Share News

క్వారీ నీటిలో దూకి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:34 AM

ఓ యువకుడు నాపరాతి క్వారీ నీటిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మల్కాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది.

క్వారీ నీటిలో దూకి యువకుడి ఆత్మహత్య
అంజిలప్ప మృతదేహాన్ని బయటకు తీస్తున్న గ్రామస్థులు

తాండూరురూరల్‌, ఏప్రిల్‌ 18: ఓ యువకుడు నాపరాతి క్వారీ నీటిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మల్కాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అక్కంపల్లి అంజిలప్ప(26) కొన్ని రోజులుగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో ఏమైనా పని చేసుకుని బతకాలని తల్లి, సోదరి మందలించారు. ఇందుకు జీవితంపై విరక్తిచెంది అంజిలప్ప గ్రామశివారులో ఉన్న నాపరాతి గని నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. క్వారీపక్కనే చెప్పులు, దుస్తులు ఉండటంతో స్థానికులు 100కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు ధన్‌రాజ్‌, ప్రతాప్‌ క్వారీ నీటిలో దిగి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట మరొకరు..

పరిగి: ప్రేమ వ్యవహరంలో ఓ యువకుడు స్థానిక పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని యాభాజీగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ అనే యువకుడు ఏడాది కాలంగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో రాజ్‌కుమార్‌కు మరో యువతితో పెళ్లికి ఇటీవలే నిశ్చితార్థం అయింది. అయితే, తనను కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు రాజ్‌కుమార్‌ను గురువారం స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన పోలీసులు వెంటనే అతన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చెట్టుకు ఉరేసుకుని..

మూడుచింతలపల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట్‌ మండలం బాబాగూడ గ్రామానికి చెందిన కాసుల సంపత్‌(23) ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడు నెలల కింది నుంచి కంపెనీ యాజమాన్యం హోల్డ్‌లో పెట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శామీర్‌పేట్‌ నుంచి బొమ్మరాసిపేట్‌ గ్రామానికి వెళ్లే మార్గంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:34 AM