Share News

పెరిగిన రుణ ప్రణాళిక

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:09 AM

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. యేటా బ్యాంకుల ద్వారా రైతులు, ఇతర వర్గాల వారికి అందించేందుకు గానూ నాబార్డు రుణ లక్ష్యాన్ని ఖరారు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్షిక ప్రణాళికను విడుదల చేసిన అనంతరం జిల్లాల వారీగా అందించాల్సిన రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటిస్తుంది.

పెరిగిన రుణ ప్రణాళిక
జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా (ఫైల్‌)

2024-25కు గాను జిల్లా వార్షిక లక్ష్యం రూ.3632.11 కోట్లు

వ్యవసాయ, పశుసంవర్థక, అనుబంధ రంగాలకు రూ.3064.09 కోట్లు

సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రూ. 459.65 కోట్లు

గత సంవత్సరం కంటే రూ. 589.21 కోట్లు అదనంగా రుణాలు

జనగామ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. యేటా బ్యాంకుల ద్వారా రైతులు, ఇతర వర్గాల వారికి అందించేందుకు గానూ నాబార్డు రుణ లక్ష్యాన్ని ఖరారు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్షిక ప్రణాళికను విడుదల చేసిన అనంతరం జిల్లాల వారీగా అందించాల్సిన రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటిస్తుంది. నాబార్డు ఇచ్చిన రుణ లక్ష్యాన్ని జిల్లాలోని వివిధ బ్యాంకులకు నిర్ధేశించి రుణాలను అందిస్తుంటారు. ఇందులో భాగంగా జనగామ జిల్లాకు సంబంధించిన 2024-25 వార్షిక రుణ ప్రణాళికను ఇటీవల కలెక్టర్‌ ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ అన్ని రంగాలకు కలిపి రూ. 3632.11 కోట్ల రుణాలను ఇవ్వాలని నాబార్డు ప్రకటించింది. దీనికి సంబంధించి కలెక్టర్‌ అధ్యక్షతన జూన్‌లో జరగబోయే డీఎల్‌ఆర్‌సీ (జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ) బ్యాంకుల వారీగా నిర్ధేశించనున్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 3064.09 కోట్లు

2024-25 వార్షిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 3064.09 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. ఇందులో పంట రుణాల కోసం 1663.15 కోట్లు కేటాయించగా వ్యవసాయాభివృద్ధి, గోదాములు, కోల్ట్‌ స్టోరేజీ నిర్మాణం, విత్తనోత్పత్తి తదితర ప్లాంట్ల నిర్మాణాల కోసం ఈఏడాది రూ. 127.54 కోట్లు కేటాయించారు.

అదే విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన ఫుడ్‌, అగ్రో ప్రాసెసింగ్‌, ఇతర వ్యవసాయ అనుబంధ రుణాల కోసం రూ. 465.47 కోట్లు నిర్ధేశించారు. కాగా.. గతేడాది కంటే పంట రుణాలు రూ.70.59 కోట్లను అదనంగా నాబార్డు నిర్దేశించింది. ఈ రుణాల్లో కొత్తవాటితో పాటు రెన్యువల్‌ రుణాలు కూడా ఉంటాయి. గత ఏడాది రూ. 3042.90 కోట్ల రుణ లక్ష్యం కాగా ఈ ఏడాది రూ.3632.09 కోట్లుగా నిర్ణయించారు.

‘ఎంఎస్‌ఎంఈ’లకు రూ. 459.65 కోట్లు

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ఈ ఏడాది రూ. 459.65 కోట్ల రుణాలు ఇస్తారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ రుణాలను అందిస్తారు. గత ఏడాది రూ.297.09 కోట్లను ఇవ్వగా గతేడాది కంటే ఎంఎస్‌ఎంఈ రుణాల కోసం ఈ ఏడాది అదనంగా రూ. 162.56 కోట్లు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ జీవనోపాధి పథకం కింద అందించే రుణాలు ఈ విభాగంలోకి వస్తాయి.

ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.108.36 కోట్లు

2024-25 వార్షిక సంవత్సరానికి గాను ఇతర ప్రాధాన్యత రంగాల కింద రుణాల కోసం రూ.108.36 కోట్లను కేటాయించారు. ఇందులో విద్య, గృహ, పునరుద్ధరణీయ శక్తి, మౌలిక సదుపాయాల కింద రుణాలను అందిస్తారు. విద్యా సంబంధిత రుణాల కోసం రూ. 30.60 కోట్లు, గృహ రుణాల కోసం రూ.68.40 కోట్లు, పునరుద్ధరణీయ శక్తి రుణాల కోసం రూ.1.08 కోట్లు, మౌలిక సదుపాయాల కింద రూ.8.28 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఈ రంగాలకు రూ.94.47 కోట్లను కేటాయించగా ఈ ఏడాది రూ.108.36 కోట్లకు పెంచారు. ఇది గత ఏడాది కంటే రూ. 13.89 కోట్లు అదనం.

జూన్‌లో బ్యాంకుల వారీగా లక్ష్యాలు

- శ్రీధర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, జనగామ

జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 3632.11 కోట్ల రుణాలను ఇవ్వాలని నాబార్డు నిర్ధేశించింది. గత ఏడాది రుణ లక్ష్యాన్ని పూర్తి చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నాబార్డు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలను అందిస్తాం. జిల్లాలో బ్యాంకుల వారీగా ఏయే బ్యాంకు ఎన్ని రుణాలు ఇవ్వాలన్న దానిపై జూన్‌లో జరిగే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ధేశిస్తాం.

Updated Date - Mar 26 , 2024 | 12:09 AM