Share News

‘కారుణ్య’మేది?

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:49 PM

స్థానిక సంస్థల ఉద్యోగులైవరైనా మరణించినా, లేక ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నా సదరు ఉద్యోగి కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తోంది. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా వస్తున్నదే.

‘కారుణ్య’మేది?

ఉద్యోగాల కోసం వారసుల ఎదురుచూపులు

రెండున్నరేళ్లుగా నిలిచిన నియామకాలు

ఖాళీలుఏర్పడితేనే కారుణ్య నియామకాలు

ఉద్యోగి మృతితో కుటుంబీకుల ఆర్థిక ఇక్కట్లు

ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వానికి బాధితుల వేడుకోళ్లు

జిల్లాలో కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ రెండున్నరేళ్లుగా నిలిచిపోయింది. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఉన్న కాలంలో చేపట్టిన ఈ ప్రక్రియ వికారాబాద్‌ జడ్పీ ఏర్పడిన తరువాత మాత్రం ఇంత వరకూ చేపట్టలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 24 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ రాజ్‌, పురపాలికలు, తదితర స్థానిక సంస్థల్లో లేదా ఏదేని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన, ఏదేని కారణంతో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఉద్యోగి కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించడమే కారుణ్య నియామకం. ఉద్యోగి మృతితో మానసిక కుంగుబాటుతో పాటు జీతం రాక వారి కుటుంబాలు ఆర్థిక ఇక్కట్లు పడుతున్నాయి. ప్రభుత్వం కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టి తమ ఇబ్బందులు తీర్చాలని ఉద్యోగుల వారసులు కోరుతున్నారు.

వికారాబాద్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్థానిక సంస్థల ఉద్యోగులైవరైనా మరణించినా, లేక ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నా సదరు ఉద్యోగి కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తోంది. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా వస్తున్నదే. అయితే జిల్లాలో రెండున్నరేళ్లుగా ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రెండున్నరేళ్లుగా కారుణ్యనియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. వివిధ కారణాలతో మృతిచెందిన జడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి సర్వీసు కాలంలో మరణిస్తే అతడి/ఆమె కుటుంబంలో భార్య/భర్త/కుమారుడు/కూతురు లేదా కుటుంబీకుల అంగీకారం ఉన్న వారిలో ఒకరికి కారుణ్య నియామకం ఉద్యోగం ఇవ్వాలి. అతడి/ఆమె అర్హత ఆధారంగా మృతిచెందిన ఉద్యోగికి తత్సమాన ర్యాంక్‌ కొలువో లేక కొంత తక్కువదో ఏదో ఒక ఉద్యోగాన్ని ప్రభుత్వం కల్పించాలి. ఇది ఉద్యోగుల హక్కే కాకుండా సర్వీసు రూల్స్‌లోనూ ఉన్న నిబంధన. ప్రభుత్వ శాఖలకు సంబంధించి కారుణ్య నియామకాలు కొనసాగుతున్నా జడ్పీ, మండల పరిషత్తులు, ఇతర స్థానిక సంస్థల్లో మాత్రం సబార్డినేట్‌ ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 2021 జూలై నెల వరకు కారుణ్య నియామకాలు చేపట్టిన జిల్లా పరిషత్‌ అధికారులు ఆ తరువాత ఆ ప్రక్రియను నిలిపివేశారు. కొత్త జిల్లా పరిషత్‌లకు కారుణ్య నియామకాల అధికారాలు కల్పిస్తూ 2022 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ రాజ్‌, పురపాలికలు తదితర స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాలకు టైపిస్టు, రికార్డు అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థలు, విద్యా శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల వారసులు తమకు అర్హతలను అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం లేకుండా పోతోందని బాధితులు వాపోతున్నారు.

