Share News

తీన్‌మార్‌

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:46 AM

పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సమయం సమీపిస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్‌ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచే అభర్థులెవరో తేలిపోయింది.

తీన్‌మార్‌

మానుకోట పార్లమెంట్‌ బరిలో పాత ముఖాలే..

ముగ్గురూ ముగ్గురే.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే

త్రిముఖ పోటీతో రసవత్తరంగా రాజకీయం

మహబూబాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సమయం సమీపిస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్‌ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచే అభర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తొలుత గులాబీ బాస్‌ కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితకే టికెట్‌ కేటాయించగా.. ఆ తర్వాత ‘హస్తం’ పార్టీ తమ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి, పోరిక బలరాంనాయక్‌ పేరును ప్రకటించింది. తాజాగా బుధవారం రాత్రి బీజేపీ అధిష్ఠానం మాజీ ఎంపీ, ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌ను మానుకోట బరిలో నిలుపుతున్నట్టు వెల్లడించింది. అయితే ఈ ముగ్గురు మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు పాతముఖాలే కాగా.. గెలుపు తమదేనంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో 2009లో మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌గా ఆవిర్భవించింది. ములుగు, నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల ఏజెన్సీ బెల్టుతో మహబూబాబాద్‌ ఎంపీ నియోజకవర్గం రూపుదిద్దుకుంది. ఇందులో ఎంపీ సెగ్మెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో నర్సంపేట మినహా మిగిలిన ఆరు ఎస్టీకే రిజర్వుడ్‌ అయ్యాయి. తొలి పార్లమెంటరీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి పోరిక బలరాంనాయక్‌, మహాకూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి డీటీ నాయక్‌ త్రిముఖంగా పోటీపడ్డారు. త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగోసారి మహబూబాబాద్‌కు తొలి ఎన్నికల తరహా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ప్రధాన త్రిముఖ పోటీ అనివార్యమని పరిశీలకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఫలితాలిలా..

2009లో తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పోరిక బలరాంనాయక్‌కు 3,94,447 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావుకు 3,25,490 ఓట్లు లభించాయి. త్రిముఖ పోటీలో ఓటమి పాలైన పీఆర్పీ అభ్యర్థి డీటీ నాయక్‌కు 1,45,299 ఓట్లు లభించాయి. విజేత బలరాంకు 68,957 ఓట్ల మెజార్టీ లభించింది. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే రీతిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీల మధ్య త్రిముఖ పోరు నడిచింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌కు 3,20,569 ఓట్లు రాగా, ఆయన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి పోరిక బలరాంనాయక్‌కు 2,85,577 ఓట్లు లభించాయి. ఈ త్రిముఖ పోటీలో ఓడిన టీడీపీ అభ్యర్థి బానోత్‌ మోహన్‌లాల్‌కు 2,15,904 ఓట్లు లభించాయి. విజేత అజ్మీర సీతారాంనాయక్‌ 34,992 ఓట్ల మెజార్టీ లభించింది. 2019 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా వేశా రు. కానీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడ్డాయి. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మా లోతు కవితకు 4,62,109 ఓట్లు రాగా, సమీ ప కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయ క్‌కు 3,15,446 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌కు కేవలం 25,487 ఓట్లు వచ్చాయి. విజేత మాలోతు కవితకు 1,46,663 ఓట్ల మెజార్టీ లభించింది.

అనూహ్యంగా హేమాహేమీలు

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అనూహ్యంగా హేమాహేమిలను బరిలో నిలుపుతున్నాయి. మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ పార్లమెంట్‌ ఆవిర్భావ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున విజేతగా నిలిచి కేంద్ర క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం పొందిన పోరిక బలరాంనాయక్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచీ ఎంపిక చేసి పార్టీ టికెట్‌ కేటాయించింది. బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికి మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా తిరిగి సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితనే బరిలో నిలుపు తోంది. ఈ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ బీఆర్‌ఎస్‌ ఎంపీ, ప్రొఫెసర్‌ అజ్మీర సీతా రాంనాయక్‌ చివరి నిమిషంలో బీజేపీలో చేరి మహబూబా బాద్‌ టికెట్‌ సంపాదించుకుని తన ఆదృష్టాన్ని పరిక్షించుకుం టున్నారు. ఈ ముగ్గురిలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌ ఇద్దరు ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందినవారు కాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోతు కవిత మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన వారు. ఈ ముగ్గురు ఎవరికి వారే తాము ఇదే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి ఉండడంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలతోనూ సత్సంబంధాలు కలిగి ఉండి, విజయాన్ని చేరుకోవాలని సర్వశక్తులు ఒడ్డనున్నారు.

Updated Date - Mar 15 , 2024 | 09:04 AM