Share News

‘ఆత్మ’ఘోష!

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:27 AM

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిధులు లేక నీరిసించిపోతోంది. ఎలాంటి కార్యక్రమాలు లేక నామావశిష్టంగా మారిపోయింది. పట్టించుకునేవారు లేక ఘోషిస్తోంది. ఆత్మ ఆధ్వర్యంలో రైతులను చైతన్యవంతం చేసేందుకు సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా ఎలాంటి కృషి జరగడం లేదు. యంత్రాలు కొనుగోలు చేసినప్పటికీ వాటిపై ఆవగాహన కల్పించేవారే లేరు.

‘ఆత్మ’ఘోష!

మూలనపడిన వ్యవసాయ సాంకేతిక పథకం

మూడేళ్లుగా నిధులు రాక నీరసం

రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు బ్రేక్‌

ఇతర విధుల్లోకి ఆత్మసిబ్మంది..

నీరుగారుతున్న పథకం లక్ష్యం

హనుమకొండ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిధులు లేక నీరిసించిపోతోంది. ఎలాంటి కార్యక్రమాలు లేక నామావశిష్టంగా మారిపోయింది. పట్టించుకునేవారు లేక ఘోషిస్తోంది. ఆత్మ ఆధ్వర్యంలో రైతులను చైతన్యవంతం చేసేందుకు సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా ఎలాంటి కృషి జరగడం లేదు. యంత్రాలు కొనుగోలు చేసినప్పటికీ వాటిపై ఆవగాహన కల్పించేవారే లేరు. వరి, పత్తి, కందులు, పెసర, శనగ తదితర పంటలతో పాటు మామిడి, జామ, దానిమ్మ తోటలను పెంచుతున్నవారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఆత్మసంస్థను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆత్మ ఏర్పాటు లక్ష్యం నీరుగారిపోతోంది.

శిక్షణే లక్ష్యం

వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో జిల్లా వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఆత్మ ఏర్పాటు చేశారు. ఒక విధంగా వ్యవసాయ శాఖలో ఆత్మ అంతర్భాగం. వ్యవసాయ శాఖ సిబ్బంది పంటల సాగు, విస్తీర్ణం, సస్య రక్షణ చర్యలు, పంటల సర్వే, పంట మార్పిడీపై అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను పర్యవేక్షిస్తే.. ఆత్మ వ్యవసాయరంగంలో చోటు చేసుకుంటున్న ఆధునిక మార్పులను రైతులకు ఎప్పటికప్పుడు తెలియచెప్పడం ఆత్మ పని. 2006లో ప్రారంభమైన ఈ పథకం కింద కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. డివిజన్‌స్థాయిలో ఈ కమిటీలు ఉండేవి. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులకు సాగుపై అవగాహన కల్పించేవారు. పశు సంవర్థక శాఖ, ఉద్యాన, మత్స్యశాఖల్లో సాంకేతికంగా వచ్చే అనేక మార్పులకు సంబంధించిన అంశాలు అధికారులు వివరించేవారు. ప్రస్తుతం ఇవేం జరగడం లేదు. ఇప్పుడు కమిటీలు కూడా ఏమీ లేవు. దీనికి ఇది వరకు చైర్మన్‌ కూడా ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. దీంతో ఈ పథకం ఉందన్న విషయం చాలా మంది రైతులకు తెలియని పరిస్థితి. కార్యాలయం ఎక్కడ ఉంది? దానిలో ఎంత మంది పని చేస్తారు? వారి ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అనే అంశాలపై చాలా మంది రైతులకు ఇప్పటివరకు అవగాహన లేదు. మూడేళ్ల కిందట ఆత్మ చురుకుగానే పని చేసేంది. ఆ తర్వాత దాని కార్యక్రమాలు అటకెక్కాయి. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఒక మూల ఆత్మ పడి ఉంటోంది. ఇది వరకు బోర్డులైన ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవు.

ఊసేలేని కార్యక్రమాలు..

వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక, పట్టు పరిశ్రమలు, మార్కెటింగ్‌ శాఖల భాగస్వామ్యంలో రైతులకు శిక్షణ, అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రలు నిర్వహించాలి. వ్యవసాయ ప్రదర్శనలు, సాగు విస్తరణ కార్యక్రమాలు, పొలం బడులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ నిర్వహించే వ్యవసాయ, అనుబంధరంగాల కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో ఆధునిక సాంకేతికతను రైతులకు అందించాలి. అవసరానికి అనుగుణంగా కొత్త విధానాలను విస్తరించడం, క్షేత్ర దినోత్సవాలను, కిసాన్‌ గోష్ఠి, రైతు-శాస్త్రవేత్తల గోష్ఠి లాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. కానీ ఇవేమీ జరగడం లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 9.30 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్క జొన్న, మిర్చితోపాటు మరో లక్ష ఎకరాల్లో పండ్లతోటలు, కూరగాయల తోటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పండుతున్నాయి. ఈ పంటల సాగులో ఇటీవల అనేక మెరుగైన పద్ధతులు వచ్చినా వాటి గురించి తెలియక రైతులు పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు.

సిబ్బంది ఉన్నా.. పని లేక..

ఆత్మకు జిల్లా వ్యవసాయాధికారే ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ)గా వ్యవహరిస్తారు. డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్‌ (డీపీడీ)తో పాటు ఒక ప్రోగ్రామ్‌ ఆపరేటర్‌, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, అగ్రిక్చర్‌ టెక్నాలజీ మేనేజర్‌ (ఏటీఎం), బ్లాక్‌ టెక్నాలజీ మేనేజర్‌ (బీటీఎం) ఆత్మ సంస్థలో ఉంటారు. వీరిలో ఏటీఎం, బీటీఎంలు కాంట్రాక్టు ఉద్యోగులు కాగా మిగతా వారు రెగ్యులర్‌ సిబ్బంది. వీరు వ్యవసాయంలో చోటుచేసుకున్న ఆధునిక పద్ధతుల పట్ల రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రైతుల కోసం ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదు. టూర్‌ ప్రోగాంలు లేవు. క్షేత్ర సందర్శనలు అసలే లేవు. పొలం బాటలు ఏ మాత్రం కానరాడం లేదు. శాస్త్రవేత్తలతో రైతులకు ఇష్టాగోష్టి ఉసే లేదు.

మూడేళ్ల నుంచి నిధులు లేవు

రైతులు, వారి సంక్షేమం అంటూ ఊదరగొట్టిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆత్మను ఏ మాత్రం పట్టించుకోలేదు. మూడేళ్లుగా ఆత్మ పథకం కోసం ఒక్క పైసా ఇవ్వలేదు. గతంలో ఏటా రూ.5లక్షల వరకు నిధులు ఇచ్చేది. ఇతరత్రా వ్యవసాయ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం నుంచి నిధులందేవి. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాకు రూ.30లక్షల వరకు వచ్చేవి. 2020 నుంచి నిధులు ఇవ్వడం నిలిపివేసింది. దీనితో నిధుల లేక ఆత్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం ఆగిపోయింది. మూడేళ్లలో ఒకే ఒక్క రైతు టూర్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. అయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించేందుకు 50 మంది రైతులతో క్షేత్రసందర్శన నిర్వహించారు. అది కూడా వ్యవసాయశాఖ నిధులతోనే. ఆ తర్వాత రైతు అవగాహన కార్యక్రమాల ఊసే లేదు. ఆ మధ్య వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులపై శిక్షణ కోసం ఆ మధ్య వ్యవసాయాధికారులతో బ్రెజిల్‌ పర్యటన నిర్వహించారు. అది కూడా వ్యవసాయశాఖ నిధులతో నిధుల లేక, చేసేందుకు పని లేకపోవడంతో కూడా ఇటీవల వ్యవసాయ శాఖలోకి ఏఈవోలుగా పంపించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:27 AM