Share News

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:46 AM

భార్యభర్తలిద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగులు.. రెండేళ్ల క్రితం వివాహమైంది.. రెండు రోజుల క్రితం అత్తమామల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది ఆ ఇల్లాలు. సెలవుల అనంతరం విధులకు హాజరయ్యేందుకు ఆ జంట కారులో బయలు దేరింది. అయితే ఆ సంతోషం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

  • ఆగిన కంటైనర్‌ కిందకి దూసుకెళ్లిన కారు

  • యువ దంపతుల దుర్మరణం

  • భర్తది ఖమ్మం, భార్యది ఎన్టీఆర్‌ జిల్లా... సూర్యాపేట జిల్లా మునగాలలో ఘటన

మునగాల, ఏప్రిల్‌ 22: భార్యభర్తలిద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగులు.. రెండేళ్ల క్రితం వివాహమైంది.. రెండు రోజుల క్రితం అత్తమామల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది ఆ ఇల్లాలు. సెలవుల అనంతరం విధులకు హాజరయ్యేందుకు ఆ జంట కారులో బయలు దేరింది. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. రోడ్డుపక్కన నిలిపిఉంచిన లారీ కంటైనర్‌ మృత్యువు రూపంలో ఆ దంపతులను కబళించింది. సోమవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది.


ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్‌రాజు(29) ఏపీ, విజయవాడలో శ్రీచైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఆయన భార్య భార్గవి(26) విజయవాడలోనే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. వారిద్దరూ విజయవాడలోనే నివాసం ఉంటున్నారు. ఈ నెల 20వ తేదీన భార్గవి పుట్టినరోజు కావడంతో హైదరాబాద్‌ హయాత్‌నగర్‌లో నివాసం ఉంటున్న నవీన్‌ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి భార్గవి పుట్టినరోజును వేడుకగా జరుపుకొన్నారు.


సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి సొంత కారులో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపిఉంచిన కంటైనర్‌ కిందికి దూసుకువెళ్లింది. ప్రమాదంలో నవీన్‌రాజు, భార్గవి అక్కడికక్కడే మృతిచెందారు. కంటైనర్‌ కిందికి దూసుకెళ్లడంతో కారు నుజ్జునుజ్జయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్రేన్‌ సాయంతో మృతదేహాలను కష్టతరంగా బయటికి తీశారు.


మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల క్రితమే నవీన్‌, భార్గవిలకు వివాహంకాగా, పిల్లలు లేరు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. నవీన్‌రాజు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, రోడ్డు పక్కన కంటైనర్‌ను నిలిపిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

For More Telangana News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 04:40 PM