Share News

JP Nadda : మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

ABN , Publish Date - May 07 , 2024 | 06:08 AM

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి.. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘దొడ్డి దారిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు గండి కొట్టలేదని రాతపూర్వకంగా రాసిస్తారా..?’ అని ప్రధాని మోదీ కాంగ్రె్‌సకు సవాల్‌

JP Nadda : మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది

రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం

ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్‌: జేపీ నడ్డా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి.. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘దొడ్డి దారిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు గండి కొట్టలేదని రాతపూర్వకంగా రాసిస్తారా..?’ అని ప్రధాని మోదీ కాంగ్రె్‌సకు సవాల్‌ విసిరితే.. ఆ పార్టీ నోరు మెదపడం లేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాహుల్‌ గాంఽధీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని.. దళిత, ఆదివాసీ, బీసీలను దగా చేస్తున్నారని విమర్శించారు. సోమవారం పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, నల్లగొండలో జరిగిన జన సభల్లో నడ్డా మాట్లాడారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్‌ రాజ్యాంగంలో స్పష్టం చేశారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్లు వారికే చెందాలనే సంకల్పంతో మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ సర్కారు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు ముస్లిం లీగ్‌, తబ్లీగీ జమాత్‌ ఎజెండాను అనుసరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రాముడికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని విమర్శించారు. కాంగ్రెస్‌ జమానాలో అవినీతి, పాలసీలు తయారు చేయలేని అచేతనమైన పాలన కొనసాగిందని విమర్శించారు. మోదీ పాలనతో దేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా రూపొందిందని పేర్కొన్నారు. 2014లో ప్రపంచ జీడీపీలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని మోదీ సర్కారు ఐదో స్థానంలోకి తీసుకువచ్చిందన్నారు. ఫార్మా రంగంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న భారత్‌.. నాణ్యమైన మందులను చౌక ధరకే అందిస్తోందని నడ్డా పేర్కొన్నారు.


పార్టీ ముఖ్య నేతలతో నడ్డా సమీక్ష

వచ్చే ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ లోపాలు ఉన్నా సరిద్దుకోవాలని జేపీ నడ్డా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ప్రత్యర్థులు ఓటర్లకు ఇచ్చే ప్రలోభాలపై ఎక్కడికక్కడే స్పందించాలని అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో నడ్డా సమీక్ష నిర్వహించారు. 17 పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా కొనసాగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

12 స్థానాల్లో గెలవబోతున్నాం..?: బీఎల్‌ సంతోష్‌

రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుంటే ప్రజలెవరూ నమ్మడం లేదని బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవుతున్నారని, ఐదు రోజులు కష్టపడి పనిచేస్తే రాబోయే ఐదేళ్లు మనవేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర శక్తికేంద్రాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో సంతోష్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలను గెలువబోతున్నామని చెప్పారు.


బీజేపీ ప్రచారానికి కాకతీయ వారసుడు కమలచంద్ర

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఐదు రాష్ట్రాల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్న ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ రాజు, కాకతీయ రాజవంశం 22వ వారసుడు కమలచంద్ర భంజ్‌దేవ్‌ బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఖమ్మం వచ్చారు. ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోదరావుతో ఉన్న స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన విజయం కోసం ఐదు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం కమలచంద్ర హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వస్తూ మార్గమధ్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆగారు. అక్కడ కాకతీయు కాలంలో నిర్మించిన పురాతన శివాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Updated Date - May 07 , 2024 | 06:08 AM