిస్తారు. ఇందుకు అవసరమైన విద్యావిషయక సామగ్రిని వారికి అందిస్తారు. ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌తో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. అందులో వయోజన విద్య లైజనింగ్‌ అధికారి విజయకుమార్‌రెడ్డి, డీఈవో కె.రాము, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి బొమ్మనబోయిన శ్రీనివాస్‌ తదితర అధికారులు కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం.

నిరక్షరాస్యతను నిర్మూలించేందుకే..

- బొమ్మనబోయిన శ్రీనివాస్‌, ఏఎంవో, జనగామ

నిరక్షరాస్యతను నిర్మూలించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్‌ఐఎల్‌పీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఇప్పటికే అదనపు కలెక్టర్‌ సమావేశం కూడా నిర్వహించారు. అందరి భాగస్వామ్యంతో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తున్నాం.

Updated Date - Mar 27 , 2024 | 11:42 PM