ప్రత్యేక పాలన వైపు అడుగులు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:22 AM
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనుంది. నిర్ణీత కాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే జనవరి మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగలడంతో ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరగవనేది తేలిపోయింది.
ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం
అఽధికారుల జాబితా రూపకల్పనకు ఆదేశాలు జారీ
పల్లె పాలనకు కసరత్తు చేస్తున్న యంత్రాంగం
ప్రభుత్వ ఉత్వర్వులే తరువాయి...
జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు
పెండింగ్ బిల్లులపై సర్పంచ్‌ల ఆవేదన
జఫర్‌గడ్, జనవరి 28 : గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనుంది. నిర్ణీత కాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే జనవరి మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగలడంతో ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరగవనేది తేలిపోయింది. పంచాయతీల వారీగా ప్రత్యేక అధికారుల నియామకానికి అఽధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మండలాల వారీగా ఆయా శాఖల అఽధికారుల వివరాలు అందించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ కావడంతో జాబితాలను నివేదించారు.
281 పంచాయతీలకు ప్రత్యేకాధికారులు...
2019లో పంచాయతీ ఎన్నికలకు జనవరి 1న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో జనవరి 21, 25, 30వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1న సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. తాజాగా పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక పాలనలో భాగంగా జిల్లాలోని 281 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. అయితే ఇందులో జిల్లాలో 11 సర్పంచ్, 79 వార్డు సభ్యుల స్థానాలు పలు కారణాల వల్ల ఖాళీ ఏర్పడ్డాయి.. ఆ పదవులకు చాలా కాలంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు.
మండల స్థాయి అధికారులకే బాధ్యతలు...
మరో ఐదు రోజుల్లో పాలక మండళ్ల పదవీ కాలం ముగిసిపోనుండడంతో గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అఽధికారు లను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. కార్యదర్శుల కంటే పైహోదాలో ఉండే వారినే ప్రత్యేకాధికారులుగా నియమించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఏయే శాఖల, ఏ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇందులో భాగంగా మండల పరిషత్, రెవెన్యూ, వ్యవసాయ, విద్య, నీటి పారుదల, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన, పశుసంవర్ధక, సంక్షేమ శాఖల అఽధికారుల వివరాలను సేకరించి జాబితాలను మండల అఽధికారులు పంపించగా,.. ఉన్నతాధికారుల ద్వారా వాటిని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. గతంలో వలె ఒక్కో అఽధికారికి రెండు మూడు పంచాయతీల బాధ్యతలు ఇవ్వకుండా.. ఒక్క పంచాయతీకే పరిమితం చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈనెలాఖరు లోగా ప్రత్యేకాధికారుల నియామక ఉత్తర్వులు వెలువడే అవకాఽశం ఉంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక పాలన అమలుకు శ్రీకారం చుడితే ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శులు కార్యనిర్వహణాధికారులుగా ఉంటారు.
సార్వత్రిక ఎన్నికల తరువాతే ..?
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులను స్వీకరించిన విషయం విదితమే. కొద్ది రోజుల్లో ఇంటింటి సర్వే చేపట్టి ప్రభుత్వ మార్గదర్శకాలు, దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. ఈ రిజర్వేషన్లను పదేళ్ల కాలానికి వర్తించేలా గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం చేయడంతో.. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా మార్పులు ఉంటాయా ? వంటి సందేహాల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహి స్తారనే వాదన వినిపిస్తోంది.
బిల్లులపై సర్పంచ్‌ల ఆవేదన...
అభివృద్ధి పనులకు సంబంధించి సర్పంచ్‌లకు బిల్లులు రావాల్సి ఉంది. గ్రామ స్థాయిలో చాలా వరకు పనులను వీరే చేపట్టారు. కొన్ని పనులకు సంబంధించి తరువాత బిల్లులు వస్తాయనే ఉద్ధేశంతో సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు చేశారు. ఇలా ఒక్కో సర్పంచ్‌కి ఆయా పంచాయతీని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉంది. గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదనే విషయమై పలువురు సర్పంచ్‌లు ఆయా సందర్బాల్లో ఆవేదన వ్యక్తం చేయడం, జిల్లా కలెక్టర్లు, గత ఎమ్మెల్యేలు, మంత్రులకు పలుమార్లు విన్నవించుకున్న విషయం విదితమే. కొన్ని నిధులు అందినా.. ఇంకా సింహభాగం రావాల్సి ఉంది. తమకు రావాల్సిన బిల్లులను ఇవ్వడంతో పాటు తమకు పాలనా పరంగా మరికొంత సమయాన్ని ఇచ్చి.. గ్రామాభివృద్ధికి పాటుపడే అవకాశం ఇవ్వాలని నూతన సర్కార్‌ను కోరుతూ జఫర్‌గడ్ మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ ఆదేశాలు రావాల్సి ఉంది : రంగాచారి, జిల్లా పంచాయతీ అధికారి, జనగామ
ప్రత్యేక పాలన అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం ముగియనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా మండలాల్లోని వివిధ శాఖల అధికారుల జాబితాలను నివేదించాం. జిల్లాలోని 12 మండలాల పరిఽఽధిలో 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వస్తే ఇందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.