Share News

చెరువులు మాయం..!

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:53 PM

జిల్లా కేంద్రంలోని నీటి వనరులు అన్యాక్రాంతం అవుతున్నాయి. కాపాడా ల్సిన ప్రజాప్రతినిధులే చెరువులను చెర పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చెరువులు ఒక్కొక్కటి గా మాయం అయ్యే పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లే యథేచ్ఛగా కబ్జా చేసి వెంచర్లు వేసేస్తున్నారు.

చెరువులు మాయం..!
జిల్లా కేంద్రంలోని గోరంట్ల కుంట శిఖం భూమిలో వెలిసిన వెంచర్‌

జిల్లా కేంద్రంలో కబ్జాకు గురవుతున్న నీటి వనరులు

యథేచ్ఛగా ఆక్రమిస్తున్న కబ్జారాయుళ్లు

కాపాడుకునేందుకు కోర్టుకెక్కుతున్న నీటిపారుదల శాఖ

ఆక్రమణల తొలగింపుపై పట్టించుకోని కలెక్టర్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, మార్చి 9: జిల్లా కేంద్రంలోని నీటి వనరులు అన్యాక్రాంతం అవుతున్నాయి. కాపాడా ల్సిన ప్రజాప్రతినిధులే చెరువులను చెర పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చెరువులు ఒక్కొక్కటి గా మాయం అయ్యే పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లే యథేచ్ఛగా కబ్జా చేసి వెంచర్లు వేసేస్తున్నారు. మరోవై పు సామాన్యుల పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికుల కుటుంబాలు చెరువుల్లో గుడిసెలు వేసుకుం టున్నారు. చెరువుల్లో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన కలెక్టర్‌ మౌనముద్ర వహిస్తున్నారు. నీటి వనరులను కాపాడేందుకు మరో దిక్కులేక నీటిపారుదల శాఖ అధికారులు కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధం అవుతున్నారు.

మాయం చేసేస్తున్నారు..

జిల్లా కేంద్రంలోని చెరువులు, పంట కాలువలు మా యం అవుతున్నాయి. కలెక్టరేట్‌కు కూత వేటు దూరం లోని గోరంట్లకుంట శిఖం భూములు పూర్తిగా అన్యా క్రాంతం అయ్యాయి. సర్వే నెంబర్‌ 209లోని 22.19 ఎకరాల శిఖం భూమిని కబ్జా చేసి వెంచర్లు, సాగు భూములు చేయడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏకంగా గుడి నిర్మాణం చేసి కాంప్లెక్స్‌ కూడా కట్టారు. భూపాలపల్లి మునిసిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌ శిఖం భూమిలో వెంచర్‌ వేసి ప్లాట్స్‌ చేసి అమ్మడం కూడా జరిగిపోయింది. 255, 256 సర్వే నెంబర్లలో ఉన్న బొబ్బగట్టు మాటు పంట కాలువను పక్కకు జరిపి వెంచర్‌ వేసిన వైనం భూపాలపల్లిలోని భాస్కర్‌గడ్డలో చోటుచేసుకుంది.

శిఖం భూమిలో వెంచర్‌

భూపాలపల్లిలోని గోరంట్ల కుంట ఉన్న సర్వే నెంబర్‌ 209లో కౌన్సిలర్‌ యథేచ్ఛగా కబ్జా చేసి సర్వే నెంబర్‌ 213, 214 పేరిట ప్లాట్‌లను అమ్మేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో చక్రం తిప్పిన సదరు కౌన్సిలర్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంచన చేరి తన వెంచర్‌ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ లున్నారు. సదరు కబ్జారాయుడు అయిన కౌన్సిలర్‌కు గతంలో పనిచేసిన తహసీల్దార్‌ కావాల్సినంత సాయం చేసి రుణం పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ వెం చర్‌లో విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సౌకర్యం కల్పించడం కోసమెరుపు. కబ్జాల్లో ఆరితేరిన మరికొంత మంది కౌన్సిలర్లు తమ ఆక్రమణలను కాపాడుకునేం దుకు అధికార పార్టీలో చేరారనే వాదనాలున్నాయి.

సామాన్యుల పేరిట..

భూపాలపల్లి పట్టణంలోని పాత ఎర్రచెరువులో వెలిసిన గుడిసెల్లో అక్రమార్కులే ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. కమ్యూనిస్టుల ప్రోద్భలంతో చెరువు లోనే పెద్ద మొత్తంలో గుడిసెలు వేశారు. సామాన్యుల చాటున ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికుల కుటుంబాలు, సొంతంగా ఇండ్లు ఉన్నవారితో పాటు స్థానికేతరులు కూడా గుడిసెలు వేసిన వారిలో ఉన్న ట్లు సమాచారం. భూపాలపల్లి మండలం మోరంచప ల్లి సబ్‌సెంటర్‌లో పనిచేసే ఓ ఆశ కార్యకర్త కూడా గుడిసె వేసినట్లు సమాచారం. వీరితోపాటు పట్టణంలోని ఓ షాపు యాజమానితోపాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కుడా గుడిసెలు వేసినట్లు తెలిసింది. గుడిసెలు ఏకంగా చెరువులో వేయడంతో రాజకీయ కారణాలతో అధికారులెవరూ గుడిసెలు తొలగించక పోవడంతో ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది.

ఇరిగేషన్‌ శాఖ లేఖపై కలెక్టర్‌ మౌనముద్ర

సమీకృత కలెక్టరేట్‌ సమీపంలోని గోరంట్ల కుంట శిఖం భూమిలో ఆక్రమణలపై నీటిపారుదల శాఖ, సర్వే ల్యాండ్‌, మునిసిపాలిటీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేల్చారు. చెరువు శిఖం హద్దులను కూడా ఏర్పాటు చేశారు. శిఖం భూమిలో వెంచర్‌, మిరప తోట సాగు, వెంకటేశ్వర ఆలయం నిర్మాణం, కాంప్లెక్స్‌ కట్టడంతో పాటు ఎమ్మెల్యే కాంప్లెక్స్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఆలయం, కాంప్లెక్స్‌ నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉండటం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లు ప్రభుత్వ నిర్మాణాలు కావడంతో అధికారులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. శిఖంలో వెలిసిన ఇతర కట్టడాలపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఈ యేడాది జనవరి 29వ తేదీన కలెక్టర్‌ భవేష్‌ మిశ్రాకు లేఖ రాశారు. ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్‌ నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆక్రమణలను తొలగించి చెరువులను కాపాడాల్సిన కలెక్టర్‌ మౌనంగా ఉండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు మెట్లెక్కుతున్న అధికారులు

జిల్లా కేంద్రంలోని చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో చర్యలు తీసుకునేందుకు ఎటువంటి అధికారాలు లేకపోవడంతో నీటి పారుదల శాఖ అధికారులు హైకోర్టు మెట్లెక్కుతున్నారు. గోరంట్ల కుంట శిఖం భూమిలోని ఆక్రమణలను తొలగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. కాగా, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గోరంట్లకుంట శిఖం భూమిలో అక్రమణల తొలగింపుపై సంబంధిత శాఖలకు ఆదేశాలివ్వాలంటూ నీటిపారుదల శాఖ అధికారులు రాసిన లేఖపై కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తనకు తెలియదంటూ సెలవిచ్చారు.

Updated Date - Mar 09 , 2024 | 11:53 PM