హలధారి అరిగోస
ABN , Publish Date - Feb 16 , 2024 | 12:10 AM
పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అహర్నిశలు శ్రమించి పండించిన మిర్చిపంటను విక్రయించుకోవడానికి అవస్థలను ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి బస్తాలు బుధవారం భారీగా రావడంతో యార్డు అంతా ఎర్రబంగారంతో కళకళలాడింది. సుమారు 23 వేల నుంచి 24 వేల వరకు బస్తాలను రైతులు తీసుకురాగా.. రైతులు లాట్ నెంబర్ గేట్ ఎంట్రీ కోసం, వేలం పాటలకు, కాంటాల కోసం రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి నిరీక్షణ
మానుకోట మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం
బుధవారం ఒక్కరోజే 24 వేల మిర్చి బస్తాల రాక
నాలుగు రోజులుగా యార్డులోనే రైతుల ఇబ్బందులు
లాట్ల వద్దే భోజనాలు.. ‘సద్దిమూట’ అమలవక అవస్థలు
మహబూబాబాద్ అగ్రికల్చర్, ఫిబ్రవరి 15 : పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అహర్నిశలు శ్రమించి పండించిన మిర్చిపంటను విక్రయించుకోవడానికి అవస్థలను ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి బస్తాలు బుధవారం భారీగా రావడంతో యార్డు అంతా ఎర్రబంగారంతో కళకళలాడింది. సుమారు 23 వేల నుంచి 24 వేల వరకు బస్తాలను రైతులు తీసుకురాగా.. రైతులు లాట్ నెంబర్ గేట్ ఎంట్రీ కోసం, వేలం పాటలకు, కాంటాల కోసం రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
రైతుల ఆందోళనతో పెరిగిన రాబడులు..
మానుకోట వ్యవసాయ మర్కెట్‌కు మంగళవా రం 10వేల బస్తాలకు పైగా మార్కెట్ యార్డుకు మిర్చి వచ్చింది. సాయంత్రం ధరల విన్నర్ లిస్టు ప్రకటించడం, ఆ తర్వాత ధరలు తగ్గిపోవడంతో రైతులు ఒక్కసారిగా మార్కెట్ కార్యాలయాన్ని ము ట్టడించి, జాతీయ రహదారిపై ధర్నా, ఆందోళన ని ర్వహించారు. వేలం పాటలు జరిగినప్పటికి కాంటా లు కాకపోవడంతో సరుకు యార్డులోనే ఎక్కడికక్క డే నిలిచిపోయింది. మిగిలిన ఆ సరుకుతో పాటు మంగళవారం రాత్రి వచ్చిన మిర్చితో యార్డు మొత్తం బస్తాలతో నిండిపోయింది. మార్కెట్‌లోని షెడ్లు అన్నినిండిపోయి.. 24 వేల బస్తాల వరకు రాబడులు కొనసాగాయి. బుధవారం ఉదయం వర కు భారీ ఎత్తున మిర్చి రాబడులతో లాట్ నెంబర్లు, గేట్ పాస్‌ల టోకెన్‌ల కోసం రైతులు మార్కెట్ కార్యాలయానికి ఎగబడ్డారు. దీంతో మార్కెట్ అధి కారులు రెండు క్యూలైన్లు ఏర్పాటు చేసి టోకెన్లను పంపిణీ చేశారు. ఈ సరుకు మొత్తం శుక్రవారం నాటి వరకు పూర్తిగా తూకం వేసి యార్డు ఖాళీ చేసేందుకు మార్కెట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
రైతుల పడిగాపులు..
