Share News

Hyderabad: ట్రాఫిక్‌ చప్పుడుతో గుండెకు ముప్పు ..

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:44 AM

రహదారులపై రణగొణధ్వనులు గుండెకు చేటు చేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.

Hyderabad: ట్రాఫిక్‌ చప్పుడుతో గుండెకు ముప్పు ..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రహదారులపై రణగొణధ్వనులు గుండెకు చేటు చేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం గడపటం వల్ల, ట్రాఫిక్‌కు సమీపంలో ఉండటం వల్ల.. శబ్దకాలుష్యంతో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది. జర్మనీకి చెందిన మెయిన్జ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు సర్క్యులేషన్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


దీని ప్రకారం.. ట్రాఫిక్‌ శబ్దాలతో నిద్రపోయే సమయం తగ్గడంతో పాటు నిద్రాభంగం కలగటం వల్ల హర్మోన్ల స్థాయిల్లో మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు, వాపు, రక్తనాళాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఇవి దీర్ఘకాలికంగా కొనసాగితే గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహానికి దారి తీస్తాయి.

రోడ్డు ట్రాఫిక్‌లో పెరిగే ప్రతీ 10 డెసిబిల్‌ శబ్దంతో గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం వచ్చే ప్రమాదం 3.2 శాతం పెరుగుతుందని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. వాయు, రైలు, రోడ్డు ట్రాఫిక్‌ల కారణంగా వెలువడే శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రద్దీగా ఉండే రహదారుల వెంట శబ్ద తీవ్రతను తగ్గించే నాయిస్‌ బ్యారియర్స్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా 10 డెసిబెల్స్‌ వరకు శబ్ద తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 05:44 AM