బీటీ రోడ్డు పనులెప్పుడు?
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:09 AM
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఆలసత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మట్టి దారితో ఆలూర్-న్యాలట వాసుల ఇబ్బందులు
శిలాఫలకమేసి ఏడాది పూర్తి
నిధులొచ్చినా చేపట్టని రహదారి నిర్మాణం
పట్టించుకోని పాలకులు, అధికారులు
చేవెళ్ల, సెప్టెంబరు 15: అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఆలసత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చేవెళ్ల మండలం ఆలూర్ నుంచి న్యాలట గ్రామం వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని అప్పటి మంత్రులు సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య కలిసి ఆర్భాటంగా 2023 సెప్టెంబరు 7న పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.4.5కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం వేసి ఏడాది పూర్తయినా నేటికీ తట్టెడు మట్టి తియ్యలేదు. చేవెళ్ల నుంచి ఆలూరుకు రోడ్డును బీటీగా మార్చితే ప్రజా రవాణా సులభం అవుతుందని గ్రామస్తులంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి రోడ్డుపై వాహనాలను నడపలేకపోతున్నామని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆలూరు ప్రజలు కోరుతున్నారు.
హైవేపై ప్రయాణానికి జంకుతున్న జనం
ఏడాది క్రితం బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు ముందుకు సాగకపోవడంపై అఽధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. తరచూ జరుగుతున్న యాక్సిడెంట్లతో ప్రమాదకరంగా మారిన హైదరాబాద్-బీజాపూర్ రోడ్డుపై ప్రయాణించాలంటే భయం వేసి మార్గమధ్య నుంచి ఉన్న రోడుడపై నుంచి వెళ్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదంటున్నారు. వర్షం పడితే మట్టి రోడ్డుపై వాహనాలు నడ పడం కష్టతరంగా మారిందని గ్రామస్తులు, రైతులు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకుటు తాను గెలిస్తే మొదట రోడ్డు వేయిస్తానని చెబుతారు తప్ప గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆలూరు ప్రజలు పడుతున్న ఇబ్బందులను అటు అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
వెంటనే బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలి : మహ్మద్, ఆలూరు
ఆలూరు నుంచి న్యాలట రోడ్డు వరకు బీటీ రోడ్డు వేస్తామని చెప్పి ఏడాది కింద అప్పటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే శిలాఫలకం వేశారు. రోడ్డు పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా తొమ్మిది నెలలు దాటింది. అధికారులు పట్టించుకొని బీటీ రోడ్డు వేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలి. నిధులు మంజూరయ్యాక పనులు ప్రారంభానికి ఇంత సమయం తీసుకోవడం సరికాదు.