Share News

Paddy Procurement: కస్టమ్‌ మిల్లింగ్‌.. పొరుగు మిల్లర్లకూ

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:08 AM

ఖరీ్‌ఫలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది.

Paddy Procurement: కస్టమ్‌ మిల్లింగ్‌.. పొరుగు మిల్లర్లకూ

  • ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక మిల్లర్లకు బంపర్‌ ఆఫర్‌!

  • సీఎంఆర్‌ కోసం ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత

  • 100 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వటానికి ఏపీ మిల్లర్లు సిద్ధం

  • స్థానిక రైస్‌మిల్లర్లు ధాన్యం దించుకోని చోట ఇతరులకు చాన్స్‌

హైదరాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది. సన్నధాన్యాన్ని మరాడిస్తే 67 శాతం బియ్యం రావని, బ్యాంకు గ్యారెంటీ నిబంధన పెట్టకుండా ధాన్యం ఇవ్వాలని, మిల్లింగ్‌ చార్జీలు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉన్నాయని కొందరు రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ధాన్యం దించుకోవటానికి ససేమిరా అంటున్నారు. అయితే ధాన్యం సేకరణ పాలసీని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రికవరీ శాతం, బ్యాంకు గ్యారెంటీల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని, మిల్లింగ్‌ చార్జీలు కూడా గతానికంటే 4 రెట్లు పెంచామని స్పష్టం చేసింది. ధాన్యం సేకరణకు సహకరించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెగేసి చెప్పింది. ఈక్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైస్‌మిల్లర్లకు కూడా కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ధాన్యం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈమేరకు ఆమోదం తెలిపింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైస్‌మిల్లర్లు ముందుకొస్తే ధాన్యం అప్పగిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైస్‌మిల్లర్ల దృష్టి తెలంగాణ వైపు మళ్లింది.


  • బ్యాంకు గ్యారెంటీ వంద శాతం

తెలంగాణ రైస్‌మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వటానికే ససేమిరా అంటున్నారు. ఈ పద్ధతి రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఏపీలో వంద శాతం బ్యాంకు గ్యారెంటీ నిబంధన అమలుచేస్తున్నారు. అంటే ఇక్కడ కోటి రూపాయల విలువైన ధాన్యం తీసుకుంటే. రూ. 10 లక్షలకు బ్యాంకు గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది. కానీ ఏపీలో కోటి రూపాయల విలువైన ధాన్యం తీసుకోవాలంటే కోటి రూపాయలకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన ఉంది. అక్కడి రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి మిల్లింగ్‌ చేసి బియ్యం అప్పగిస్తున్నారు. ఇక్కడ మాత్రం వేల కోట్ల విలువైన ధాన్యం తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకొని బియ్యం తిరిగివ్వటానికి ముప్పుతిప్పలు పెడుతున్నారు. అయితే 100శాతం బ్యాం కు గ్యారెంటీ నిబంధనకు అలవాటుపడిన ఏపీ రైస్‌ మిల్లర్లు తెలంగాణ ప్రభుత్వానికి కూడా 100 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి ధాన్యం తీసుకెళ్లటానికి సుముఖంగా ఉన్నారు. అయితే ఎక్కడెక్క డ ధాన్యం అందుబాటులో ఉంది? స్థానిక రైస్‌మిల్లర్లు ఎక్కడ ధాన్యం తీసుకోవటంలేదు? ఎక్కడి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల మిల్లర్లకు అప్పగించాలనే అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కసరత్తు చేస్తోంది. మధ్యంతర గోదాములకు తరలించకముందే ఇతర రాష్ట్రాల రైస్‌మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తే రవాణా ఖర్చు లు, ఎగుమతి,దిగుమతి హమాలీ ఖర్చుల భారం పడబోదనే ఆలోచనతో ఉంది. ధాన్యం ఉత్పత్తి రాష్ట్రంలో 155 లక్షల టన్నులుండటంతో వీలై నం త ధాన్యాన్ని బయటికి పంపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

Updated Date - Nov 14 , 2024 | 04:08 AM