ఈసారైనా తీరుస్తారా?
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:33 AM
ధరణి పోర్టల్‌లో అపరిష్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెండోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.

‘ధరణి’ సమస్యల పరిష్కారానికి రెండోసారి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
పట్టా భూములున్నా అందని పాస్‌బుక్‌లు
పథకాలకు నోచుకోలేకపోతున్న రైతులు
యాచారం, జూన్ 16 : ధరణి పోర్టల్‌లో అపరిష్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెండోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మండలంలోని 24 పంచాయతీల్లో 2,550 భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. పోర్టల్‌లో భూ సమస్యలు పరిష్కరించి పాస్‌బుక్‌లు అందించేందుకు గత మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినా ఏ ఒక్క సమస్యా తీర్చలేదు. టీఎం 33 మాడ్యూల్లో 1,557 సమస్యలున్నా పరిష్కరించలేదు. పేరుకే స్పెషల్ డ్రైవ్ తప్ప చేసేదేమీ లేదని రైతులు మండిపడుతున్నారు. ‘ధరణి’లో భూ వివరాలను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆర్డీవో, కలెక్టర్ తమ లాగిన్లతో సరిచేసి సీసీఎల్‌ఏకు పంపుతున్నారు. అయితే సీసీఎల్‌ఏ మాత్రం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల అప్రూవల్ రికార్డులను చూడకుండానే రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు రైతుల సమస్యలను పరిశీలిస్తే.. మల్కీజ్‌గూడ పరిధిలో బూడిద వెంకటయ్యకు 354 సర్వే నంబర్‌లో 2ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే 38గుంటలకే పాస్‌బుక్ వచ్చింది. మిగిలిన ఎకరం 12గుంటలనూ ఆయన రికార్డులో ఎక్కించొచ్చని తహసీల్దార్, ఆర్‌ఐ, ఆర్డీవో, కలెక్టర్ అప్రూవ్ చేసి సీసీఎల్‌ఏకు పంపితే అక్కడి అధికారులు పాస్‌బుక్ ఇవ్వడం లేదు. తనకు పట్టాభూమి ఎలా సంక్రమించిందో రికార్డులను సీసీఎల్‌ఏకు పంపినా పట్టించుకోవడం లేదని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమి పోర్టల్‌లో చూపకపోవడంతో రైతుబంధు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణం వంటివి కోల్పోతున్నానని రైతు వాపోతున్నాడు. ఇలాంటి సమస్యే చాలా మంది రైతులది. యాచారానికి చెందిన గోపాల్‌రెడ్డికి తాతల కాలం నాటి ఐదెకరాల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో ఇది భూదాన్ భూమిగా మారింది. మంతన్‌గౌరెల్లికి చెందిన కెతావత్ మంగ్లాకు సర్వే నంబర్ 54లో ఉన్న 6 ఎకరాల పట్టా భూమినీ భూదాన్ భూమిగా మార్చారు. రైతు మూడేళ్లుగా కలెక్టర్, సీసీఎల్‌ఏల చుట్టూ తిరుగుతున్నా భూదాన్ బోర్డ్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటే సరి చేస్తామంటున్నారు. అలాగే యాచారానికి చెందిన జనార్ధన్‌రెడ్డికి 77, 78 సర్వే నంబర్లలో 25ఎకరాల వారసత్వ పట్టా భూమి ఉంది. ఈ భూమి ధరణి పోర్టల్‌లో భూదాన్ భూమిగా నమోదు చేశారు. రిటైర్డ్ ఏసీపీ రవీందర్‌రెడ్డికి 72, 73, 74 సర్వే నంబర్లలో ఉన్న 34 ఎకరాల పట్టా భూమి సైతం భూదాన్ భూమిగా నమోదు చేశారు. ధర్మన్నగూడలోని చాలా మంది రైతుల పట్టా భూములను భూదాన్ భూములుగా రికార్డు చేశారు. పట్టా భూములను భూదాన్‌గా ఎలా మార్చారని అధికారులను రైతులు అడిగితే ఈ విషయం మీరు భూదాన్ బోర్డ్ వద్దే తేల్చుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చి పంపుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారు.
అవే పాత సమస్యలు
ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మొదటి దఫా స్పెషల్ డ్రైవ్‌లో ఉన్న సమస్యలే రెండో దఫాలోనూ ముందుకొస్తున్నాయి. రెండో దఫాలోనూ తమ సమస్యలు తీరతాయనే నమ్మకం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులే ధరణిలో తప్పుడు రికార్డులు నమోదు చేసి కలెక్టర్, సీసీఎల్‌ఏ, భూదాన్ బోర్డ్‌లను అడగాలంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది గ్రామంలో తిరిగి పహాణి ఆధారంలో విచారణ చేయకుండానే వివరాలను ధరణిలో అప్‌లోడ్ చేయడం వల్లే తిప్పలొచ్చాయి. ధరణి సమస్యలన్నీ పరిష్కరించి భూ మాత పోర్టల్‌ను తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. అయితే పాత సమస్యలు తీరవు.. కొత్త పోర్టల్ రాదని రైతులు వాపోతున్నారు.
నా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు : మంగ్లానాయక్, రైతు, మంతన్‌గౌరెల్లి
నా పట్టా భూమి ధరణిలో భూదాన్ భూమిగా మార్చారు. నేను యుక్త వయసులో రిక్షా తొక్కి పైసాపైసా కూడబెట్టి ఊర్ల రెడ్ల వద్ద భూమి కొన్నా. ధరణి వచ్చినంక నా పట్టా భూమిని భూదాన్ భూమిగా మార్చిన్రు. నాకు ఇంత వరకు రైతుబంధు చిల్లిగవ్వ రాలే. కలెక్టర్ దగ్గరికి పోయినా నా సమస్య పరిష్కరించలేదు. ఆపదుండి భూమి అమ్ముకుందామన్నా అమ్మకుండా రికార్డులు మార్చడం అధికారులకు ఎంత వరకు న్యాయం?