Share News

చిగురించిన ఆశలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:29 PM

బిల్ట్‌ కార్మికుల ఆశలు చిగురించాయి. ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. మంగపేట మండలం కమలాపురంలోని ఈ కర్మాగారం 2014లో మూతపడగా దాన్ని పునరుద్ధరించేందుకు రేవంత్‌ సర్కారు కసరత్తు చేస్తోంది.

చిగురించిన ఆశలు
బిల్ట్‌ కర్మాగారం

‘బిల్ట్‌’ పునరుద్ధరణపై ప్రభుత్వం ఫోకస్‌

ఐటీసీ, ఫిన్‌క్వెస్ట్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

2014లో మూతపడ్డ పరిశ్రమ

చిన్నాభిన్నమైన శ్రామికుల జీవితాలు

ఫ్యాక్టరీని తెరిపించేందుకు సర్కారు కసరత్తు

హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, జిల్లా వాసులు

ములుగు, జనవరి 8: బిల్ట్‌ కార్మికుల ఆశలు చిగురించాయి. ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. మంగపేట మండలం కమలాపురంలోని ఈ కర్మాగారం 2014లో మూతపడగా దాన్ని పునరుద్ధరించేందుకు రేవంత్‌ సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నమే చేయగా అది సఫలీకృతం కాక కార్మికుల్లో సుమారు పదేళ్లుగా నైరాశ్యం నెలకొంది. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఈసారైనా తమ కలలు సాకారం అవుతాయా..? అని కార్మికులు చర్చించుకుంటున్నారు.

2014లో మూతపడిన ఫ్యాక్టరీ

కమలాపురంలో 1975 మార్చి 18న బిల్ట్‌ కర్మాగారానికి (కలప గుజ్జు తయారీ యూనిట్‌)కు పునాదిరాయి పడింది. పారిశ్రామికవేత్త ఎల్‌.ఎం.థాపర్‌ ఏపీ రేయాన్స్‌ పేరిట కంపెనీని స్థాపించగా 1981లో ఉత్పత్తి ప్రారంభమైంది. 2014 వరకు విజయవంతంగా నడిచిన ఫ్యాక్టరీలో ఉత్పత్తయ్యే కలప గుజ్జుకు బహిరంగ మార్కెట్‌లో విలువ పడిపోయింది. దీంతో ఆ ఏడాది ఏప్రిల్‌ 4న ఉత్పత్తిని నిలిపివేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అంతకు మూడురోజుల ముందు రెండు వేల మంది పీఎఫ్‌ కార్మికులను విధుల నుంచి తొలగించింది.

ప్రోత్సాహకాలను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూతపడ్డ తొలి మధ్యతరహా పరిశ్రమగా బిల్ట్‌ చర్చనీయాంశ మైంది. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. 2015లో జీవో 19 ద్వారా కొంతమేరకు రాయితీలు ప్రకటించింది. అయితే అవి సరిపోవంటూ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ 2018లో రూ.350కోట్లు ప్యాకేజీని ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 48ను విడుదల చేసింది. కలపకు ఏటా రూ.21కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఏడేళ్లపాటు మొత్తం రూ.147 కోట్లు మంజూరు చేసేందుకు అంగకీరించింది. అలాగే విద్యుత్‌కు ఏటా రూ.9 కోట్ల చొప్పున ఏడేళ్లపాట్లు మొత్తం రూ.63కోట్లు, ఏటా 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గును ఏడేళ్లపాటు సరఫరా చేసేందుకు రూ.వెయ్యి చొప్పున మొత్తంగా రూ.105 కోట్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. కమర్షియల్‌ ట్యాక్స్‌, టీఎస్‌-ఎన్‌పీడీసీఎల్‌కు బకాయిపడ్డ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. మొదట్లో ఫ్యాక్టరీని తెరిచేందుకు అంగీకరించిన మేనేజ్‌మెంట్‌ కొద్దిరోజులకు మళ్లీ మాటమార్చింది. ఈ కర్మాగారం పేరున పెద్ద ఎత్తున రుణాలు తీసుకోగా రుణదాత సంస్థల ప్రతినిఽధులు, కార్మికులు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)ని ఆశ్రయించారు. తమ విషయంలో యాజమాన్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు 777 రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేశారు. మొదటి దఫా 363 రోజులుగా, రెండో దఫా 414 రోజులు దీక్ష కొనసాగించారు.

వేతన బకాయిలు ఇప్పిస్తారా...!?

ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడానికి ముందు 600 మంది కాంట్రాక్టు కార్మికులు, 317మంది పీఎఫ్‌ కార్మికులను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం 600 మంది పర్మనెంట్‌ కార్మికులు మిగలగా వారికి ఎలాంటి జీతాలు లేవు. ఈమొత్తం బకాయి ఇప్పటి వరకు రూ.50 కోట్లపైనే ఉంటుందని అంచనా. గడిచిన తొమ్మిదేళ్లలో చాలామంది ఉద్యోగ విరమణ పొందగా వారికి ఎలాంటి ప్రయోజనాలు అందలేదు. ఒకవేళ ఫ్యాక్టరీని తెరిపిస్తే పెండింగ్‌ వేతనాల మాటేమిటి..? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉపాధి లేక పొట్టచేత పట్టుకొని వలస పోయిన వారిని ఆదుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.

ఐటీసీ, ఫిన్‌క్వెస్ట్‌ ప్రతినిధులతో సీఎం భేటీ

బిల్ట్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు వేసిందని తెలుస్తోంది. నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో బిల్ట్‌ ఆస్తులపై హక్కులు పొందిన ఫిన్‌క్వెస్ట్‌ ఫైనాన్స్‌ సొల్యూషన్‌ మేనిజింగ్‌ డైరెక్టర్‌ హార్థిక్‌ పటేల్‌, ఐటీసీ పేపర్‌ బోర్డు లు, స్పెషాలిటీ పేపర్స్‌ విభాగం సీఈవో వాదిరాజ్‌ కులకర్ణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి సమావేశమయ్యారు. ఫ్యాక్టరీ పునరుద్ధర ణపై చర్చించారు. కర్మాగారాన్ని తెరిపించేందుకు ప్రభు త్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని హామీ నిచ్చారు. దీనిపై ఐటీసీ, ఫిన్‌క్వెస్ట్‌ ఫైనాన్స్‌ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. దీంతో కార్మికుల్లో అడుగంటిన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్ట్‌ కర్మాగారానికి మంచిరోజులు రావాలని సర్వత్రా కోరుకుంటున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:29 PM