Share News

జీరో బిల్లులు ఎప్పుడొస్తాయ్‌?

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:31 AM

మార్చి ఒకటి నుంచి పేదలకు జీరో(0) బిల్లులు గాకుండా ఎప్పటిమాదిరగానే కరెంటు బిల్లులు వచ్చాయని, దీంతో జనం అయోమయంలో ఉన్నారని మంగళవారం ఇబ్రహీంపట్నం మండలపరిషత్‌ సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

జీరో బిల్లులు ఎప్పుడొస్తాయ్‌?
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కృపేశ్‌, పాల్గొన్న అధికారులు

ఇబ్రహీంపట్నం, మార్చి 5 : మార్చి ఒకటి నుంచి పేదలకు జీరో(0) బిల్లులు గాకుండా ఎప్పటిమాదిరగానే కరెంటు బిల్లులు వచ్చాయని, దీంతో జనం అయోమయంలో ఉన్నారని మంగళవారం ఇబ్రహీంపట్నం మండలపరిషత్‌ సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లరేషన్‌ కార్డులున్నా కొందరికి వందల్లో బిల్లు వచ్చింది వాస్తవమేనని, మున్ముందు వీటిని సరిచేస్తామని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివా్‌సరావు సమాధానమిచ్చారు. 200 యూనిట్ల వరకు పేదలు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ చెల్లించినా వచ్చే బిల్లుల్లో వారి ఖాతాలో జమ చేస్తామని ఆయన చెప్పారు. ఏవైనా అనుమానాలుంటే తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్‌, ప్రజాపాలన దరఖాస్తు రసీదు, కరెంటు కనెక్షన్‌ నంబర్‌ను విద్యుత్‌ కార్యాలయంలో అందజేస్తే జీరో బిల్లుకు ఎంటర్‌ చేస్తామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ కృపేశ్‌, వైస్‌ఎంపీపీ వెంకటప్రతా్‌పరెడ్డి అధికారులకు సూచించారు. కరోనాకు ముందు ఇబ్రహీంపట్నం నుంచి పొల్కంపల్లి, అనాజ్‌పూర్‌ మీదుగా హయత్‌నగర్‌కు బస్సులు నడిచేవని, నిలిపేసిన వాటిని పునరుద్ధరించాలని ఎంపీటీసీ మంగ అధికారులను కోరారు. మండలంలో మొత్తం 37 రేషన్‌ షాపులకు అనుమతి ఉండగా ప్రస్తుతం ఏడు చోట్ల ఖాళీలున్నాయని, వీటని భర్తీ చేస్తామని డీటీ శ్రీనివాస్‌ తెలిపారు. ఖాళీచోట్ల ఇన్‌చార్జిలతో బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం మండలంలో 1,135 మంది కూలీలు పనిచేస్తున్నారని ఏపీవో తిరుపతాచారి తెలిపారు. మండలంలో ఉపాధి కింద ఇప్పటికి రూ.5.12కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు.ఆరు వారాలుగా కూలీలకు బిల్లులు రావాల్సి ఉందని ఎన్‌పీసీ క్లియర్‌ కాగానే వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్‌ సునీత, ఎంపీడీవో వెంకటమ్మ, డీఆర్‌డీఏ ఏపీడీ సక్రియానాయక్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ రాజ్యలక్ష్మి, ఏపీఎం రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:31 AM