Share News

కాసుల పంట

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:34 AM

ఆయిల్‌పామ్‌ సాగుకు ఆదరణ పెరుగుతోంది. విదేశాల్లో మాత్రమే పండే ఈ పంటకు మన రైతులు కూడా ఇక్కడ ప్రాధాన్యమిస్తున్నారు. పనిలో పని ఇందులోనే అంతర పంటలు వేసుకొని ఆదాయం గడిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, కర్బూజా, మిర్చి, అరటి, వేరుశనగ, బొప్పాయి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు సాగుచేస్తూ ప్రయోజనం పొందుతున్నారు.

కాసుల పంట
ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా మొక్కజొన్న

భూపాలపల్లి జిల్లాలో 3,200 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు

అంతర పంటలతో రైతన్నలకు మరింత ప్రయోజనం

ప్రత్యామ్నాయ ఆదాయ దిశగా అడుగులు

కూరగాయలు, అరటి, బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న, పత్తి సాగుతో లాభాలు

కాటారం, ఏప్రిల్‌ 2: ఆయిల్‌పామ్‌ సాగుకు ఆదరణ పెరుగుతోంది. విదేశాల్లో మాత్రమే పండే ఈ పంటకు మన రైతులు కూడా ఇక్కడ ప్రాధాన్యమిస్తున్నారు. పనిలో పని ఇందులోనే అంతర పంటలు వేసుకొని ఆదాయం గడిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, కర్బూజా, మిర్చి, అరటి, వేరుశనగ, బొప్పాయి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు సాగుచేస్తూ ప్రయోజనం పొందుతున్నారు. ఆయిల్‌పామ్‌కు ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న పామోలిన్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేయాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంతో జిల్లాలో ఆయిల్‌పామ్‌ పంట సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాతే ఇది చేతికి రానుండగా ఈలోగా రైతులు అంతర పంటలు సైతం వేసుకుంటున్నారు.

భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. మూడేళ్లుగా సుమారు 1,200 మంది రైతులు 3,200 ఎకరాల్లో పండిస్తున్నారు. భూపాలపల్లి డివిజన్‌లో ఆయిల్‌పామ్‌ భారీ ఎత్తున సాగవుతోంది. కాటారం సబ్‌డివిజన్‌లో మూడేళ్లుగా సుమారు 600 ఎకరాల్లో సాగులో ఉంది. కాటారం, మహదేపూర్‌, మల్హర్‌, మహాముత్తారం, పలిమెల మండలాల్లో సాగునీటి సౌకర్యం భూముల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. కొన్నిచోట్ల మూడేళ్ల క్రితం సాగు చేయగా మరికొన్ని చోట్ల గతేడాది చేపట్టారు. డ్రిప్‌ సిస్టంతో మొక్కలకు సాగు నీరు అందిస్తూ పలువురు రైతులు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. దీంతో చెట్లు ఏపుగా ఎదుగుతున్నాయి. ఒకట్రెండు చోట్లా ఆయిల్‌పామ్‌ చెట్లు గెలలు వేయగా అధికారుల సూచనల మేరకు రైతులు మొదటి మూడేళ్లు వాటిని తీసేసి నాలుగో ఏట నుంచి ఉత్పత్తి కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఆదాయం కోసం..

ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన అనంతరం చెట్లు గా మారి కాపు వచ్చే వరకు నాలుగేళ్లు పడుతుంది. నాలుగేళ్లపాటు ఆయిల్‌పామ్‌లో అంతర పంటలు సాగుచేసుకోవచ్చు. ఈ క్రమంలో ఉద్యాన శాఖ అధి కారుల సూచనలతో పలువురు రైతులు వివిధ రకాల అంతర పంటల సాగు మొదలెట్టారు. కొంతమంది కూరగాయలు, ఆకుకూరలు, కర్బూజా, కీర దోస సాగుచేస్తుండగా, మరికొందరు అరటి, బొప్పాయి, వేరుశనగ, మిర్చి, మొక్కజొన్న, పత్తి తదితర వాణిజ్య, వ్యాపార పంటలు సాగు చేస్త్తున్నారు. ఇంకొందరు రైతులు మాత్రం ఆయిల్‌పామ్‌ తోటలో కొద్దిపాటి భూమిలో తీగజాతి కూరగాయలు, అలసంద, కర్బూజా, ఆకుకూరలు, కొత్తిమీర పండిస్తున్నారు.

మరింత ప్రోత్సాహించాలంటున్న రైతులు

జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలనే టార్గెట్‌ ఉండగా ఉద్యాన శాఖ అధికారులు ఎంత అవగాహన కల్పించినా పలువురు రైతులు మొగ్గు చూపకపోవడంతో లక్ష్యానికి దూరంలోనే ఉండిపోయింది. అన్ని పంటలు సాగు చేస్తే 3 నుంచి 6 నెలల్లోనే దిగుబడులు వచ్చి ఆదాయం సమకూరుతుండగా దీర్ఘకాలిక పంట అయిన ఆయిల్‌పామ్‌తో సాగు చేసిన నాలుగేళ్ల అనంతరం ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. కానీ ఏళ్లపాటు ఆయిల్‌పామ్‌ గెలలు ఉత్పత్తి కానుండటంతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం రానున్నప్పటికీ లక్ష్యం మేరకు సాగు కావడం లేదు. ఆయిల్‌పామ్‌ సాగు చేసిన రైతుల్లో అధికశాతం అంతరపంటలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఎకరా ఆయిల్‌పామ్‌ పంట సాగుకు మెయింటెనెన్స్‌కు రూ.2,100, అంతరపంటల సాగుకు మరో రూ.2,100 చెల్లిస్తోంది. అన్ని రకాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం మరింత ప్రోత్సహకాలు అందించాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు రూ.10వేలు సాయంగా అందిస్తే రైతులకు ప్రయోజనం కలగుతుందని అంటున్నారు. దీంతో మరికొందరు రైతులు ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేయడానికి ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాలిక ప్రయోజనం

- సంజీవరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది. నీటి సౌకర్యం ఉన్న భూముల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన నాలుగేళ్ల నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. సుమారు మూడు దశాబ్దాలపాటు గెలలు వేయడంతో దీర్ఘకాలిక ఆదాయం పొందొచ్చు.

Updated Date - Apr 03 , 2024 | 12:34 AM