ప్రశ్నార్థకంగా...‘పంచాయతీ’ సమరం!
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:19 AM
రాష్ట్రంలో ‘పంచాయతీ’ సమరం.. ప్రశ్నార్థకంలో పడింది. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం మరో 20 రోజుల్లో ముగియనుంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘పంచాయతీ’ సమరంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపో వడంతో ఇప్పట్లో ఎన్నికలను నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది.

20 రోజుల్లో ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం
ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం
ప్రత్యేక అధికారులా.. పర్సన్ ఇన్‌చార్జిలా..?
ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు మృగ్యం
పార్లమెంటు ఎన్నికలపై ‘స్థానిక’ ప్రభావం
వాయిదా వేయడమే మంచిదన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం
సకాలంలో నిర్వహించకపోవడంతో ‘ప్రత్యేక’ పాలన
సర్పంచ్‌లుగా పోటీ చేస్తామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యే అవకాశం
రఘునాథపల్లి, జనవరి 11: రాష్ట్రంలో ‘పంచాయతీ’ సమరం.. ప్రశ్నార్థకంలో పడింది. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం మరో 20 రోజుల్లో ముగియనుంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘పంచాయతీ’ సమరంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపో వడంతో ఇప్పట్లో ఎన్నికలను నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. మూడు నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలపై స్థానిక ఎన్నికల ప్రభావం చూపే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదని కొత్త ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు అవగతమవుతుంది. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం 20 రోజుల్లో ముగుస్తుండడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన, లేకుంటే పర్సన్ ఇన్‌చార్జీలుగా సర్పంచ్‌లను నియమిం చాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005, 2011లో ఇలాగే పంచాయతీపాలక వర్గాల పదవీకాలం ముగిశాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పర్సన్ ఇన్‌చార్జిల పాలనకు మరోసారి ప్రత్యేక అధికారుల పాలనకు తెరలేపింది. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహికులకు తాజా పరిణామాలు ఆశని పాతంగా మారాయి. జనగామ జిల్లాలో 281 గ్రామ పంచాయతీ లలో 6,95,125 మంది ఓటర్లు ఉన్నారు.
రిజర్వేషన్లపై సందిగ్ధం
జిల్లాలోని 281 గ్రామాలకు 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరిగాయి. జనవరి 21న మెదటి విడత, జనవరి 25న రెండో విడత, జనవరి 30న మూడోవిడత ఎన్నికలు జరిగా యి. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2న సర్పంచ్‌ల పదవీ ప్రమాణస్వీకారం జరిగింది. పంచాయతీలకు ఐదేళ్లకో సారి తాజా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తోంది.అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్ట సవరణచేసి స్థానిక సంస్థల్లో కాల పరిమితిని ప్రతి పదేళ్లకోసారి సవరించాలని నిర్ణయించింది. దీంతో ఒకసారి రిజర్వేషన్ ప్రకటిస్తే ఆ కేటగిరీ వారు రెండుసార్లు పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారమైతే గత ఎన్నికల్లో పంచాయతీలకు కేటాయించిన రిజర్వేషన్లే ఈ సారి అమలు చేయాలి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం కొలువుదీరడంతో ఐదేళ్ల కిందట ఖరారు చేసిన రిజర్వేషన్లను కొనసాగించడానికి సుముఖంగా లేదు. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగుస్తుంది. మూడు నెలల్లో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పం చాయతీ ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే కొత్త రిజర్వేషన్ ప్రక్రియ ద్వారానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు అవగతమవుతుంది.
ఎన్ని‘కలే’నా..
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సర్పంచ్‌గా పోటీ చేస్తామని కలలు కన్న అభ్యర్థుల ఆశలు ఎన్ని‘కల’గా నే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టినందున పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగితే అలవోకగా సర్పంచ్‌లుగా ఎన్నికవొ చ్చని కలలుగన్న అధికార పార్టీకి చెందిన నాయకుల ఆశలు.. అడియాశలు గానే ఉండిపోయాయి. మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక అభ్యర్థిని బల పరిస్తే మరో అభ్యర్థి పార్టీకి దూరమయ్యే అవకాశానికి తావి స్తే ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పడే అవకాశముందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆది ష్టానం పార్లమెంటు ఎన్నికలు ముగిశాకనే పంచాయ తీ ఎన్నికలను నిర్వహించడానికి మొగ్గు చూపుతుంది.
ప్రత్యేక అధికారులా.. పర్సన్ ఇన్‌చార్జిలా..?
పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం లేనందున ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల పాలన ప్రత్యేక అధికారుల చేతికా.. పర్సన్ ఇన్‌చార్జీల చేతికి వెళ్తుందా అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జీవో నంబర్ 113 ప్రకారం గ్రామ పంచాయ తీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుంటే ప్రత్యేక అధికా రులను గాని, లేదా ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్స న్ ఇన్‌చార్జీలుగా నియమించే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి ఉంది. ప్రత్యేక అధికారులను నియమిస్తేనే పంచాయతీల్లో పాలన సాఫీగా సాగే అవకాశ ముంద ని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో మెజార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లను పర్సన్ ఇన్‌చార్జీలు గా నియమించేందుకు రాష్ట్రంలో కొత్తగా అధికా రం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత చూపకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగేవరకు ప్రత్యేక అధికారు లను నియమించే అవకాశాలే మెండుగా ఉన్నాయని రాజకీ య పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో 2005లో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయిన వెంటనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాటు సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించింది. తదనం తరం 2011లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియ గానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 నుంచి 2013 వరకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ప్రత్యేక అధికారుల పాలనకు కసరత్తు..!
పాలకవర్గాల పదవీకా లం 20 రోజుల్లో ముగియనున్నందున.. ప్రతీ గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారి ని నియమిం చేందుకు ఉన్నతా ధికారుల ఆదేశాల మేర కు ఇప్పటినుంచే పంచా యతీ రాజ్‌శాఖ అధికా రులు కసరత్తు ప్రారం భించారు. ప్రత్యేక అధికా రులుగా ఎంపీడీవోతో పాటు తహసీల్దార్, ఎంపీవో, ఆర్‌ఐలు, సర్వేయర్లు, ఎంఈవోలు, ఈజీఎస్, ఐకేపీ సిబ్బం దిని ఎంపిక చేసే కార్యక్రమంలో పంచా యతీరాజ్‌శాఖ అధికారులు తలమునకలవు తున్నారు.