Share News

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు రిజర్వేషన్లు!

ABN , Publish Date - May 06 , 2024 | 06:10 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ఏటీఎంలా ఉపయోగపడుతోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఆరోపించారు. ఇక్కడ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట రూ.కోట్లు వసూలు చేసి ఢిల్లీకి

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు రిజర్వేషన్లు!

ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఫేక్‌ వీడియోలు

వాటిని షేర్‌ చేసిన సీఎం రేవంత్‌

పోలీసులు ఆయన వెంట పడరా?

తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు ఖాయం

రాహుల్‌ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే

కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ సభల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

ఆసిఫాబాద్‌/నిజామాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ఏటీఎంలా ఉపయోగపడుతోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఆరోపించారు. ఇక్కడ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట రూ.కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారన్నారు. ఆర్‌ఆర్‌ అంటే రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ట్యాక్స్‌ అని.. కాంగ్రెస్‌ పాలన అంటేనే ఇలా ఉంటుందని విమర్శించారు. ఎండలు పెరగ్గానే రాహుల్‌ బాబా థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌ విహారయాత్రలకు వెళ్లిపోతారని చెప్పారు. రాహుల్‌ బాబా లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అంటేనే ముస్లింలను పెంచి పోషించడమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అదనంగా వాటిని వర్తింపజేస్తామని ప్రకటించారు. మూడోసారి మోదీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్‌ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అవి తప్పుడు ప్రచారాలని, ఈ పదేళ్లలో రిజర్వేషన్లు ఏమైనా తీసేశారా!? అని ప్రశ్నించారు. ఇండియా కూటమికి అసలు నాయకత్వమే లేదని, కాంగ్రెస్‌ హయాంలో రూ.12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్‌ కావాలా? సీఎంగా, పీఎంగా 23 ఏళ్లు పాలించినా.. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని మోదీ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆరోపించారు. నరేంద్ర మోదీ పాలనలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా అణచివేశామని వెల్లడించారు. ఆదివారం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో, నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాలలో, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు. సికింద్రాబాద్‌ సభలో ‘పెద్దమ్మ తల్లి’కి నమస్కారాలు చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో ప్రజలందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తే.. రాహుల్‌బాబా వ్యాక్సిన్లపైనా దుష్ప్రచారం చేశాడని, చివరికి ఆయన, సోదరి కలిసి చీకట్లో టీకాలు వేయించుకున్నారని చెప్పారు.


40 వేల కోట్లతో అభివృద్ధి

తెలంగాణలో రూ.40 వేల కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు అమిత్‌ షా తెలిపారు. ఇందులో మంచిర్యాల నుంచి ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్‌కు బ్రాడ్‌గేజ్‌ రైల్వే నిర్మాణం కూడా ఉందన్నారు. బీజేపీ హయాంలో చేపట్టిన ప్రత్యేక నిబంధనలతోనే పరిశ్రమల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను పెంచుతామన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహిస్తోందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆ విషయం జోలికి వెళ్లవని, ఒవైసీ వాటిని విమోచన దినోత్సవం చేయనిస్తాడా? అని ప్రశ్నించారు.


కాంగ్రెస్‌ పాలన అవినీతిమయం

దేశంలో 70 ఏళ్లు కొనసాగిన కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతిమయమని షా ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అవినీతి చేసిందన్నారు. రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 ఏళ్ల పాటు నాన్చుడు ధోరణి అవలంబించిందని.. 2019లో బీజేపీ సర్కారు రెండోసారి కొలువుదీరగానే ప్రధాని మోదీ రామాలయం నిర్మించారని చెప్పారు. మందిరం ప్రారంభోత్సవానికి రాహుల్‌, ఖర్గేను ఆహ్వానించినా రాలేదన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణ ప్రజలకు, కశ్మీర్‌కు సంబంధం ఏంటనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కశ్మీరు ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్య్రం ఇచ్చేందుకు ఆర్టికల్‌ 370ని రద్దు చేశామన్నారు. ఐదేళ్లు గడిచినా.. కశ్మీర్‌లో ఎలాంటి సమస్యలు రాలేదని అమిత్‌ షా గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ని వెనక్కి తీసుకుంటామని రాహుల్‌ చెబుతున్నారని.. అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదే లేదని ఎద్దేవా చేశారు. ఇక అసదుద్దీన్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను ఏబీసీగా అభివర్ణించారు. ఏ అంటే అసదుద్దీన్‌ ఒవైసీ, బీ అంటే బీఆర్‌ఎస్‌, సీ అంటే కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. మజ్లి్‌సను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించవన్నారు. వీరంతా ముస్లిం ఓట్ల కోసమే పనిచేస్తారని తెలిపారు. రిజర్వేషన్లపై తన ప్రసంగాలపైనే ఫేక్‌ వీడియోలు సృష్టించారని.. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి కూడా షేర్‌ చేశారని షా చెప్పారు. ఈ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. ఫేక్‌ వీడియోలు తయారు చేస్తే సీఎం వెంట పడకుండా ఉంటారా!? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీట నొక్కితే కాంగ్రె్‌సకు ఇటలీలో షాక్‌ తగలాలని అమిత్‌ షా అన్నారు.

పసుపు బోర్డు ఇందూరులోనే

పసుపు బోర్డును ఇందూరులోనే ఏర్పాటు చేస్తామని అమిత్‌ షా ప్రకటించారు. ఈ బోర్డు కోసం ఎంపీ అర్వింద్‌ ఎంతో కష్టపడ్డారని.. ప్రధాని వెంట పడి ఏర్పాటు చేసే విధంగా చూశారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పార్లమెంట్‌ పరిధిలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హోంమంత్రి ప్రకటించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

Updated Date - May 06 , 2024 | 06:10 AM