Share News

Telangana: 21 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ పంపిణీ

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:42 AM

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ను పంపిణీ చేశారు. ఈ నెలాఖరులోగా రెండవ జత యూనిఫామ్‌ను అందించనున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Telangana: 21 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ పంపిణీ

  • 8 ఈ నెలాఖరులోగా రెండవ జత పంపిణీ

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ను పంపిణీ చేశారు. ఈ నెలాఖరులోగా రెండవ జత యూనిఫామ్‌ను అందించనున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటు పాఠశాలల మోజు నుంచి బయటపడేలా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను పంపిణీ చేశారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 21,19,439 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అలాగే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం 1,11,97,976 నోట్‌బుక్‌లకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రోజున 11.65 లక్షల మంది విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను అందించారు.


యూనిఫాంలను కుట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. దీంతో దాదాపు 30 వేల మహిళా సంఘాలకు ఉపాధి లభించింది. కాగా, ప్రైవేట్‌ స్కూళ్లల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆమోదించిన పుస్తకాలనే కొనుగోలు చేసే విధంగా చర్యల్ని తీసుకోవాలని వివిధ ప్రింటర్స్‌ ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనకు వినతి పత్రాన్ని అందించారు. కోట్ల రూపాయలను తాము ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించి, పుస్తకాలను ముద్రిస్తే.. ప్రైవేట్‌ స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Updated Date - Jun 13 , 2024 | 03:42 AM