Share News

ఆగని వేట

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:21 AM

అడవి అంటే పచ్చని చెట్లు.. పారేటి వాగులు.. వంకలు.. పక్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల గెంతులాటలు ఇది పాత మాట.. ప్రస్తుతం ఎండిన నీటి వనరులు.. విద్యుదాఘాతాలు.. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.

ఆగని వేట
వైర్లు స్వాధీనం చేసుకున్న ఫారెస్టు అధికారులు (ఫైల్‌)

వేటగాళ్ల ఉచ్చులో వన్యప్రాణుల విలవిల

అడవిలోకెళ్లేవారికి తప్పని ముప్పు

ప్రశ్నార్థకమవుతున్న అడవి జంతువుల మనుగడ

మహదేవపూర్‌, ఏప్రిల్‌ 24 : అడవి అంటే పచ్చని చెట్లు.. పారేటి వాగులు.. వంకలు.. పక్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల గెంతులాటలు ఇది పాత మాట.. ప్రస్తుతం ఎండిన నీటి వనరులు.. విద్యుదాఘాతాలు.. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. వాటి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో జీవ వైవిధ్యానికి ఎసరు వస్తోంది. దీనికి తోడు వేటగాళ్ల ఉచ్చులతో అరుదైన వన్యప్రాణుల ఆనవాళ్లు కనపడకుండా పోతున్నాయి. పశువుల కాపరులు, ఇటీవల కానిస్టేబుల్‌ సైతం బలైనా వేట నియంత్రణకు రాకపోవడం గమనార్హం.

విద్యుత్‌ తీగలు, ఉచ్చులతో వేట

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో యథేచ్ఛగా వేట కొనసాగుతోంది. మండలంలోని మహదేవపూర్‌, బొమ్మాపూర్‌, ఎలికేశ్వరం, మద్దులపల్లి, అన్నారం, కాళేశ్వరం, పలుగులతో పాటు పలు ప్రాంతాల్లో గుట్టుగా ఉచ్చులు బిగిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. వేసవికాలం కావడంతో దాహార్తి తీర్చుకోవడానికి జంతువులు అడవి దాటి వస్తుండడంతో వేటాడేస్తున్నారు. అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వాగులు, వంకలు, ఒర్రెలు, గ్రామాల శివారు, వ్యవసాయ ప్రాంతాల్లో నీటి వసతి ఉన్న ప్రదేశాలకు దాహం కోసం రాగా వేటగాళ్లు నిఘా పెట్టి వదిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించిన తీగలను, బైండింగ్‌ వైర్లను ఉచ్చులుగా బిగించి విద్యుత్‌ తీగకు అమర్చి కిలోమీటర్ల మేర ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రదేశాలలో పెద్ద లైట్లు వేసి కత్తులు, బడిసెలు, పలు ఆయుధాలతో జంతువులను చంపుతున్నారు. స్థానికంగా కొంత మంది అక్రమార్కులు వన్యప్రాణుల మాంసాన్ని పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ ప్రాంతంలో సైతం వన్యప్రాణుల మాంసాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రెట్టింపు ధర పలకడంతో పట్టణాలకు రహస్యంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పలు ప్రాంతాలలో వేట జరుగుతున్న సమాచారం అటవీ శాఖ అధికారులకు ఉన్నప్పటికీ చూసి చూడనటట్లు వ్యవహరిస్తున్నరని ఆరోపణలున్నాయి.

వేటగాళ్ల ఉచ్చులకు కానిస్టేబుల్‌ బలి

ఫిబ్రవరి 11న సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ, లక్ష్మీ బ్యారేజీ సందర్శనకు వచ్చిన నేపథ్యంలో ముందస్తుగా గ్రేహౌండ్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కూంబింగ్‌ చేపట్టారు.. ఈ క్రమంలో కాటారం- నర్సుపల్లి అడవిలో వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులకు గ్రేహౌండ్స్‌ జూనియర్‌ కమాండో అడే ప్రవీణ్‌ చిక్కుకుని మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు సమన్వయంతో పదిరోజుల పాటు ముమ్మర తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున ఉచ్చులు, వైర్లు , నీలిమందులను స్వాధీనం చేసుకున్నారు..

మహదేవపూర్‌ అటవీ డివిజన్‌ ప్రాంతంలో వేట జరుగుతున్న ప్రదేశాలలో, ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ అధికారలు నిఘా పెట్టాల్సిన అవసరముంది. కానిస్టేబుల్‌ మృతి జరిగిన సమయాలలో కొద్దిరోజులు తనిఖీలు చేసిన పోలీసులు, అటవీశా ఖ అధికారులు కొంత ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉన్నారు. అధికారులు నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. వేటగాళ్ల కదలికలపై కన్నేసి ఉంచి, ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రాంతంలో వన్యప్రాణుల వేట పై నియంత్రణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నిరంతర నిఘా : ఎఫ్‌డీవో వజ్రారెడ్డి

వేసవి కాలంలో అటవీ ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గుతుండడంతో వేటగాళ్లు ఉచ్చులు బిగిస్తున్నారు. నిరంతరం నిఘా పెట్టి ఉచ్చులను స్వాధీనం చేసుకుంటున్నాం. వన్యప్రాణులకు అవసరమైన నీటిని నింపుతున్నాం. వన్యప్రాణుల వేట చేయవద్దని నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా వన్యప్రాణుల వేట చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 25 , 2024 | 12:21 AM