Share News

కాలువ పారలే.. పంటలు పండలే..

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:05 AM

పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం మూలంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో తలాపున నీళ్లున్నా పంటలకు అం దించలేని దుస్థితి నెలకొంది. ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ లో జలాలు సమృద్ధిగా ఉన్నాయన్న ఆశతో రైతులు యాసంగి పంటలు సాగుచేశారు. కాని మూడు నెల ల్లోనే వారి ఆశలు అడియాశలయ్యాయి. ఫలితంగా చేతికివచ్చే పంట పశువులకు మేత అయ్యింది.

కాలువ పారలే.. పంటలు పండలే..

2ఎల్‌ కెనాల్‌ ద్వారా రైతులకు అందని సాగునీరు

పట్టించుకునేవారు లేక పెరిగిన పిచ్చిచెట్లు

మట్టి పేరుకుపోయి ముందుకు సాగని జలాలు

మరమ్మతు చేస్తే 4,451 ఎకరాలకు నీటి సౌకర్యం

పాలకులు స్పందించాలని రైతుల డిమాండ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌, ఏప్రిల్‌ 7: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం మూలంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో తలాపున నీళ్లున్నా పంటలకు అం దించలేని దుస్థితి నెలకొంది. ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ లో జలాలు సమృద్ధిగా ఉన్నాయన్న ఆశతో రైతులు యాసంగి పంటలు సాగుచేశారు. కాని మూడు నెల ల్లోనే వారి ఆశలు అడియాశలయ్యాయి. ఫలితంగా చేతికివచ్చే పంట పశువులకు మేత అయ్యింది. పంటలు ఎండిపోవడంతో రైతులు ఎండినపంటలను చూసి కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేది ఎలా అని ఆందోళన చెందుతున్నారు.

మెయిన్‌ కాలువలో సమృద్ధిగా జలాలు

ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ నుంచి పాలకుర్తి మెయిన్‌ కెనాల్‌ ద్వారా జలాలు పాలకుర్తి, చెన్నూరుకు వెళ్లుతు న్నాయి. అదేవిధంగా నవాబుపేట, ఆశ్వరావుపల్లి రిజ ర్వాయర్‌లకు సైతం సరఫరా అవుతున్నాయి. కాని ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ సమీపంలోని గ్రామాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. దీంతో తలాపున నీళ్లున్నా ఉపయోగమేముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూడుకుపోతున్న 2ఎల్‌ కెనాల్‌

ఘన్‌పూర్‌-పాలకుర్తి మెయిన్‌ కెనాల్‌కు అనుసంధా నంగా 5వ కిలోమీటర్‌ (ఇప్పగూడెం) వద్ద 2ఎల్‌ కెనా ల్‌ తూమును ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పాల కుర్తి మండలం గూడూరు వరకు సుమారు 10 కిలో మీటర్ల మేర గతంలో కాలువ నిర్మించారు. దీని కింద 4,451 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కా కుండా కాలువ సమీపంలోని కుంటలు చెరువులను సైతం నింపుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఈ కెనాల్‌ను పట్టించుకునే వారు లేకపోవడంతో దాని నిండా పిచ్చిచెట్లు పెరిగిపోయాయి. అనేక చోట్ల మట్టి పేరుకుపోయి జలాలు ముందుకు వెళ్లడం లేదు.

మరమ్మతులు చేయాలి

పది కిలోమీటర్ల పొడవు ఉన్న 2ఎల్‌ కాలువలో అ క్కడక్కడ పేరుకుపోయిన పూడికను తొలగించి, కాలు వలో దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగిస్తే కెనాల్‌ ద్వారా జలాలు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. వేలా ది ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేసుకుంటారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని కాలువకు మరమ్మ తులు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

ఆశతో సాగు చేసిన రైతులు

2ఎల్‌ కెనాల్‌లో తాత్కలిక మరమ్మతులు చేబట్టి యాసంగి సాగుకు జలాలు విడుదల చేస్తారనే ఆశతో 2ఎల్‌ కెనాల్‌ వెంట ఉన్న రైతులు వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో నీరందక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. చేసేది ఏమీ లేక రైతులు చేన్లలో పశువులను మేపుకునే దుస్థితి ఏర్పడింది.

కెనాల్‌ ద్వారా సాగునీరందే గ్రామాలు

2ఎల్‌ కెనాల్‌ ద్వారా మూడు మండలాల్లో సుమా రు నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందేది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం, సముద్రాల, నారాయణపురం, గోపాలపురం గ్రామాలతో పాటు జఫర్‌గడ్‌ మండలంలోని సూరారం, తీగారం, హిమ్మ త్‌నగర్‌, షాపల్లి గ్రామాలకు అదేవిధంగా పాలకుర్తి మండలంలోని గూడూరుతో పాటు సమీప గ్రామాల రైతులు పంటలు పండించుకునేవారు.

సాగునీటి కోసం అన్నదాతల పాట్లు

2ఎల్‌ కెనాల్‌పై ఆధారపడి పంటలను సాగుచేసిన రైతులు ఇపుడు జలాలు రాకపోవడంతో పెద్ద ఎత్తున బోరుబావులు వేస్తున్నారు. అయితే భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లలో నీరుపడడం లేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడంలేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాక రైతులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి...

- బండి సమ్మయ్య, రైతు, సముద్రాల

నాకున్న మూడెకరాల భూమిలో కెనాల్‌ ద్వారా జలాలు వస్తాయనే ఆశతో వరిపం టను సాగుచేశాను. నీళ్లు రాకపోవడంతో చేతి కివచ్చే దశలో పంట ఎండిపోయింది. ఎండిన చేనులో రోజు కొంత గేదెలను మేపుతున్నాను. రూ.90వేలు పెట్టుబడి పెట్టాను. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

ఎప్పటిలాగే జలాలు వస్తాయనుకున్నాను..

- కత్తుల రాజు, రైతు, సముద్రాల

గత ఏడాది యాసంగిలో అధికారులు 2ఎల్‌ కెనాల్‌ ద్వారా జలాలు విడుదల చేయడంతో పంటలు పండించుకున్నాం. అదే మాదిరిగా ఈసారి కూడా జలాలు వస్తాయని అనుకొని మొక్క జొన్న సాగు చేశాను. పంట పూర్తిగా ఎండిపోయింది. అధికారు లు కాలువకు మరమ్మతులు చేసి జలాలు విడుదల చేయాలి.

ఏడు బోర్లు వేసినా ఫలితం లేదు..

- మ్యాకల నరేష్‌, రైతు, సముద్రాల

కాలువ ద్వారా జలాలు వస్తాయనే ఆశతో పంటలను సాగు చేశాను. తీరా జలాలు రాకపోవడంతో పంటలు కాపాడుకోవడానికి ఏడు బోర్లు వేసిన. అయినా ఒక్కదాంట్లో కూడా నీరు పడలేదు. దీంతో ఆర్థికంగా చాలా నష్టపోయాను. రూ.4లక్షల మేర అప్పు అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

Updated Date - Apr 08 , 2024 | 12:05 AM