Hyderabad: రచయిత్రి పరిమళా సోమేశ్వర్ కన్నుమూత
ABN , Publish Date - Nov 23 , 2024 | 03:38 AM
అభ్యుదయ సాహిత్య సృజనకారిణి, ప్రముఖ రచయిత్రి, విశ్రాంత అధ్యాపకురాలు డా. జి. పరిమళా సోమేశ్వర్ (82) ఇకలేరు. కొద్దిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయం త్రం తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు22(ఆంధ్రజ్యోతి): అభ్యుదయ సాహిత్య సృజనకారిణి, ప్రముఖ రచయిత్రి, విశ్రాంత అధ్యాపకురాలు డా. జి. పరిమళా సోమేశ్వర్ (82) ఇకలేరు. కొద్దిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయం త్రం తుదిశ్వాస విడిచారు. పరిమళ స్వస్థలం కృష్ణా జిల్లా తేలప్రోలు. నారాయణగూడలోని న్యూసైన్స్ కాలేజీ, ప్రభుత్వ సిటీ కళాశాలల్లో రసాయనశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేశారు. మహబూబ్‌నగర్‌లోని మహిళా డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ పొందారు. 1965లో ఆమె ‘సుధారాణి’ కథతో సాహిత్య సృజన ప్రారంభించారు.
‘పిల్లలతో ప్రేమయాత్ర’, ‘తెల్లకాకులు’, ‘భర్తను లొంగదీసుకోవడం ఎలా?’ తదితర నవలలు, 200కుపైగా కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. అభ్యుదయ రచయితల సంఘం(అరసం) నగర అధ్యక్షురాలిగా కొంతకాలం ఉన్నారు. పరిమళా సోమేశ్వర్ భర్త సోమేశ్వరరావు కొంతకాలం క్రితం మరణించారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శనివారం మధ్యాహ్నం దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.