గిరి వికాసం..
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:12 AM
గిరిజన రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గిరి వికాస పథకం’ వరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలోని సన్న, చిన్నకారు కర్షకులకు కలిసి ఐదెకరాల్లోపు ఉన్న 262 మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. గిరి వికాస పథకం ద్వారా బోరు, విద్యుత్, మోటారు ఉచితంగా అందించి.. వారిని ఆదుకుని, ఆర్థికంగా బలోపేతం చేయడమే ముఖ్యఉద్దేశం. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 262 మంది రైతులకు రూ.3.28 కోట్లు ఖర్చు చేసి, 110 బోర్లు వేసి 691.98 ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారు.

రైతులకు వరంలా పథకం
జిల్లాలో 262 మంది అన్నదాతలకు రూ.3.28కోట్లు
ఉచితంగా బోరు, మోటారు, విద్యుత్ సౌకర్యాల ఏర్పాటు
ఐదెకరాల్లోపున్న సన్న, చిన్నకారు రైతులకు లబ్ధి
పథకంతో 691.98ఎకరాల భూమి సాగులోకి
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : గిరిజన రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గిరి వికాస పథకం’ వరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలోని సన్న, చిన్నకారు కర్షకులకు కలిసి ఐదెకరాల్లోపు ఉన్న 262 మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. గిరి వికాస పథకం ద్వారా బోరు, విద్యుత్, మోటారు ఉచితంగా అందించి.. వారిని ఆదుకుని, ఆర్థికంగా బలోపేతం చేయడమే ముఖ్యఉద్దేశం. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 262 మంది రైతులకు రూ.3.28 కోట్లు ఖర్చు చేసి, 110 బోర్లు వేసి 691.98 ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారు. ఆరు మండలాల్లో ఒక్కబోరు కూడా మంజూరు చేయలేదు. ఇంకా జిల్లాలో 71 మంది రైతులకు గాను బోరు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది.
త్వరలోనే వారికి మోటార్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని డీఆర్‌డీవో అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క బోరు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. కరెంట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు, మోటారు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తూ మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 110 మంది రైతులకు బోరు, విద్యుత్, మోటారు సౌకర్యం కల్పించారు.
ఎంపిక విధానం ఇలా..
గిరిజన రైతులు తమ ఆధార్‌కార్డు, పట్టాదారు పా్‌సపుస్తకం (రెవెన్యూ, అటవీ హక్కుపత్రం) కలిగి ఉండాలి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండాలి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు సమూహంగా ఏర్పడి గ్రామపంచాయతీలో కానీ, మండల పరిషత్‌లో కానీ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను మండలస్థాయి కమిటీ ద్వారా ఎంపీడీవో పరిశీలించి, వాటిని జిల్లా డీఆర్‌డీఏకు పంపించడం జరుగుతుంది. అక్కడి అధికారులు ఆ దరఖాస్తులను మళ్లీ పరిశీలించిన తర్వాత భూగర్భ జలాల అధికారికి (గ్రౌండ్‌వాటర్) దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరుగుతుంది.
భూగర్భ జలాల అధికారి సర్వే అనంతరం.. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం.. బోరు వేయడం జరుగుతుంది. విజయవంతమైన బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. విద్యుత్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తారు. వారుఇచ్చిన నివేదిక ప్రకారం.. డీఆర్‌డీఏ అధికారులు గిరివికాస్ పథకం ద్వారా నిధులు పంపిస్తారు. విద్యుత్ అధికారులు పనిపూర్తి చేసిన తర్వాత బోరుబావికి సర్వీస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, తదుపరి మోటారు ఏర్పాటు చేసినీరు పోయిస్తారు. దీంతో గిరిజన రైతుల వ్యవసాయ భూములనుసాగులోకి తీసుకువచ్చి, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ గిరివికాస పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. దీనికనుబంధంగా ఉపాధిహామీ పథకంలో టేకు మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం, ఫారం పౌడ్ (నీటిగుంటలు) పనులకు వీరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
గిరి వికాస పథకంతో లబ్ధి పొందా..: మాలోతు నాన్కూ, రైతు, గుర్రాలగుట్ట తండా, డోర్నకల్
గత సంవత్సరం గిరి వికాస పథకం ద్వారా తన వ్యవసాయ భూమిలో ప్రభుత్వం బోరు, విద్యుత్, మోటారును ఉచితంగా అందించింది. దీంతో తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి పంటలను సాగుచేశా. దీంతో ఆ పంటలకు ఎండకాలం లో సైతం నీరు సమృద్ధిగా అందింది. దీంతో దిగుబడి వచ్చి ఆర్థికంగా బలోపేతమై పంట సాగు కోసం తెచ్చిన అప్పు లు తీర్చాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.
బోరు వేశారు.. విద్యుత్ మరిచారు : బానోత్ శంకర్, కేవులాతండా, మహబూబాబాద్ మండలం
గిరి వికాస పథకం ద్వారా గత ఎనిమిది నెలల క్రితం డీఆర్‌డీఏ అధికారులు తన వ్యవసా య భూమిలో బోరు వేశారు. నేటికి ఆ బోరుకు విద్యుత్ సౌకర్యం, మోటారు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు విద్యుత్ సౌకర్యంతో పాటు మోటారు ఏర్పాటు చేసి ఆదుకోవాలి.