Share News

మోగిన ‘పట్టభద్రుల’ నగారా

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:06 AM

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో ఆతర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఈ పట్టభద్రుల స్థానానికి నిబంధనల ప్రకారం జూన్‌ 8వ తేదీలోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

మోగిన ‘పట్టభద్రుల’ నగారా

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం

మూడు ఉమ్మడి జిల్లాల్లో 4.63లక్షల గ్రాడ్యుయేట్‌ ఓటర్లు

ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న ఖరారు

బీఆర్‌ఎస్‌ నుంచి వాసుదేవరెడ్డి పేరు పరిశీలన

మళ్లీ గుజ్జుల వైపే బీజేపీ మొగ్గు!

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి - వరంగల్‌)

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో ఆతర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఈ పట్టభద్రుల స్థానానికి నిబంధనల ప్రకారం జూన్‌ 8వ తేదీలోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు పూర్తవగా.. మొత్తం 4.63లక్షల మందితో ఓటరు జాబితాను సిద్ధం చేశారు. అయితే ఇందులో మహిళ ఓటర్ల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహరచనలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టభద్రుల స్థానంలోనూ పట్టు బిగించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించగా, బీఆర్‌ఎస్‌, బీజేపీలు తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి.

పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక...

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చి 14న ఎన్నికలు నిర్వహించారు. ఆరేళ్ల పదవీకాలంతో జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. 2027 మార్చి 13వ తేదీ వరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పదవీకాలం ఉన్నప్పటికి, గతేడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో 2023 డిసెంబరు 9న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఆ గడువు జూన్‌ 8వ తేదీ వరకు ఉంది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అభ్యర్థి 2027 మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు.

గులాబీ కోటపై కాంగ్రెస్‌ నజర్‌

నల్లొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలువాలని కాంగ్రెస్‌ లక్ష్యం పెట్టుకుంది. శాసనమండలిలో కాంగ్రె్‌సకు మెజార్టీ లేకపోవటంతో ప్రతి ఎమ్మెల్సీ ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీంతో నల్లొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2007లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, అప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఈసారి పక్కాగా పాగా వేయాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. 2021 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటి చేసిన రాములునాయక్‌ నామమాత్రపు పోటీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన తీన్మార్‌ మల్లన్నను ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే తృతీయ స్థానంలో నిలిచిన ప్రొఫెసర్‌ కోదండరాం ప్రస్తుతం కాంగ్రె్‌సకు మద్దతుగా ఉండటంతో ఈసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్‌ ఉంది. దీనికితోడు కాంగ్రెస్‌ పార్టీ ఈసారి భారీ ఎత్తున గ్రాడ్యుయేట్స్‌ ఓట్లను నమోదు చేసింది. తన నియోజకవర్గ పరిధిలో సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్‌ ఓట్లను నమోదు చేయాలని ఎమ్మెల్యేకు పార్టీ టాస్క్‌ ఇచ్చింది. ఎమ్మెల్యేలు లేని చోట కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో పట్టభద్రుల ఓట్ల కోసం ఎమ్మెల్యేలు ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సకు చెందినవారే అధికంగా ఉండటంతో గులాబీ కోటాలో పాగా వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీల కసరత్తు...

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల హడావిడిలో ఉన్న పార్టీలకు ఎమ్మెల్సీ ఉపఎన్నిక సవాల్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తీన్మార్‌ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. అప్పట్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మల్లన్నకు బీసీ సామాజిక వర్గం నుంచి భారీగా ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రావటంతో మల్లన్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అలాగే గత మూడు పర్యాయాలు ఈ స్థానంలో పాగా వేసిన బీఆర్‌ఎస్‌ ఈసారి కూడా జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. కేయూ జాక్‌ నేత, తెలంగాణ ఉద్యమకారుడు కే.వాసుదేవరెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. గత పదేళ్లు వికలాంగుల సంస్థ చైర్మన్‌గా పని చేసిన వాసుదేవరెడ్డి ఎమ్మెల్సీ స్థానంపై గురి పెట్టి ఓటరు నమోదు చేపట్టారు. మరోవైపు బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరు అనేది చర్చనీయాశంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారా లేదంటే కొత్త అభ్యర్థిని బరిలో దించుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి బీజేపీకి చెందిన పది మందికి పైగా ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటం, ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల సందడి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక రావడంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సాగనుందిలా..

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 2వ తేదీన ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు నల్గొండ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 27వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌, జూన్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Updated Date - Apr 26 , 2024 | 12:06 AM