Share News

సౌరవిద్యుత్‌కు శ్రీకారం

ABN , Publish Date - May 21 , 2024 | 11:53 PM

రోజు రోజుకూ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. విద్యుత్‌ ఆధారిత అవసరాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో విద్యుత్‌ ఉత్పాదకతపై ప్రభుత్యాలు ప్రత్యేకంగా దృష్టిని సారించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కుసుమ్‌ (ప్రధాన మంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్‌ మహా భియాన్‌)యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది.

సౌరవిద్యుత్‌కు శ్రీకారం
సోలార్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన వడ్డిచర్ల 33/11కెవి సబ్‌స్టేషన్‌

త్వరలో సబ్‌స్టేషన్లలో సోలార్‌ యూనిట్లు

పీఎం కుసుమ్‌ యోజన ద్వారా ఏర్పాటు

జిల్లాలో 11 చోట్ల స్థలాలను గుర్తించిన అధికారులు

ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్‌ శాఖ

లింగాలఘణపురం, మే 21: రోజు రోజుకూ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. విద్యుత్‌ ఆధారిత అవసరాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో విద్యుత్‌ ఉత్పాదకతపై ప్రభుత్యాలు ప్రత్యేకంగా దృష్టిని సారించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కుసుమ్‌ (ప్రధాన మంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్‌ మహా భియాన్‌)యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది. దీని కింద సోలార్‌ విద్యుత్‌ (సౌరవిద్యుత్‌)యూనిట్ల ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వంతో అనుసంధానమై జిల్లాల్లో ఇప్పటికే కొనసాగుతున్న విద్యుత్‌ ఉపకేంద్రాల్లో(33/11కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్లు) అనుకూలంగా ఉన్న స్థలాలను గుర్తించిన విద్యుత్‌ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

భౌగోళికంగా జిల్లా అనుకూలం..

దక్కన్‌ పీఠభూమిలోనే ఎత్తైన ప్రాంతమైన జనగా మ జిల్లా సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప టికే గుర్తించాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనే సౌరవి ద్యుత్‌ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణం, అధిక ఉష్ణోగ్రతల నమోదు, ప్లేన్‌ ఏరియా జనగామ జిల్లా లో ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల సౌర విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుపై అధికారులు చిత్తశుద్ధితో చొరవ చూపగలిగితే జిల్లాలో త్వరలో సోలార్‌ వెలుగులు విరజిమ్మే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

11 సబ్‌స్టేషన్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు..

జనగామ జిల్లాలో సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుకూలమైన 11 సబ్‌స్టేషన్‌లను ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. ఇందులో మొండ్రాయి సబ్‌స్టేషన్‌(చెరువుముందు తండా), బచ్చన్నపేట(ఆలింపూర్‌), చిలుపూర్‌ (పల్లగుట్ట), ఉప్పుగల్లు, వడ్డిచర్ల, పసరమడ్ల(పెద్దరాంచర్ల), పడమటి కేశ్వాపూర్‌(గంగాపూర్‌), సింగరాజుపల్లి (పెద్దమడూర్‌), నమిలిగొండ, అబ్దుల్‌నాగారం (గండిరామారం), కొడకండ్ల సబ్‌స్టేషన్లను ఎంపిక చేస్తూ కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు అవసరమైన ప్రతిపాదనలను పంపారు.

ఒక్కో యూనిట్‌కు రూ. 4.25 కోట్లు..

పెరుగుతున్న విద్యుత్‌ అవసరాల దృష్ట్యా ముందుచూపుతో అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రప్రభుత్వం ఒక్కో సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం రూ.4.25 కోట్లు కేటాయిస్త్దుఇ. ఈ లెక్కన జనగామ జిల్లాలోని 11 ప్రతిపాదిత సబ్‌స్టేషన్ల పరిధి యూనిట్లకు మొత్తంగా రూ. 46.75 కోట్లు పీఎం కుసుమ్‌ పథకం ద్వారా నిధులను మంజూరు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్ల నిర్వహణను ఆయా సబ్‌స్టేషన్ల పరిధి స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా సంఘాలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. క్షేత్రస్థాయిలో అన్ని పరిస్థితులు అనుకూలిస్తే కేంద్రం సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తుంది. అయితే సోలార్‌ యూనిట్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుండటం గమనార్హం.

3.75 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంచనా..

జిల్లాలోని 11 సబ్‌స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ యూనిట్ల ద్వారా మొత్తం 3.75 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అధికారులు అంచనాలను రూపొందించారు. ప్రధానంగా మొండ్రాయి (చెరువుముందు తండా)ప్రతిపాదిత సోలార్‌ యూనిట్‌ ద్వారా 1 మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి, అదేవిధంగా బచ్చన్నపేట(ఆలింపూర్‌) సబ్‌స్టేషన్‌ ప్రతిపాదిత సోలార్‌ యూనిట్‌లో 0.50 మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తిని చేయనుండగా మిగతా 9 ప్రతిపాదిత యూనిట్లలో ఒక్కో యూనిట్‌ నుంచి 0.25 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించారు.

11 ప్రాంతాలను ప్రతిపాదించాం...

- వేణుమాధవ్‌- ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పీఎం కుసు మ్‌ యోజన కింద జిల్లాలో 11 సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాం. క్షేత్ర స్థాయిలో అవసరమైన పూర్తి నివేదికను ప్రభుత్వా నికి అందజేశాం. ప్రభుత్వం నిధులను మంజూరు చేసి సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశిస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.

Updated Date - May 21 , 2024 | 11:53 PM