అరకొర ఖాళీలు.. చిరుద్యోగాలకే అవకాశం

రెండున్నరేళ్లుగా కారుణ్య నియామకాలు చేయకపోవడంతో జిల్లాలో 24మంది బాధిత కుటుంబాల వారసులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58ఏళ్ల నుంచి 61ఏళ్లకు పెంచడంతో గతంలో మాదిరి ఖాళీలు ఏర్పడడం లేదు. జీవో 317ప్రకారం చేపట్టిన ఉద్యోగుల విభజనలో జిల్లాలో వివిధ కేడర్ల పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాలకు పంచాయతీరాజ్‌ టీచర్లు, స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులు 24మంది జెడ్పీకి దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య నియామకాల్లో డిగ్రీ అర్హతున్న వారికి జూనియర్‌ అసిస్టెంట్‌, తెలుగు, ఇంగ్లీష్‌ హయ్యర్‌ ఉత్తీర్ణత ఉన్న వారికి టైపిస్ట్‌ ఉద్యోగాలిస్తారు. కనీసం పదో తరగతి చదివిన వారికి ఆఫీస్‌ సబార్డినేట్‌ జాబ్‌ ఇస్తారు. ప్రస్తుతం జడ్పీ పరిధిలో మూడు టైపిస్ట్‌, ఒక రికార్డు అసిస్టెంట్‌, 23 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో కారుణ్య నియామకాలకు ఎదురు చూస్తున్న వారిలో చాలా వరకు గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, బీఎడ్‌, బీఈ చదివి వారు ఉండగా, ఏడుగురు డిగ్రీ కోర్సు చేస్తున్నారు. కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకున్న 24మందిలో 17మందికి డిగ్రీ, ఆ పై విద్యార్హతలు, ఏడుగురు డిగ్రీ కోర్సు చేస్తున్నారు. వీరిలో ఏడుగురికి ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌) పోస్టుల్లో నియమించేందుకు జెడ్పీ అధికారులు సిద్ధమైనా తాము డిగ్రీ పూర్తిచేసే దశలో ఉన్నందున తమకు ఆ ఉద్యోగానికి బదులు జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ పోస్టు కావాలంటూ రాతపూర్వకంగా అధికారులకు అప్పీలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 2023 సెప్టెంబరులో 14జూనియర్‌ అసిస్టెంట్‌ సూపర్‌న్యూమరీ పోస్టులు మంజూరు చేయాలని కోరుతూ జెడ్పీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆ ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వంలో అయినా కారుణ్య నియామకాలు చేసి తమపై కరుణ చూపాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. పాఠశాలలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సర్వీసు చేస్తూ మృతిచెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో చేపడుతారు.

పోషణ భారంలో దివంగత ఉద్యోగుల కుటుంబాలు

చనిపోయి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగి మృతితో నెలనెలా వచ్చే వేతనం నిలిచిపోయి, చాలీచాలని పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నారు. 2004 తరువాత నియామకమైన వారికి పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా కుటుంబాలకు ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును మూడేళ్లకు పెంచడంతో ఖాళీల సంఖ్య స్వల్పంగా ఉంటోంది. ఉద్యోగుల విరమణ వయస్సు 58ఏళ్లు ఉన్న సమయంలో ప్రతినెలా జిల్లాలో ఖాళీలు ఏర్పడేవి. ఇప్పుడు వయసు పెంపుతో 2024 మార్చి నెల వరకు ఉద్యోగ ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు. ఇలాంటి సందర్భాల్లో జిల్లాలో సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నా ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రెండేళ్ల కిందట ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీలో కారుణ్య నియామకాలు చేపట్టారు. పరిషత్‌ల విభజన తరువాత వికారాబాద్‌ జిల్లా పరిషత్‌లో ఇప్పటి వరకు ఒక్క కారుణ్య నియామకాన్నీ చేపట్ట లేదంటే అతిశయోక్తికాదు. కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ కొంత కాలంగా మాజీ ఉద్యోగుల కుటుంబాల నుంచి జడ్పీ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రిటైర్‌ అయితేనే కొత్తగా ఉద్యోగాల కల్పన

కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు ఉద్యోగాలెప్పుడు ఇప్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం ఏడాదిన్నర కిందట దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. జిల్లాలో ఎక్కువగా సబార్డినేట్‌ ఉద్యోగ ఖాళీలే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు అటెండర్‌ ఉద్యోగాల్లో జాయిన్‌ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మందికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాన్ని కోరుతున్నారు. ఎక్కువ మంది గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్‌ అయ్యే వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం కొత్తగా సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తే తప్ప జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టే వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాలకు బాధిత కుటుంబాల ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే 2024 ఏప్రిల్‌ తరువాతే జిల్లాలో ఉద్యోగుల విరమణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంత వరకు బాధిత కుటుంబాల వారసులకు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది.

Updated Date - Feb 04 , 2024 | 11:55 PM