Share News

సర్కారే దిక్కు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:57 PM

ఈ యేడాది పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కోటి ఆశలతో సాగు చేస్తే నిరాశే మిగులుతోంది. దిగుబడులు తగ్గడం.. ఆశించిన ధరలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించక నానా తంటాలు పడుతున్నారు. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి ప్రభావంతో పంటలకు పూత కాత లేక రైతులు తల పట్టుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇలాగైతే తెచ్చిన అప్పులు తీర్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే బోనస్‌ అందించి ఆదుకోవాలని, లేదంటే క్వింటాకు రూ. 12 వేలు మద్దతు ధర ఇవ్వాలని వేడుకుంటున్నారు.

సర్కారే దిక్కు

ఆదుకోవాలంటున్న పత్తి రైతులు

ప్రకృతి వైపరీత్యాలతో తగ్గిన దిగుబడి

కూలీలకే సరిపోని మద్దతు ధర

పెట్టుబడి కూడా రాక అప్పులపాలు

బోనస్‌ అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని విన్నపం

జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో సాగు

నర్మెట, జనవరి 3: జిల్లాలో పత్తి రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సూమారు 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. విత్తనం కోనుగోలు నుంచి ఎరువుల బస్తాలు, పై మందులు, కలుపుతీత, గ్రొరు గుంటుకలు తోలడం లాంటి పనులతో ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నారు.

వాతావరణం అనుకూలించక..

వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడి పూర్తిగా తగ్గింది. పత్తి రైతులు ఎక్కువగా వర్షాధారం పైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడం, అతివృష్టి, అనావృష్టి, తెగుళ్ల బెడ ద, పూత, కాత సమయంలో వర్షాలు కురవక పోవడంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు.

తగ్గిన దిగుబడి..

ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే వస్తోంది. మరోవైపు కూలీల ఖర్చులు కూడా అమాంతంగా పెరిగాయి. కిలోకు రూ.10 నుంచి 14 రూపాయలు ఇవ్వా ల్సివస్తోంది. కూలి అయితే రూ.300 నుంచి రూ.400 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో వ్యవసాయం చేయడం కంటే కూలి పనికి వెళ్లడమే మేలనే దుస్థితికి రైతులు వచ్చేశారు.

ఆశించిన ధర లేక...

పత్తి రైతుకు ఆశించిన ధర లేక తెల్లబోతున్నాడు. గత సంవత్సరం సీసీఐ మద్దతు ధర రూ. 6920 ఉండగా ప్రైవేట్‌లో పత్తి నాణ్యతను బట్టి రూ. 9వేల నుంచి 10 వేల వరకు ధర పలికింది. ఈ ఏడాది కూడా సీసీఐ మద్దతు అంతే ఉండగా ప్రైవేట్‌లో రూ.6300 నుంచి రూ.6500 వరకే పలుకుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. రైతులకు డబ్బులు అత్యవసరమై సీసీఐ కేంద్రాలకు వెళ్లలేక ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కాటన్‌ ధరలు, పత్తి గింజల ధరలు, పత్తి నూనెల ధరలపైనే పత్తి రేటు ఆధరపడి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

కేంద్రం నిర్ణయం తీసుకోవాలి..

- రాజశేఖర్‌రెడ్డి, సీసీఐ సీవో

మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో మూడు సీసీఐ కేంద్రాల్లోని పదిహేను పత్తిమిల్లుల్లో(ఫ్యాక్టరీల్లో) పత్తిని రూ. 6920 మద్దతు ధరకు కోనుగోలు చేస్తున్నాం. కొందరు రైతులు ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయించి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ జీరాక్స్‌ తీసుకువచ్చిన రైతులకు రెండు మూడు రోజుల్లో డబ్బులను జమ చేస్తున్నాం. రైతులు సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలి.

మద్దతు ధర పెంచాలి..

- ఎనుగుల రాములు, రైతు, నర్మెట

మూడెకరాలు కౌలుకు తీసుకొని రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. పత్తి సాగుకు ఖర్చులు పెరుగుతున్నాయి. రెండెకరాల్లో కలిపి కేవ లం 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేలా ఉంది. దుక్కి దున్నకం నుంచి విత్తనం, ఎరువులు, పై మందులు ఇతర పనుల కోసం రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టా ను. ప్రస్తుత ధర చూస్తే కౌలు డబ్బులు కూడా మీ ద పడేలా ఉన్నాయి. మద్దతు ధర పెంచితే పెట్టిన పెట్టుబడైన వస్తుందని ఆశపడుతున్నా.

పత్తికి బోనస్‌ ప్రకటించాలి..

- ప్రజ్ఞాపురం కనకయ్య, రైతు, నర్మెట

నాలుగు ఎకరాలు పత్తి సాగు చేసి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టాను. ఎకరానికి కేవలం నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా ఉంది. పత్తి ఏరడానికే రూ. 20 వేలు అయ్యేలా ఉన్నాయి. పెట్టుబడులు ఎక్కువయ్యాయి. పంట దిగుబడి సరిగా రావడం లేదంటే మరోవైపు ధర కూడా సరిగా లేదు. ప్రభుత్వం స్పందించి ధాన్యానికి ప్రకటించిన విధంగా పత్తికి కూడా క్వింటాకు రూ.500 బోనస్‌ ప్రకటించాలి.

Updated Date - Jan 03 , 2024 | 10:58 PM