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు గత ఆదివారం రోజున 10వేల బస్తాల వరకు మిర్చి రాబడులే కొనసాగాయి. గ్రా మాల నుంచి మిర్చి బస్తాలు అధికంగా రావడంతో, రోజుకు 4 వేల బస్తాల వరకు మాత్రమే వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు. దీంతో మరుసటి రోజు వచ్చిన మిర్చితో పాటు యార్డులో మిగి లిపోయిన మిర్చితో భారీగా సరుకులు చేరుకుంటున్నాయి. దీంతో యార్డులోనే రైతులు రాత్రి, పగలు పడిగాపులు కాయాల్సిన పరి స్థితి వచ్చింది. రాత్రిళ్లు చలిగాలులు బాగా వీస్తుండడంతో మిర్చి ఘాటకు రైతులు నానా ఆగచాట్లు పడుతూ.. కొందరు నిద్రపొ కుండా జాగారం చేస్తుండగా, మరికొందరు మిర్చి బస్తాలపైనే నిద్రించి సరుకును రక్షించుకుంటున్నారు.
‘సద్దిమూట పథకం ఏది?
మార్కెట్ యార్డులలో రూ.5లకే భోజన పథకం (సద్దిమూట) పథకం అమల్లో ఉంది. అయితే మహబూబాబాద్ మార్కెట్‌లో మాత్రం ఇది కొనసాగడం లేదు. పక్కనే ఉన్న కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మాత్రం సద్దిమూట పథకం అమల్లో ఉంది. అక్కడ విజయవంతంగా నడుస్తున్నప్పటికి మహబూబాబాద్‌లో మాత్రం ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. మహబూబాబాద్ మార్కెట్‌కు సుదూర ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి పండించిన మిర్చిని రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో యార్డులో భారీగా సరుకులు రావడంతో.. దానిని వేలం పాటలు అయి.. తూకం పూర్తయ్యే వరకు మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. దాంతో ఆ మూడు, నాలుగు రోజులు యార్డు లోనే రైతులు నిరీక్షిస్తున్నారు. అలాంటి సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన సద్దిమూట పథకం అమల్లో లేకపోవడంతో రైతులు హోటళ్ల నుంచి భోజనం తీసుకువచ్చి కడుపునింపుకుంటున్నారు. దాంతో రైతుల కు అదనపు ఖర్చులు అవుతున్నాయి.
మార్కెట్ ధరలు ఇలా..
బుధవారం మహబూబాబాద్ మార్కెట్‌లో మిర్చి తేజరకం క్వింటాలుకు గరిష్ట ధర రూ.21,689 కనిష్ట ధర రూ.9,310, సగటున రూ.19,319 ధర పలికింది. తాలు రకం మిర్చి గరిష్ట ధర రూ.11,375, కనిష్ట రూ.7,510, సగటున రూ.11,225 ధర పలికింది.
యార్డులోనే ఉంటున్నా.. : గుగులోతు నర్సింహా, రైతు, బొద్దుగొండ, గూడూరు
నేను పది బస్తాల మిర్చిని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం తీసుకు వచ్చాను. వేలం పాటలు అయినప్పటికి తూకాలు కాలేదు. నాలుగురోజులు అవుతున్నా.. ఏ సమయంలో తూకం అవుతుందో.. లేదో తెలియడం లేదు.
మార్కెట్ నిల్వసామర్థ్యం తక్కువ : శంషీర్, మార్కెట్ కార్యదర్శి, మహబూబాబాద్
మానుకోట వ్యవసాయ మార్కెట్ యార్డు కేవలం 4 వేల నుంచి 5 వేల బస్తాల వరకే మిర్చి పట్టేందుకు స్థలం ఉంది. రోజు యార్డుకు వచ్చిన 5 వేల సరుకుల వరకే కాంటాలు అయిపోగానే.. కొత్తగా సరుకు వచ్చి చేరడంతో 10 వేల బస్తాల వరకు యార్డులో ఉంటుంది. గత మంగళవారం ఒక్కసారిగా వయార్డుకు 25 వేల వరకు బస్తాల మిర్చి రావడంతో కాంటాలు ఆలస్యమయ్యాయి. దాంతో బుధవారం కూడా మళ్లీ కాంటలు పెట్టడం, మళ్లీ కొత్తగా సరుకురావడంతో కొంత ఇబ్బంది జరిగింది. మార్కెట్ యార్డు కెసాసిటి లేకపోవడంతో ఈ తంతు జరుగుతోంది. దశలవారీగా మిర్చి తీసుకువస్తే ఇబ్బందులు పడకుండా ఉంటుంది.