Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రోడ్ల పనులు పూర్తయ్యేదెన్నడు?

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:20 AM

మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం వరకు జరుగుతున్న నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖలో నిధుల కొరతనా? లేక విడుదల చేయడంలో అధికారుల జాప్యమా? తెలియదు గానీ మొత్తానికి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

రోడ్ల పనులు పూర్తయ్యేదెన్నడు?
ఏడాదిగా అసంపూర్తిగా ఉన్న కొత్తసల్లి-నాగిల్ల రోడ్డు

నెలల తరబడి కొనసాగుతున్న పనులు

వాహనదారులు, స్థానికుల యాతన

యాచారం, మార్చి 3 : మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం వరకు జరుగుతున్న నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖలో నిధుల కొరతనా? లేక విడుదల చేయడంలో అధికారుల జాప్యమా? తెలియదు గానీ మొత్తానికి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో అయినా పనుల వేగం పెరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట-యాచారం వరకు 12కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు ప్రభుత్వం రూ.84.5కోట్ల నిధులు కేటాయించింది. మూడు చోట్ల కల్వర్టులు, నజ్దిక్‌సింగారం వద్ద బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మధ్యలో కుంట కట్ట ఎత్తు తగ్గించి రోడ్డును విస్తరించాల్సి ఉంది. ఇక్కడే కాజ్‌వే నిర్మాణం కూడా చేపట్టాలి. నందివనపర్తిలో నందీశ్వరాలయం రోడ్డుకు ఆనుకొని ఉంది. ఆలయం పక్కనే ఇళ్లు ఉన్నాయి. రోడ్డును విస్తరణలో వాటిని తొలగించాల్సిందే. నందీశ్వరాలయం వద్ద విశాలమైన చౌరస్తా ఏర్పాటు చేయాల్సి ఉంది. మీర్‌ఖాన్‌పేట, నజ్దిక్‌సింగారం గ్రామాల్లో లింక్‌ సీసీ రోడ్లు వేయాల్సి ఉంది. గత ప్రభుత్వం నందివనర్తి-మేడిపల్లి వరకు ఆరు కిలో మీటర్ల రోడ్డు విస్తరణకు రూ.48కోట్లు కేటాయించింది. నందివనపర్తిలో ఇళ్లు తొలగి ంచాల్సి ఉండడంతో రోడ్డు విస్తరణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రోడ్డులో రెండు చోట్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఎకరానికి రూ.50లక్షలు ఇస్తేనే భూమి ఇస్తామని రైతులు భీష్మించడంతో అంత రేటు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం భూసేకరణ చేపట్టలేదు. నందివనపర్తిలో బైపాస్‌ రోడ్డు వేస్తారా? లేదా? అనేది దానిపై క్లారిటీ లేదు. మొగ్గుళ్లవంపు నుంచి యాచారం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు కూడా నిలిచాయి. ఈ మార్గంలో అంబేడ్కర్‌ విగ్రహం వరకు రోడ్డు విస్తరిస్తే 20 మంది దుకాణాదారులు వీధిన పడతారు. మొగ్గుళ్లవంపు నుంచి తిరుమలేశుని గుట్ట వరకు బైపాస్‌ రోడ్డు వేస్తే బాగుంటుందని దుకాణాదారులంటున్నారు. మొగ్గుళ్లవంపు నుంచి బైపాస్‌ రోడ్డు వేసి జగ్జీవన్‌రా, అంబేడ్కర్‌ విగ్రహాలు తొలగించకుండా రోడ్డు విస్తరణ చేయాలని నాయకులు చెబుతున్నారు.

స్తంభాలు తొలగిస్తేనే పనులు ముమ్మరం

కందుకూరుమండలం మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం వరకు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఎల్టీ, 11కేవీ లైన్లను రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఎస్టిమేషన్‌ వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ క్రమంలో పాత స్తంభాల తొలగింపు, కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. నిధులు విడుదల కాగానే రోడ్డు పనులు ముమ్మరం చేస్తామని అధికారులంటున్నారు. మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం వరకు 150 స్తంభాలు, కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. స్తంభాలు తొలగించిన తర్వాతే రోడ్డు పనులు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు నిధులు విడుదలచేసి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వాహనదారుల ఇబ్బందులు

యాచారం మండలం కొత్తపల్లి నుంచి కిషన్‌పల్లి మీదుగా మాల్‌ వరకు, కొత్తపల్లి నుంచి నాగిల్ల గ్రామం వరకు రూ.8కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు నిలిచాయి. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్‌ రోడ్డుకు ఇరువైపులా మట్టిపోసి చేతులు దులుపుకున్నాడు. కొత్తపల్లి నుంచి కడ్తాల మండలం నాగిల్ల వరకు రోడ్డు మరమ్మతుకు రూ.4.5కోట్లు మంజూరయ్యాయి. ఈ రోడ్డు పనులు ఏడాదిగా ముందుకుసాగడం లేదు. పనులు చేయించడంలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకిరువైపులా మట్టి పోయడం,కంకర తేలడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. కొత్తపల్లి, కిషన్‌పల్లి మీదుగా మాల్‌ వరకు రూ.3.5కోట్లతో రోడ్డు పనులు చేపట్టారు. కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొత్తపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తిచేయించాలని కోరుతున్నారు.

బైపాస్‌ రోడ్డు వేయకుండా పనులు చేపట్టాలి : ఉదయశ్రీ, మాజీ సర్పంచ్‌, నందివనపర్తి

నందీశ్వరాలయం నుంచి యాచారం వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం చేయాలి. నందివనపర్తిలో బైపాస్‌ రోడ్డు వేయకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. అధికారులు పనులు వెంటనే పూర్తిచేయాలి. వేసవిలో పనులు పూర్తిచేసి రోడ్డును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి.

పనులు వెంటనే చేయకుంటే ధర్నాకు దిగుతాం : శ్రీశైలం, రైతు, కొత్తపల్లి

నెలల కింద చేపట్టిన రోడ్డు పను లను వెంటనే పూర్తిచేయాలి. కొత్తపల్లి నుంచి నాగిల్లకు, మాల్‌కు పోవాలంటే నరకం అనుభవిస్తున్నాం. కాంట్రాక్టర్‌ రోడ్డుకు రెండు వైపులా మట్టి పోయడంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే వెళ్లలేని పరిస్థితి. నెల వ్యవధిలో రోడ్డు పనులు పూర్తి చేయకపోతే మండల కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం.

త్వరలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం : కె.వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ

మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం మండల కేంద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తి చేస్తాం. రోడ్డుకు ఆనుకొని ఉన్న స్తంభాలను తొలగించడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేసి విస్తరణ పనులు వేగవంతం చేస్తాం. వేసవిలో రోడ్డు పనులు పూర్తి చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Mar 04 , 2024 | 12:20 AM