Share News

మద్దతు ధర కోసం..

ABN , Publish Date - Apr 11 , 2024 | 11:49 PM

మార్కెట్‌లో ధాన్యానికి మద్దతు ధర రావాలంటే రైతులు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మార్కెట్‌ కమిటీల్లో ట్రేడర్లు, గ్రామా ల్లో దళారుల వద్ద మోసపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఈ నెల 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

మద్దతు ధర కోసం..
జనగామ మార్కెట్‌కు వచ్చిన ధాన్యం

తేమ, తాలు లేకుండా ధాన్యం తేవాలని సూచన

నేడు, రేపు జిల్లావ్యాప్తంగా రైతు వేదికల్లో సమావేశాలు

ఏర్పాట్లు చేసిన వ్యవసాయ అధికారులు

జనగామ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ధాన్యానికి మద్దతు ధర రావాలంటే రైతులు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మార్కెట్‌ కమిటీల్లో ట్రేడర్లు, గ్రామా ల్లో దళారుల వద్ద మోసపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఈ నెల 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 62 రైతు వేదికల్లో ఈ సమావేశాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇం దులో వడ్లను అమ్మకానికి ఏ విధంగా తీసుకురావాలి? ఏయే నిబంధనలు పాటించాలన్న అంశాలపై రైతులకు సూచనలు ఇస్తారు. రైతు వేదికల్లో ఏఈవోలు, ఏవోల ద్వారా రైతులకు సూచనలు అందిస్తారు.

కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి

ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం సీరియస్‌ గా వ్యవహరిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాం టి ఇబ్బందులు ఎదురుకావొద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో తరచుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, ధాన్యానికి తక్కువ ధర చెల్లించిన వారిపై కఠినంగా ఉండాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.

తేమ, తాలు లేకుండా చూడాలని..

రైతులు ‘ఏ’ గ్రేడ్‌ మద్దతు ధర రూ.2203 పొందాలంటే తేమ, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని అధికారులు చెబుతున్నా రు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తెస్తే మంచి ధర పొందే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశాలపై రెండు రోజుల పాటు అవగాహన కల్పిస్తారు. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతా న్ని బట్టి ధర నిర్ణయిస్తారు. ‘ఏ’ గ్రేడ్‌ రకానికి రూ. 2203, సాధారణ రకానికి రూ.2183 చొప్పున ప్రభు త్వం ఽధర నిర్ణయించింది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు పరిశీలిస్తారు. 17 లోపు తేమ శాతం నమోదై తాలు లేకుండా ఉంటే ‘ఏ’గ్రేడ్‌గా పరిగణిస్తా రు. ఏ గ్రేడ్‌ రావడం కోసం రైతులు ధాన్యాన్ని ఆరబో సి, తూర్పార పట్టి కేంద్రాలకు తేవాలని అంటున్నారు.

గ్రామాల కూడళ్లలోనూ..

- రైతులకు అవగాహన కార్యక్రమాల సమాచారా న్ని చేరవేసేందుకు ఏఈవోలు ఆయా గ్రామాల వాట్సాప్‌ గ్రూపుల్లో సమాచారాన్ని పోస్టు చేశారు. దీంతో పాటు జిల్లా పంచాయతీ అధికారి ద్వారా జీపీ కార్యదర్శులకు సమాచారం అందించి సమావేశాలకు సంబంధించి టామ్‌ టామ్‌ వేయించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో పలు రైతువేదికలు గ్రామానికి దూరంగా ఉన్నాయి. ఒకవేళ రైతు వేదికలకు రావడానికి రైతులు ఇబ్బంది పడితే గ్రామ కూడళ్లలో ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మార్కెట్‌ ఘటనపై సీఎం సీరియస్‌

జనగామ మార్కెట్‌లో బుధవారం జరిగిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. అధికారు లు ఎవరైనా వ్యాపారులతో కుమ్మక్కై రైతుల ధాన్యాన్ని తక్కువ ధర చెల్లించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు ధాన్యానికి రూ.1551 చొప్పు న చెల్లించడంపై ఆయన ఫైర్‌ అయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను జోడించి ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. కొనుగోళ్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉం డాలని కోరారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి నలుగురు ట్రేడర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, మార్కెట్‌ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించిన అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు.

ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు..

మార్కెట్‌ కార్యదర్శిపై నివేదిక

జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యాన్ని తక్కువ ధరకు కొనడానికి ప్రయత్నించిన ముగ్గురు ట్రేడర్లపై జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్‌లో బుధవారం ధాన్యానికి క్వింటాకు రూ.1551 చొప్పున పలువురు ట్రేడర్లు ధర నిర్ణయించారు. దీనిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ ట్రేడర్లపై క్రిమినల్‌ కేసులు, మార్కెట్‌ కార్యదర్శి సస్పెన్షన్‌కు ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరి వెంకటనారాయణ (వీఎన్‌ ట్రేడర్స్‌), దాస ఉషారాణి(ఉమా ట్రేడర్స్‌), కందుకూరి సుజాత(పరమేశ్వర ట్రేడర్స్‌)పై కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. కాగా.. జనగామ మార్కెట్‌ ఘటనపై ముగ్గురు ట్రేడర్లకు షోకాజ్‌ నోటీసులు సైతం అధికారులు జారీ చేశారు. తక్కువ ధరకు కొనడానికి ప్రయత్నించినందున వారి లైసెన్స్‌లను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. ట్రేడర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణల్లో ఎంత వరకు నిజమనే అంశంపై నివేదిక ఇవ్వాలని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి జనగామ జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేంద్రను నివేదిక కోరారు. ఈ అంశంపై ప్రాథమికంగా విచారణ జరిపిన అనంతరం ఆయన పాత్రపై స్పష్టత వస్తుందని, దానిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని నరేంద్ర తెలిపారు.

మార్కెట్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనగామ మా ర్కెట్‌ ఆవరణలోని కాటన్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు గురువారం ప్రారంభించా రు. మార్కెట్‌లో ట్రేడర్లు రైతులకు తక్కువ ధర చెల్లిస్తుండడంతో బుధవారం నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ మార్కెట్‌లోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. కేంద్రం ప్రారంభంలో సివిల్‌ సప్లయీస్‌ అధికారిణి రోజారాణి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2024 | 11:49 PM