పదవులకు గండం!
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:18 PM
‘గులాబీ’ నేతల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఎవరు అవిశ్వాసానికి నోటీసు ఇస్తారో తెలియని పరిస్థితి నెకొంది. ప్రజాప్రతినిధుల్లో ఎవరి పదవికి ఎసరు వస్తుందోననే ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే బీఆర్‌ఎస్ అవిశ్వాస సెగ తగిలింది. ‘కారు’ పార్టీకి చెందిన ఎంపీపీలు, మునిసిపల్ చైర్మన్‌లపై అవిశ్వాసాలు పెడుతూ, వారిని గద్దె దించుతున్నారు.
బీఆర్‌ఎ్‌సకు అసమ్మతి సెగ
మానుకోట, గార్ల ఎంపీపీలపై అవిశ్వాస నోటీసులు
మునిసిపల్ వైస్‌చైర్మన్‌పైనా రంగం సిద్ధం
ఇప్పటికే రాజీనామా చేసిన శివాజీ చౌహాన్
మహబూబాబాద్ టౌన్, ఫిబ్రవరి 6 : ‘గులాబీ’ నేతల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఎవరు అవిశ్వాసానికి నోటీసు ఇస్తారో తెలియని పరిస్థితి నెకొంది. ప్రజాప్రతినిధుల్లో ఎవరి పదవికి ఎసరు వస్తుందోననే ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే బీఆర్‌ఎస్ అవిశ్వాస సెగ తగిలింది. ‘కారు’ పార్టీకి చెందిన ఎంపీపీలు, మునిసిపల్ చైర్మన్‌లపై అవిశ్వాసాలు పెడుతూ, వారిని గద్దె దించుతున్నారు. కొన్నిచోట్ల అవిశ్వాసాలు నెగ్గుతుండగా.. మరి కొన్నింట్లో వీగిపోతున్నాయి. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్‌లపై ఎప్పటి నుంచో అవిశ్వాసం పెట్టాలని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్లు భావిస్తున్నారు. అయితే పంచాయతీరాజ్ మునిసిపల్ చట్టాల ప్రకారం పదవీ చేపట్టిన నాటి నుంచి నాలుగేళ్లు పూర్తయ్యాక అవిశ్వాసం పెట్టాలనే నిబంధనలుండడంతో ఇంతకాలం ఆగుతూ వచ్చారు. ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తికావడంతో పాటు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో అవిశ్వాసాలకు సమయం ఆసన్నమైంది.
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అవిశ్వాస సెగ ఇటీవల మానుకోట జిల్లాను కూడా తాకింది. ఇప్పటికే మహబూబాబాద్, గార్ల మండలాల బీఆర్‌ఎస్ ఎంపీపీలపై అక్కడి ఎంపీటీసీలు మానుకోట ఆర్డీవోకు అవిశ్వాస నోటీసులు అందించారు. ఈ క్రమంలో గార్ల ఎంపీపీ మూడు శివాజీచౌహాన్ రాజీనామా చేసి, పదవి నుంచి తప్పుకున్నారు. ఇక బీఆర్‌ఎస్ ప్రాతినిథ్య మహబూబాబాద్ మునిసిపాలిటీ వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు సిద్ధమైనట్లు సమాచారం. ఈ అవిశ్వాసాలు నెగ్గితే మరికొన్ని మండలాలు, మునిసిపాలిటీల్లో కూడా పెట్టే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.
ఆర్డీవోలకు అవిశ్వాసంపై దరఖాస్తులు..
మహబూబాబాద్, గార్ల మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎంపీపీలపై అవిశ్వాసానికి ఆయా మండలాల ఎంపీటీసీలు ఆర్డీవోకు అవిశ్వాసంపై దరఖాస్తులు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం కావడంతో అందరి దృష్టి ఇక్కడ ఉండడంతో అవిశ్వాస అంశం హాట్ టాపిక్‌గా మారింది. మహబూబాబాద్ మండలంలో 13 మంది ఎంపీటీసీలుండగా అందులో 5 బీఆర్‌ఎస్, 6 కాంగ్రెస్, ఒకటి టీడీపీ, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. స్వతంత్ర, టీడీపీతో కలిసి బీఆర్‌ఎస్ ఎంపీపీని కైవసం చేసుకోగా, బీఆర్‌ఎస్ ప్రాతినిధ్య భవాండ్లపల్లి లక్ష్మీపురం ఎంపీటీసీ భూక్య మౌనిక ఎంపీపీ అయ్యారు. ప్రస్తుతం 13 మంది ఎంపీటీసీల్లో కంబాలపల్లిపల్లి ఎంపీటీసీ తన పదవికి రాజీనామా చేయడంతో మిగిలిన 12 మంది సభ్యుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సకు చెందిన 9 మంది ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాసం పెడుతున్నట్లు మానుకోట ఆర్డీవో అలివేలుకు గతనెల 25వ తేదీన దరఖాస్తును అందజేశారు. మరోపక్క ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని గార్ల మండలంలో 11 ఎంపీటీసీలుండగా అందులో ఆరు బీఆర్‌ఎస్, రెండు కాంగ్రెస్, రెండు స్వతంత్రులు, ఒక్కటి సీపీఐ గెలుచుకుంది. మెజార్టీ స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్ ఎంపీపీని కైవసం చేసుకోగా.. మర్రిగూడెం ఎంపీటీసీ మూడు శివాజీచౌహాన్ పదవి దక్కించుకున్నారు. ఆయనపై 9 మంది ఎంపీటీసీలు కలిసి అవిశ్వాసం పెడుతున్నట్లు మానుకోట ఆర్డీవోకు గతనెల 22వ తేదీన నోటీ్‌సను ఇవ్వగా, మరునాడు శివాజీ చౌహాన్ గార్ల ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు.
ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద మునిసిపాలిటీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మునిసిపాలిటీ మానుకోట వైస్ చైర్మన్ ఎమ్డీ. ఫరీద్‌పై అవిశ్వాసానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మహబూబాబాద్ మునిసిపాలిటీలో 36 వార్డులుండగా, అందులో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకుంది. స్థానిక మునిసిపాలిటీలో 36 వార్డులుండగా అందులో ఒకవార్డు కౌన్సిలర్ హత్యకు గురయ్యాడు. మిగిలిన 35 వార్డుల్లో 22 మంది బీఆర్‌ఎ్‌సకు సభ్యులుండగా.. 9 మంది కాంగ్రెస్, ఇద్దరు సీపీఐ, ఇద్దరు సీపీఎం వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు 14 మంది సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అవిశ్వాసం పెట్టేందుకు వార్డు కౌన్సిలర్లలో 50 శాతం మంది సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంకా నలుగురి కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంది. నలుగురు కలిసి వస్తే వైస్‌చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మునిసిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు అక్కడి కౌన్సిలర్లు సిద్ధమవుతుండగా ఆ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కీలక నేత రంగ ప్రవేశం చేసి అసమ్మతి కౌన్సిలర్లతో మాట్లాడడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి మహబూబాబాద్ జిల్లాలో అవిశ్వాసల సెగతో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల్లో వణుకుపుడుతోంది.