Share News

జీతాలు మాకెందుకివ్వరు?

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:17 AM

మాతో కలిసి పని చేసే కార్మికులకు జీతాలు ఇస్తున్నారు.. మేము కూడా పని చేస్తున్నాం కదా.. మరి ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని ఇద్దరు మున్సిపల్‌ కార్మికులు పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన తెలిపారు.

జీతాలు మాకెందుకివ్వరు?

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆక్రోశం

పెట్రోల్‌ బాటిల్‌తో ఇద్దరు కార్మికుల నిరసన

ఐదేళ్లుగా పని చేస్తున్నా జీతం ఇవ్వారా అంటూ ఆగ్రహం

తాండూరు, సెప్టెంబరు 16: మాతో కలిసి పని చేసే కార్మికులకు జీతాలు ఇస్తున్నారు.. మేము కూడా పని చేస్తున్నాం కదా.. మరి ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని ఇద్దరు మున్సిపల్‌ కార్మికులు పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన తెలిపారు. సోమవారం తాండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు నర్సిములు, జ్యోతిలు తమకు జీతాలు ఇవ్వాలంటూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనులు చేయించుకుంటున్నారని, మాతో పాటు పనిచేసిన 9 మందికి జీతాలు ఇచ్చారని, మాకు మాత్ర ఎందుకు ఇవ్వడం లేదని మీడియా ఎదుట వాపోయారు. అధికారులు జీతం ఇస్తామని హామీ ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పెట్రోల్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ విక్రమ సింహారెడ్డి వచ్చి కార్మికులను సముదాయించే యత్నం చేయగా.. మాకు అన్యాయం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. కాగా, ఇంతకుముందు పనిచేసిన కమిషనర్‌.. కలెక్టర్‌ వద్ద తీసుకొచ్చిన అప్రూవల్‌లో నర్సిములు, జ్యోతి పేర్లు లేవని, ఇప్పుడేమీ చేయలేమని కమిషనర్‌ వివరించారు. ఫైల్‌ను పరిశీలిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. దాంతో కార్మికులు నిరసనను విరమించారు. అనంతరం నర్సిహులు మీడియాతో మాట్లాడుతూ ఐదుళ్లుగా పని చేస్తున్నామని, మాతో పాటు పనిచేసిన 9 మందికి జీతాలు వేశారు. మాకు వేయమంటే మీ పేర్లు లేవని చెబుతున్నారు. మా ఇద్దరి పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఏడాదిగా జీతం డబ్బుల గురించి అడిగితే.. ఈ సార్‌ వద్దకు.. ఆ సార్‌ వద్దకు పొమ్మంటూ తిప్పించుకుంటున్నారని వాపోయాడు. అదేవిధంగా జ్యోతి మాట్లాడుతూ 9 మంది కార్మికులకు జీతాలు వేసిన అధికారులు మా ఇద్దరిని పట్టించుకోవడం లేదని తెలిపింది. తాము కూడా వాళ్లలాగే ఐదేళ్లుగా పని చేస్తున్నామని, మేం ఏం పాపం చేశామని వాపోయింది. కలెక్టర్‌ సార్‌ వద్దకు వెళ్తే సంతకం చేసి మున్సిపల్‌ ఆఫీసుకు పంపించారని, తీర్మానంలో కూడా మా పేర్లు ఉన్నాయని తెలిపింది. మాకు న్యాయం జరిగేవరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పింది.

Updated Date - Sep 17 , 2024 | 07:54 AM