Share News

ఆగేనా.. సాగేనా!

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:34 PM

ఏటా వృథాగా పోతున్న వరదనీటిని ఒడిసి పట్టేందుకు ఓ పెద్దమనిషి సుమారు 72 ఏళ్లక్రితం వాగుపై ఆనకట్ట నిర్మించాడు. దానికి అనుసంధానంగా కాలువను సైతం నిర్మించి తూము ద్వారా నీటిని విడుదల చేసేలా ఏర్పాటు చేశాడు. ఈ కాలువ కింద సుమారు వెయ్యి పై చిలుకు ఎకరాలకు సాగునీరు అందింది. 60 ఏళ్లపాటు రైతులు రెండు పంటలు పండించుకున్నారు. ఆ తర్వాత సదరు కాలువ శిథిలావస్థకు చేరింది. పలు చోట్ల గండ్లు పడ్డాయి. ముళ్లపొదలు పెరిగిపోయాయి. మరికొన్ని చోట్ల పూడుకుపోయింది. ప్రస్తుతం పనికిరాకుండా పోయింది. దీని మరమ్మతుకు అధికారులు గతంలోనే ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాలేదు. ఇపుడు ప్రభుత్వం మారినందున పనులకు అనుమతి ఇస్తుందా.. లేక నిరాకరిస్తుందా.. అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆగేనా.. సాగేనా!
పురాతన ఆనకట్ట (బంజరుమాటు)

బంజరు కాలువ పునరుద్ధరణపై సందిగ్ధం

ప్రభుత్వం మారడంతో రైతుల ఆందోళన

రూ.3.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం

పనులు పూర్తయితే వెయ్యి ఎకరాలకు సాగునీరు

12 యేళ్లుగా నిరీక్షిస్తున్న అన్నదాతలు

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 8: మండలంలోని పాం నూర్‌ గ్రామ రైతులకు పూర్వం సాగునీటి సదుపా యం లేదు. కాని శివారులోని వాగు గుండా ఏటా వేలాది క్యూసెక్కుల వరద నీరు వృథాగా పోయేది. అదే గ్రామానికి చెందిన బాపుదొర అనే వ్యక్తి ఈ విషయాన్ని గమనించారు. సుమారు ఏడు దశాబ్ధాల క్రితం దానిపై ఆనకట్ట నిర్మించాలని అనుకున్నారు. వెంటనే వాగు అంతా కలియతిరిగి ఒక చోట ప్రకృతి సిద్ధంగా ఉన్న పెద్దబండరాయిని గమనించి దానిపై ఆనకట్ట (బంజరుమాటు) నిర్మించారు. దానికి కుడి వైపున ఒక తూమును ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామ పరిధిలోని సుమారు 1050 ఎకరాల ఆయకట్టు తో పాటు జఫర్‌గడ్‌ మండలంలోని ఉప్పుగల్లు గ్రామ శివారులో సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందించేలా మాటును నిర్మించారు. ఇందుకోసం తూము కింద 3.1 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించారు. దీంతో ఏటా బంజరుమాటు ద్వారా రెండు పంటలను సాగు చేసుకునే సౌకర్యం ఏర్పడిం ది. ఇలా సుమారు 60యేళ్ల పాటు రైతులు రెండు పంటలు పండించుకున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా బంజరు కాలువ అనేక చోట్ల కూడుకుపోవడంతో పాటు కాలువలో చెట్ల పొదలు పెరిగిపోయాయి. పలు చోట్ల గండ్లు పడడంతో తూము ద్వారా వచ్చేనీ రు వృథాగా పోతోంది. ఫలితంగా పన్నెండు ఏళ్లుగా కాలువ నిరుపయోగంగా ఉంటోంది.

ప్రతిపాదనలు పంపినా..

రైతుల కోరిక మేరకు బంజరు కాలువ పునరుద్ధర ణకు అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ చూపారు. నాలుగు నెలల క్రితం సం బంధిత అధికారుల ఆధ్వర్యంలో బంజరుమాటు మర మ్మతులతో పాటు కాలువ నిర్మాణానికి సర్వే చేయిం చారు. దీంతో అధికారులు 3.1 కిలోమీటర్ల మేర కాలు వ పునరుద్ధరణకు రూ.3.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ద్ధం చేశారు. కాలువ మొత్తం కాంక్రీట్‌తో నిర్మించ డంతో పాటు గేట్‌వాల్వుతో కూడిన 8తూములు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. ఇటీవల నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, డీఈ, ఏఈలు సందర్శించి సదరు రిపోర్టును నీటిపారుదల శాఖ కమిషనర్‌కు పంపించారు. ఇంకా పరిపాలన పరమైన అనుమతులు రాలేదు. ఈలోగా ప్రభుత్వం మారింది. కొత్త సర్కారు అయినా అనుమతులు ఇస్తుందా లేదా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

కాలువ నిర్మాణంతో రైతులకు ప్రయోజనం..

- కోతి రేణుక-రాములుగౌడ్‌, పాంనూర్‌ సర్పంచ్‌

బంజరుకాలువను పునరుద్ధరిస్తే పాంనూర్‌ రైతులకు మేలు జరుగుతుంది. వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు అదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మారడంతో జాప్యం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

వందలాది ఎకరాలకు సాగునీరు..

- బత్తిని రాజుగౌడ్‌, కాంగ్రెస్‌ నాయకుడు

కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. వందలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా చూస్తాను.

కాంగ్రెస్‌ సర్కారు స్పందించాలి..

- బత్తిని అశోక్‌గౌడ్‌, బంజరు కాలువ సాధన కమిటీ కన్వీనర్‌

బంజరుమాటు నిండా నీళ్లు ఉండి కూడా ఉపయోగం ఉండడంలేదు. దశాబ్ధకాలంగా వందలాది ఎకరాల ఆయక ట్టు సాగుకు నోచుకోవడంలేదు. డీపీఆర్‌ సిద్దమైనప్పటికీ పనులు ప్రారంభం అవుతాయనుకున్న తరుణంలో ప్రభు త్వం మారింది. దీంతో పనులు జరుగుతాయో, లేదో అనే అనుమానం కల్గు తోంది. కాంగ్రెస్‌ సర్కారు వెంటనే స్పందించి పనులకు అనుమతి ఇవ్వాలి.

Updated Date - Jan 08 , 2024 | 11:34 PM