Share News

మరోమారు..

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:25 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) బృందం మరోసారి సందర్శించనుంది. ఈ ప్రాజెక్టులోని పలు పిల్లర్లు కుంగిన తర్వాత రెండోసారి ఇక్కడకు వస్తున్న బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లోపాలు మరమ్మతులకు గల అవకాశాలను అధ్యయనం చేసే అవకాశం ఉంది.

మరోమారు..
కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, బీటలు వారిన పిల్లర్‌ భాగం

నేడు మేడిగడ్డకు ఎన్‌డీఎస్‌ఏ బృందం

కుంగిన తర్వాత రెండోసారి డ్యామ్‌సేఫ్టీ అఽథారిటీ బృందం రాక

ఉదయం మేడిగడ్డ, మధ్యాహ్నం అన్నారం బ్యారేజీల పరిశీలన

ప్రాజెక్టు లోపాలు, పునరుద్ధరణ అవకాశాలపై అఽధ్యయనం

కీలకం కానున్న సిఫారసులు

భూపాలపల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) బృందం మరోసారి సందర్శించనుంది. ఈ ప్రాజెక్టులోని పలు పిల్లర్లు కుంగిన తర్వాత రెండోసారి ఇక్కడకు వస్తున్న బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లోపాలు మరమ్మతులకు గల అవకాశాలను అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఉదయం భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌, మధ్యాహ్నం అన్నారం సరస్వతి బ్యారేజీలను జాతీయ ఆనకట్టల భద్రత విభాగం నిపుణులు పరిశీలించను న్నారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడోబ్లాకులో పిల్లర్‌ నెంబర్‌ 19, 20, 21 కుంగిన విష యం తెలిసిందే. దీంతో మేడిగడ్డ బ్యారేజ్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై రాజకీయంగా ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతులకు గల అవకాశాలను అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కోరడంతో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వ నుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఎన్‌డిఎస్‌ఏ నిపుణుల బృందం ఒక దఫా ప్రాజెక్టును సందర్శించి వెళ్ళింది. ఈ పరిణామాల క్రమంలో ప్రభుత్వం మార డం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కాళేశ్వరం ప్రాజె క్టు వ్యవహారం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందు వుగా మారింది. ఇటీవలే అధికార కాంగ్రెస్‌, ప్రధాన విప క్షమైన బీఆర్‌ఎస్‌ నేతలు పోటాపోటీగా ప్రాజెక్టు సందర్శ న కార్యక్రమాలు చేపట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసు కున్నారు. కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతిన్న పిల్లర్లను మరమ్మతు చేయాల్సింది పోయి పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలకు ప్రాజెక్టును అస్త్రంగా వాడుకుంటోందం టూ బిఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగడంతో ప్రభుత్వం వీలైనంత తొందర గా ఈ రెండు ప్రాజెక్టుల భవితవ్యాన్ని తేల్చాలంటూ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి లేఖ రాయడంతో ప్రస్తుతం నిపుణుల కమిటీ అధ్యయనానికి శ్రీకారం చుట్టింది...

బృందం పర్యటన సాగనుందిలా..

కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను అధ్యయనం చేసేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం గురువారం రోజంతా మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను సుదీర్ఘంగా అధ్యయ నం చేయనుంది. ఉదయం 9గంటలకు ఎన్‌డీఎస్‌ఏ బృందం మేడిగడ్డ చేరుకొని అల్పాహారం తర్వాత 9.30 గంటలకు బ్యారేజీ తనిఖీల ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు దెబ్బతిన్న పిల్లర్లు, డిజైన్ల లోపాలు, నిర్మాణ నాణ్యత, మరమ్మతులకు గల అవకా శాలు లాంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చే స్తుంది. మధ్యాహ్నం ఒకటిన్నరకు మేడిగడ్డ వద్ద భోజ నం ముగించుకుని రెండున్నర గంటలకు అన్నారం సర స్వతి బ్యారేజ్‌ వద్దకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.15 నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు సరస్వతి బ్యారేజ్‌ని పరిశీలించి నేరుగా రామగుండం వెళుతుంది. ఆ మరుసటి రోజు సుందిళ్ల బ్యారేజ్‌ని తనిఖీ చేయనున్నారు.

నిపుణుల కమిటీ సిఫారసులే కీలకం

దెబ్బతిన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజీల భవితవ్యాన్ని ఎన్‌డిఎస్‌ఏ నిపుణుల బృందం ఇచ్చే నివేదికలే తేల్చనున్నాయి. నిపుణుల కమిటీ ప్రధానంగా 19 అంశాలపై సమాచారం అడిగినందున తనిఖీలలో వాటి పైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్‌ మొదలు క్వాలిటీ కంట్రోల్‌, నిర్వహణ లాంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. దెబ్బతిన్న ఏడో బ్లాకులోని పిల్లర్ల మరమ్మతులకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? మరమ్మతులు చేయిస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుంది? దెబ్బతిన్న పిల్లర్ల స్థానంలో మళ్లీ పునర్నిర్మించాలా? వద్దా? అనే అంశాలను నిపుణులు తేల్చే అవకాశాలున్నాయి.

ఎప్పుడేం జరిగిందంటే..

గతేడాది అక్టోబర్‌ 21న బ్యారేజీలోని బ్లాక్‌-7లో పెద్ద పెద్ద శబ్దాలతో 20వ పిల్లర్‌ అడుగుమేర కుంగిపోయింది. దీంతో బ్యారేజీ పైనుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ మరుసటిరోజైన 22న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బ్యారేజీ, కుంగిన ప్రాంతాన్ని సందర్శించారు. 24న కేంద్ర జలశక్తి శాఖ, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పరిశీలన. 25న 200మంది రైతులతో పొన్నం ప్రభాకర్‌ బ్యారేజీ సందర్శించారు. నవంబర్‌ 2న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి నాటి ప్రభుత్వ వైఫల్యాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అలాగే నవంబరు 4న కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి కూడా మేడిగడ్డకు చేరుకుని కుంగిన వంతెనను పరిశీలించారు. ఆ తర్వాత 6వతేదీన కోదండరాం పరిశీలించారు. ఇక కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక డిసెంబరు 29న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తదితరులు బ్యారేజీని సందర్శించిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఇక ఈ ఏడాది జనవరి 9న విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ ఎస్పీ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌ హౌజ్‌, మహాదేవపూర్‌ లోని ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 13న రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ సభ్యుల ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ పర్యటించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని పనికిరాకుండా చేసిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దానికి దీటుగా మార్చి 1న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి.. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి తమపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

Updated Date - Mar 06 , 2024 | 11:25 PM