లెక్కలు తేలేనా?
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:38 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది.

జిల్లాలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మోక్షం కలిగేనా?
పునర్విభజనలో 317జీవో కింద ఉపాధ్యాయుల సర్దుబాటు
ఉమ్మడి మహబూబ్‌నగర్ పది మండలాల విలీనంతో సమస్య
స్థానికతను పక్కనబెట్టి సీనియార్టీకి పెద్దపీట వేస్తే అన్యాయం
క్యాడర్ స్ట్రెంత్‌కు మించి ఉపాధ్యాయుల రాకతో ఇబ్బందులు
జిల్లాలో ఇప్పటికే 45శాతానికి మించిన నాన్ లోకల్ టీచర్లు
క్యాడర్ స్ట్రెంత్ తేల్చి బదిలీలు చేపట్టాలని సంఘాల డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. స్థానికత ఆధారంగానే జిల్లాలో ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు చేపట్టాలని జిల్లాకు చెందిన టీచర్లు, సంఘాల నాయకులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విలీనమైన పది మండలాల ఉపాధ్యాయులను, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని కలుపుకొని సీనియార్టీ ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేపడితే సొంత జిల్లా వారికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో స్థానికేతర ఉపాధ్యాయుల సంఖ్య 45శాతానికి మించిందని, ఈ నేపథ్యంలో సీనియార్టీ ప్రాతిపదిక కాకుండా స్థానికత ఆధారంగానే అన్ని జిల్లాలతో పాటే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి అర్బన్, జూన్ 16) : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో తమకు కూడా ప్రమోషన్ వస్తుందని, బదిలీ అవుతుందని ఆశపడ్డ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాల పునర్విభజనలో గత ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. ఈ సందర్భంలో స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా సీనియార్టీకి పెద్దపీట వేయడంతో చాలామంది జూనియర్ ఉపాధ్యాయులు సొంత జిల్లాను వీడి వేరే జిల్లాలకు వెళ్లారు. కొత్త జిల్లాలైన సమయంలో క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేశారు. ఇప్పుడు ఇదే అసలు సమస్యగా మారింది. జిల్లాకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి క్యాడర్(ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య) స్ట్రెంత్‌కు మించి టీచర్లు రావడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ తరుణంలో కేడర్ స్ట్రెంత్ సంఖ్య తెలియనంత వరకు రంగారెడ్డి జిల్లాకు బదిలీలు పదోన్నతులు జరుపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో స్థానికేతర ఉపాధ్యాయుల సంఖ్య 45శాతానికి మించిపోవడం, అలాగే క్యాడర్ స్ట్రెంత్‌కు మించి ఉపాధ్యాయులు రావడంతో జిల్లాలోని నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్యాడర్ స్ట్రెంత్ లెక్కలను త్వరగా తేల్చి ఈ షెడ్యూల్‌లోనే అన్ని జిల్లాల మాదిరిగానే రంగారెడ్డి జిల్లా టీచర్ల కూడా పదోన్నతులు బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డిలను కలిసి విన్నవించారు. జిల్లాకు అక్రమ బదిలీల ద్వారా, క్యాడర్ స్ట్రెంత్‌కు మించి కేవలం 103 మంది టీచర్లే వచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారి లెక్కలు చూపిస్తున్నారు. కానీ 250కిపైగా అదనంగా టీచర్లు వచ్చి చేరారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తేనే బదిలీలు పదోన్నతులు జరిగే పరిస్థితి నెలకొంది. అవసరానికి మించి జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులను వెనక్కు పంపిస్తారా? లేక సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారా? లేక మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పోస్టులను బదిలీ చేస్తారా? అనే అంశాల్లో స్పష్టత రావాల్సి ఉన్నది.
అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలి : బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఉపాధ్యాయ బదిలీల్లో స్థానిక, స్థానికేతర అంశంలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించాలి. నిబంధనలకు విరుద్ధంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మంచిర్యాల, యాదాద్రి, సంగారెడ్డి వంటి జిల్లాల నుంచి ఉపాధ్యాయులు జిల్లాకు వచ్చారు. ప్రభుత్వ ఆర్డర్లతో, స్పౌస్ పేరుతో విరుద్ధ పోస్టుల పేరుతో స్థానిక నిరుద్యోగులకు చెందాల్సిన ఖాళీలను స్థానికేతరులతో నింపారు. పరస్పర బదిలీలు చేసినప్పుడు కూడ నింబంధనలు పాటించలేదు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 400కుపైగా ఉపాధ్యాయ ఖాళీలను స్థానికేతరులతో భర్తీ చేశారు. స్థానిక, స్థానికేతర అంశాన్ని వెంటనే తేల్చాలి.
షెడ్యూల్ ప్రకారమే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి : ఏవీ.సుధాకర్, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వం విడుదల చేసిన బదిలీలు పదోన్నతుల షెడ్యూల్‌లోనే జిల్లా ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలి. అధికారులు క్యాడర్ స్ట్రెంత్ లెక్కలను త్వరగా తేల్చి ఈ ప్రక్రియకు మార్గం సుగమం చేయాలి. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ ప్రక్రియ పూర్తవుతుండడంతో తదుపరి ఆలస్యంగా చేపడితే టీచర్లకు అన్యాయం జరుగుతుంది. దొడ్డిదారి బదిలీలను నివారించి జిల్లా నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయ సంఘాలకు బాసటగా నిలవాలి. జిల్లా అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
జిల్లాకు తీరని అన్యాయం జరిగింది : పి.రఘునందన్‌రెడ్డి, టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రంగారెడ్డి జిల్లాకు ఇప్పటికే తీరని అన్యాయం జరిగింది. స్థానికేతరుల కోటా పరిమితికి మించిపోయింది. గత సంవత్సరం విడుదల చేసిన 317జీవోతో చాలా మంది రంగారెడ్డి స్థానికత కలిగిన ఉపాధ్యాయులు వికారాబాద్ జిల్లాకు వెళ్లారు. ఇతర జిల్లాల నుంచి అలకేషన్లో తప్పులు జరిగిందని కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుని రంగారెడ్డి జిల్లాకు అక్రమంగా సుమారు 200మందికిపైగా ఉపాధ్యాయులు వచ్చారు. దీనివల్ల క్యాడర్ స్ట్రెంత్ దెబ్బతిని స్థానిక ఉపాధ్యాయులకు పదోన్నతులు రావడం లేదు. ఈ సమస్య మీద కోర్టుకు వెళ్లడం వల్ల అన్ని జిల్లాల్లో పదోన్నతులు బదిలీలు ప్రారంభమైనా రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఆగిపోయాయి. దీనివల్ల భవిష్యత్తులో మల్టీ జోన్-2లో ఉన్న ఉపాధ్యాయులతో సీనియారిటీ లిస్టు తయారు చేస్తే రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు వెనుకబడే ప్రమాదం ఉంది. ఈ షెడ్యూల్లోనే రంగారెడ్డి జిల్లాలోనూ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి.