Share News

వసూలు అయ్యేదెలా?!

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:07 AM

తెలం గాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక 24 గంటల విద్యుత్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

వసూలు అయ్యేదెలా?!

పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేదెలా..?

జిల్లాలో పెండింగ్‌ బిల్లులు రూ.74.56 కోట్లు

సర్కార్‌ ఆఫీసుల నుంచి రావాల్సినవి రూ.14.87 కోట్లు

మహబూబాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలం గాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక 24 గంటల విద్యుత్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆస్తులు పెంచామని బీఆర్‌ఎస్‌, అప్పులు చేశారని కాంగ్రెస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లలో పరస్పర విమర్శల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగించిన సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధిలైట్లు, ఇతరత్రా బకాయిలు పెద్ద ఎత్తున పేరుకు పోయి ఉండడం చర్చనీయాంశమవుతోంది. గిరిజన జిల్లా మహబూబాబాద్‌లోనే దాదాపు రూ.74 కోట్లకు పైగా బకాయిలు ఉండడం అందులోనూ.. ప్రభుత్వ కా ర్యాలయాల పెండింగ్‌ బిల్లులే సుమారు రూ.15 కోట్లకు పేరుకుపోవడం చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌ బిల్లులు పెద్దఎత్తున ఉండడం అతిశయోక్తి కాకపోవచ్చు...!

జిల్లాలో పెండింగ్‌ బిల్లులు ఇవి...

మహబూబాబాద్‌ జిల్లాలో విద్యుత్‌ శాఖలో తొర్రూ రు, మహబూబాబాద్‌ డివిజన్లు ఉండగా మొత్తంగా 18 మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,28,688 అన్ని రకాల విద్యుత్‌ మీటర్ల ద్వారా రూ.74.56 కోట్లు బకాయిలు పేరుకుపోగా, ఇందులో పెద్ద మొత్తంలో సర్కార్‌ కార్యాలయాలకు సంబంధిం చిన బకాయిలు రూ.14.87 కోట్లు ఉండడం గమనార్హం. అనేక సంవత్సరాలుగా పలు శాఖలకు సంబంధించిన కార్యాలయాల విద్యుత్‌ బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లిం చకపోవడంతో ఏకంగా ఒక్క మహబూబాబాద్‌ జిల్లా లోనే సుమారు రూ.15 కోట్ల వరకు బకాయిలు పడడం చూస్తే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్కార్‌ విద్యుత్‌ బకాయిలు ఏ విధంగా ఉంటాయో అర్థమవు తోంది. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీ లకు సంబంధించిన 2,987 మీటర్లకు రూ.2.86 కోట్లు విద్యుత్‌ శాఖకు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంది. మంచినీటి బావులు 1,297 మీటర్ల ద్వారా రూ.6.31 కోట్లు, ఎస్సీ కాలనీలకు సంబంధించిన 12,501 మీటర్లు ఉండగా రూ.4.82 కోట్లు విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గిరిజన తండాలకు సంబంధించి 51,428 మీటర్ల ద్వారా రూ. 18.55 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. వ్యవసాయ బావులకు సంబంధించి రూ.9.07 కోట్లు బకాయిలు పడ్డాయి. ఇలా జిల్లాలో మొత్తంగా రూ.74.56 కోట్లు విద్యుత్‌ వినియోగదారులు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంది.

సెక్షన్‌ల వారీగా పరిశీలిస్తే...

జిల్లాలోని తొర్రూరు, మానుకోట డివిజన్ల పరిధిలోని 18 మండలాల్లో రూ.74.56 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. ఇందులో మహబూబాబాద్‌ డివిజన్‌లో 2,02,066 మీటర్లకు గాను రూ.46.46 కోట్లు, తొర్రూరు డివిజన్‌లో 1,26,622 మీటర్లకు రూ.28.10 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందులో సెక్షన్‌ల వారీగా పరిశీలిస్తే మానుకోట డివిజన్‌లోని మహబూబాబాద్‌ రూరల్‌లో అత్యధికంగా 23,776 విద్యుత్‌ మీటర్లకు గాను రూ.7.06 కోట్లు ఉండగా, అత్యల్పంగా తొర్రూరు డివిజన్‌లోని చిన్నగూడూరు పరిధిలో 5,833 మీటర్లకు గాను రూ.1.53 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక మానుకోట డివిజన్‌ పరిధిలోని మహబూబాబాద్‌ టౌన్‌–1లో 15,283 మీటర్లకు గాను రూ.2.54 కోట్లు, మహబూబాబాద్‌ టౌన్‌–2 పరిధిలో 13,380 మీటర్లు ఉండగా రూ.2.02 కోట్లు, కేసముద్రం పరిధిలో 17,460 మీటర్లకు రూ.4.17 కోట్లు, ఇనుగుర్తి పరిధిలో 11,509 మీటర్లకు రూ.2.37 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి.

అయోధ్యపురంలో 11,664 మీటర్లకు రూ.2.71 కోట్లు, గూడూరులో 11,379 మీటర్లకు రూ.2.60 కోట్లు, కొత్తగూడలో 15,866 మీటర్లకు రూ.6.67 కోట్లు, కురవిలో 16,378 మీటర్లకు రూ.5.12 కోట్లు, సీరోలులో 9,572 మీటర్లకు రూ.2 కోట్లు, డోర్నకల్‌లో 21,756 మీటర్లకు రూ.5.94 కోట్లు, గార్లలో 15,870 మీటర్లకు గాను రూ.3.23 కోట్లు, కొత్తపేటలో 18,193 మీటర్లకు రూ.2.95 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక తొర్రూరు టౌన్‌లో 19,435 మీటర్లకు రూ.3.46 కోట్లు, చిన్నవంగరలో 15,424 మీటర్లకు రూ.2.83 కోట్లు, పెద్దవంగరలో 11,264 మీటర్లకు రూ.2.14 కోట్లు, నెల్లికుదురులో 11,114 మీటర్లకు రూ.2.30 కోట్లు, మునిగలవీడు 10,898 మీటర్లకు రూ.3 కోట్లు, దంతాలపల్లిలో 12,666 మీటర్లకు రూ.2.19 కోట్లు, నర్సింహులపేట 10,436 మీటర్లకు రూ.1.99 కోట్లు, మరిపెడలో 19,308 మీటర్లకు రూ.6.34 కోట్లు, ఎల్లంపేటలో 10,304 మీటర్లకు రూ.2.29 కోట్ల విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి.

Updated Date - Jan 09 , 2024 | 12:07 AM