Share News

కొట్టుకుపోతే..పట్టించుకోరా?

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:41 PM

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లతో జఫర్‌గడ్‌ మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోతలకు గురై, లోతుగా గోతులు, గుంతలు పడడంతో ఈ రోడ్ల గుండా ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కొట్టుకుపోతే..పట్టించుకోరా?
ఉప్పుగల్లు - కూనూరు మధ్య దెబ్బతిన్న బీటీ రోడ్డు

గతేడాది వర్షాలకు ధ్వంసమైన రోడ్లు

రాకపోకలకు అవస్థలు పడుతున్న జఫర్‌గడ్‌ మండల ప్రజలు

జనగామకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు

వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్‌

జఫర్‌గడ్‌, ఫిబ్రవరి 27: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లతో జఫర్‌గడ్‌ మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోతలకు గురై, లోతుగా గోతులు, గుంతలు పడడంతో ఈ రోడ్ల గుండా ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. గత ఏడాది జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కూనూరు - ఉప్పుగల్లు, ఉప్పుగల్లు - తమ్మడపల్లి(ఐ) గ్రామాల మధ్య బీటీ రోడ్లు దెబ్బతిన్నాయి. సైడ్‌ బర్మ్‌లు కొట్టుకుపోయాయి. ఉప్పుగల్లు-తమ్మడపల్లి(ఐ) గ్రామాల మధ్య బ్రిడ్జి పక్క నుంచి నూతనంగా నిర్మించిన బైపాస్‌ మెటల్‌ రోడ్డు సైతం దెబ్బతిని మధ్య లో గల కల్వర్టు వరదనీటికి కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రెండేళ్ల క్రితం మండలంలోని హిమ్మత్‌నగర్‌ - సూరారం గ్రామాల మధ్య గల బీటీ రోడ్డు కోతకు గురైంది. దీంతో ఈ మార్గం గుండా జనగామకు నడిచే ఆర్టీసీ బస్సును అఽధికారులు రద్దు చేశా రు. దీంతో మండల కేంద్రం నుంచి హిమ్మత్‌నగర్‌, సూరారం, షాపల్లి మీదుగా పాలకుర్తి మండలం గూడూరు నుంచి జనగామకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఈ ప్రాంత వాసులు వ్యయ ప్రయాసలకు గురవు తున్నారు. వర్షాల అనంతరం దెబ్బతిన్న రోడ్లను ప్రజా ప్రతినిఽధులు, అధికా రులు పరిశీలించి మరవ్మతు లు చేయిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. నూ తన ప్రభుత్వమైనా స్పం దించి రోడ్లకు మరమ్మతు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వర్షాలకు ధ్వంసమైన నష్కల్‌ కాలువ కట్ట...

గత ఏడాది కురిసిన భా రీ వర్షానికి మండలంలోని ఉప్పుగల్లు శివారులో తమ్మ డపల్లి(ఐ)కి వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు పక్కన గల కాలువ కట్ట ధ్వంసమైంది. నష్కల్‌ నుంచి ఈ కాలువ ద్వారా నీరు ఉప్పుగల్లు, తమ్మడపల్లి(ఐ) మీదుగా తిడుగు పరిధిలోని ధంసా చెరువులోకి చేరుతుంది. అయితే కొట్టుకుపోయిన ఈ కాలువ కట్టను మరమ్మతు చేయకపోవడం మూలంగా ఈ ప్రాంత రైతుల పంటలకు నీరందకపోవడంతో పాటు వృధాగా నీరు పోతోందని స్థానిక రైతులు తెలిపారు. కాలువ కట్టను శాశ్వత ప్రాతిపదికన తక్కువ ఎత్తులో నిర్మించి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా పంటలకు సాగునీటితో పాటు భూగర్భజలాలు వృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:41 PM