Share News

ఆట మొదలైంది..

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:20 AM

నామినేషన్ల పర్వం మొదలైంది. పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగడంతో పాటు ఓ వైపు కేడర్‌ను కలుస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్తూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినాయకత్వాలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదను పెడుతున్నాయి.

ఆట మొదలైంది..

‘లోక్‌సభ’ పోరులో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు

శ్రేణులు, నాయకుల సమన్వయంపై కాంగ్రెస్‌ ఫోకస్‌

నేడు మహబూబాబాద్‌లో, 24న వరంగల్‌లో సీఎం రేవంత్‌ సభలు

బూత్‌ స్థాయి కేడర్‌పై బీజేపీ దృష్టి

కంచుకోటను కాపాడుకునే ప్రయత్నంలో గులాబీ పార్టీ

నియోజకవర్గాల బాధ్యతలు ఎమ్మెల్సీలు, సీనియర్లకు..

ఓరుగల్లుపై కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎ్‌సల గురి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి - వరంగల్‌)

నామినేషన్ల పర్వం మొదలైంది. పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగడంతో పాటు ఓ వైపు కేడర్‌ను కలుస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్తూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినాయకత్వాలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదను పెడుతున్నాయి. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించడంతో పాటు ప్రత్యర్థి పార్టీల నుంచి శ్రేణుల చేరికల పై దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్ర, జాతీయ నాయకులతో రోడ్‌షోలు బహిరంగ సభలకు పార్టీలు ప్లాన్‌ చేస్తుండటంతో ఉమ్మడి వరంగల్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

కేడర్‌లోకి హస్తం నేతలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాం గ్రెస్‌.. బీఆర్‌ఎ్‌సకు కంచుకోటగా ఉన్న వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ రచన చేస్తోంది. 2014 నుంచి తమ చేతికి చిక్కని ఓరుగల్లులో పాగా వేయాలని ప్రణాళిక రచిస్తోంది. వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని గులాబీ పార్టీ నుంచి చేజిక్కించుకునేందుకు వలసలపై దృష్టి పెట్టిం ది. సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావులతో పాటు 20మందికి పైగా కార్పొరేటర్లు, ముగ్గురు మున్సిపల్‌ చైర్మన్లను బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి చేర్చుకున్నారు. అంతేగాకుండా స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రె్‌సలో చేర్చుకుని ఆయన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. దీంతో కడియం శ్రీహరి తన కూ తురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ముఖ్య నా యకులను కలిసి తమ గెలుపునకు సహకరించాలని కోరుతూనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు కొత్త అయిన కడియం కావ్యను కేడర్‌లోకి తీసుకెళ్తూ జోష్‌ నింపుతున్నారు. కావ్య ఈ నెల 24న నామినేషన్‌ దాఖలు చేయడంతో పాటు సాయం త్రం 4గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే మడికొండ బహిరంగ సభ ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలాగే మహబూబాబాద్‌ లోక్‌ సభ నుంచి పోటీ చేస్తున్న బలరాంనాయక్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే లోక్‌సభ పరిధిలోని అన్ని ని యోజకవర్గాల్లో పర్యటించిన బలరాం నాయక్‌.. శుక్రవా రం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బలరాంనా యక్‌ ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీ అధిష్ఠాం వరంగల్‌, మహబూబాబాద్‌ పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. ఎప్పటికప్పుడు కో ఆర్డినేటర్లు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కేడర్‌పై బీజేపీ నజర్‌

వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాలపై బీజేపీ నజర్‌ పెట్టింది. 1984లో తొలిసారి బీజేపీ అభ్య ర్థి చందుపట్ల జంగారెడ్డి అప్పటి హనుమకొండ స్థానం నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పోటీ చేస్తున్న బీజేపీకి వరంగల్‌ సీటు అందని ద్రాక్ష లా మారింది. అయితే 40ఏళ్లకు బీజేపీకి వరంగల్‌లో గెలుస్తామన్న ధీమాతో ఎన్నికల బరిలో దిగుతోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమే్‌షను పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చింది. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి తిరుగుతున్నారు. ఈ రెండు చోట్ల బీజేపీకి ఉన్న సం స్థాగత బలంతో పాటు మోదీ గాలిలో విజయం సాధిస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. దీంతో బూత్‌ స్థాయి కేడర్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రముఖ్‌లను నియమించింది. పార్టీలోని కీలక నేతలు ఐక్యతతో పని చేస్తుండటంతో పాటు అనుబంధ సంఘాలు చాపకింద నీరులా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని అసెం బ్లీ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించి పార్టీ అ భ్యర్థిని పరిచయం చేస్తూ ఈసారి వరంగల్‌లో పాగా వేయాలని కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.

కంచుకోటపై గులాబీ గురి

పదేళ్లుగా బీఆర్‌ఎ్‌సకు ఉమ్మడి వరంగల్‌ కంచుకోటలా ఉంది. ఏ ఎన్నికలు జరిగినా ఓరుగల్లులో ఆపార్టీదే హవా.. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ కేడర్‌లో కొంత నైరాశ్యం నెలకొంది. దీనికి తోడు వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారైనా కడియం కావ్య కాంగ్రె్‌సలోకి జంప్‌ కావడం శ్రేణుల్లో మరింత నిరుత్సాహం నింపింది. అయితే ఏప్రిల్‌ 1న హనుమకొండలో జరిగిన వరంగల్‌ లోక్‌సభ స్థాయి సమావేశంలో నేతల ప్రసంగాలు వారిలో ఉత్సాహం నింపాయి. బీఆర్‌ఎ్‌సకు కడియం శ్రీహరి ద్రోహం చేశారని రగిలిపోతున్న కేడర్‌ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ను వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవితను అధిష్ఠానం ఖరారు చేయడంతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలుగా నియమించింది. ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన బీఆర్‌ఎస్‌ శుక్రవారం వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గ శ్రేనుల సమావేశం ఏర్పాటు చేసింది. అలాగే మిగతా అన్ని నియోజక వర్గాల్లో కార్యకర్తల సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రె్‌సకు ధీటుగా ప్రచారం చేయాలని వ్యూహ రచన చేస్తున్నారు. మొత్తానికి నామినేషన్ల ఘటం మొదలు కావటంతో ఓరుగల్లులో రాజకీయాలు వేడెక్కబోతున్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:21 AM