Share News

ఫుల్‌ భరోసా

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 AM

విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్‌ఏ)కు ఊరట కలిగింది. కొత్త ప్రభుత్వం వారిలో కొంగొత్త ఆశలు నింపింది. ఉద్యోగ భద్రత కల్పిస్తూ భరోసా కల్పించింది. వీఆర్‌ఏ వ్యవస్థను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసి వారిని విద్యార్హతనుబట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది.

ఫుల్‌ భరోసా
ఉద్యోగుల నుంచి స్వీకరించిన వివరాల దరఖాస్తులు

వీఆర్‌ఏలకు సర్కారు ఊరట

ఉద్యోగ భద్రత కల్పించిన కొత్త ప్రభుత్వం

వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి ఐడీకార్డులు, వేతనాలు

ట్రెజరీ కార్యాలయంలో సాగుతున్న ఆన్‌లైన్‌ నమోదు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వరిస్తున్న 396 మంది

కృష్ణకాలనీ (భూపాలపల్లి), జనవరి 11: విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్‌ఏ)కు ఊరట కలిగింది. కొత్త ప్రభుత్వం వారిలో కొంగొత్త ఆశలు నింపింది. ఉద్యోగ భద్రత కల్పిస్తూ భరోసా కల్పించింది. వీఆర్‌ఏ వ్యవస్థను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసి వారిని విద్యార్హతనుబట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ జరిగి ఐదు నెలలు కావస్తోంది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వం వారికి ఎంప్లాయి ఐడీలను కేటాయించలేదు. దీంతో ఎవరికీ వేతనాలు జమ కాలేదు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన రేవంత్‌ సర్కారుకు వీఆర్‌ఏలు తమ గోడును వినిపించారు. దీనిపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వీఆర్‌ఏలకు ఎంప్లాయి ఐడీలు కేటాయించలంటూ సర్క్యులర్‌ను జారీ చేసింది.

భూపాలపల్లి జిల్లాలో 396 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. వీరి వ్యవస్థను గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. మళ్లీ ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని వీఆర్‌ఏలు పోరాడారు. విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లుగా దశాబ్దకాలంగా సేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 80 రోజుల పాటు సమ్మె చేశారు. వివిధ రూపాల్లో ఆందోళన చేయడంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగివచ్చింది. సూపర్‌ న్యూమరీ పోస్టులను సృష్టించి వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. జాబ్‌ చార్టులను, ఉద్యోగ గుర్తింపు కార్డులను మాత్రం జారీ చేయలేదు. దీంతో ఐదు నెలలుగా వేతనాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఐదు శాఖలను బదలాయింపు

వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారందరినీ ఖాళీగా ఉన్న ఐదు శాఖలకు కేటాయించింది. విద్యార్హతనుబట్టి రెవెన్యూ, మునిసి పల్‌, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, విద్యాశాఖల్లో విధులు కేటాయించగా వారంతా ఐదు నెలలుగా పని చేస్తున్నారు. కానీ, పూర్తి స్థాయిలో వారిని ఆయా శాఖల ఉద్యోగులుగా గుర్తింపు లభించలేదు. ఎంప్లాయిస్‌ ఐడీలను కేటాయించడంలో గత ప్రభుత్వం కాలయాపన చేసింది. ఈలోగానే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ విషయాన్ని మరచిపోయింది.

అందని వేతనాలు

వీఆర్‌ఏలుగా ఉన్న వారంతా వివిధ శాఖల్లో చేరినప్పటికీ వారికి వేతనాలు అందడం లేదు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేసే ఆయా శాఖల్లో వీరంతా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రిజిష్టరులో సంతకాలు చేసి విధులు నిర్వర్తిస్తున్నారు. వేతనాలు రావడం లేదంటూ పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా గత ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. వీఆర్‌ఏలకు గతంలో తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నపుడు రూ.10,500 వేతనం చెల్లించేవారు. ఇప్పుడు విద్యార్హతలను బట్టి మూడు కేటగిరీల్లో సర్దుబాటు చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.24,280, రికార్డు అసిస్టెంట్‌కు రూ.22,150, ఆఫీస్‌ సబ్‌ ఆర్డినేట్‌కు రూ.18,000 వరకు వేతనాలు చెల్లించే విధంగా స్కేల్‌ పోస్టులో నియమించారు. అయినా ఈ వేతనాలు అందడం లేదు.

వీఆర్‌ఏల్లో హర్షం

వీఆర్‌ఏలకు ఎంప్లాయి గుర్తింపు కార్డు, వేతనాలు చెల్లించడంపై ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దకాలంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్‌ఏల పాత్ర ఎంతో కీలకంగా ఉండేదని, గత ప్రభుత్వం గుర్తించి వివిధ పోస్టుల్లో నియమించడం, కొత్త ప్రభుత్వం ఎంప్లాయి గుర్తింపు కార్డులు జారీ చేసి వేతనాలు చెల్లిస్తామనడం ఎంతో అభినందనీయమని వీఆర్‌ఏల జేఏసీ నేతలు అంటున్నారు.

ఆన్‌లైన్‌లో వివరాల ఎంట్రీ

ప్రభుత్వ ఆదేశాలతో వివిధ శాఖల్లో చేరిన వీఆర్‌ఏల వివరాలను ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఉన్న ట్రెజరీ కార్యాలయంలో ఇది కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 396 మంది వీఆర్‌ఏలు ఐదు శాఖలకు వెళ్లగా వారి వివరాలను సేకరిస్తున్నారు. మండలాల వారీగా ఆన్‌లైన్‌ నమోదు సాగుతోంది. ఇప్పటి వరకు 125 మంది ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు ట్రెజరీ అధికారులు తెలిపారు. ట్రెజరీలో ఉన్న ప్రత్యేక పోర్టర్‌లో ఉద్యోగి వివరాలు నమోదు చేయగానే వారికి సంబంధించిన ఐడీ వస్తోంది. దాని ప్రింట్‌ తీసి అందిస్తున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM