Share News

‘మలయాళస్వామి’ ఆస్తులను పరిరక్షిస్తాం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:16 AM

మలయాళ స్వామి ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించి, ఆశ్రమ విశిష్టతను కాపాడుతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు.

‘మలయాళస్వామి’ ఆస్తులను పరిరక్షిస్తాం

షాద్‌నగర్‌, ఫిబ్రవరి 1 : మలయాళ స్వామి ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించి, ఆశ్రమ విశిష్టతను కాపాడుతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. గురువారం షాద్‌నగర్‌ పట్టణంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో ఆశ్రమానికి సంబంధించిన ఆస్తుల వివాదానికి సంబంధించి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు, వీహెచ్‌పీ నేత బండారి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశ్రమానికి చెందిన ఆస్తులను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధూప దీప నైవేద్యం, నిత్యాన్నదానం కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని నిర్వాహకులకు సూచించారు. కాగా, ఆశ్రమానికి సంబంధించి కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఆశ్రమ ఆస్తులకు సంబంధించి నిర్వాహకుడు నిత్యానందస్వామి వాటిని సొంతం చేసుకునేందుకు పట్టణ మున్సిపల్‌ కార్యాలయంలో ప్రయత్నాలు చేపట్టారు. దాంతో పట్టణ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బక్కని నర్సింహులు ఆశ్రమ స్థల దాత కుమారుడు పలబట్ల పాండురంగయ్య ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులు ఇతర వ్యక్తులపై మార్పిడి జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వారు కేటాయించిన స్థలాన్ని ఆశ్రమానికి మాత్రమే చెందేలా చర్యలు చేపట్టారు. అయినా వివాదం సద్దుమణగలేదు. దీంతో ఎమ్మెల్యే జోక్యం కల్పించుకుని ఆశ్రమ ఆస్తుల వివాదాన్ని ఒక కొలిక్కి తేవడం గమనార్హం.

దేశానికి వెన్నుముక ఆర్మీ జవానులు

కొందుర్గు : దేశానికి వెన్నుముక ఆర్మీ జవానులేనని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గతేడాది ఆగస్టులో లద్దాఖ్‌లోని భేరి ప్రాంతంలో ఆర్మీ వాహనం లోయలోపడిన ప్రమాదంలో తంగళ్ళపల్లి శివారు గ్రామం తిర్మన్‌దేవునిపల్లికి చెందిన జవాన్‌ నీరటి చంద్రశేఖర్‌(30) మృతి చెందారు. గురువారం తిర్మన్‌దేవునిపల్లిలో చంద్రశేఖర్‌ విగ్రహాన్ని ఆర్మీ ఆధికారులు, కుటుంబసభ్యులు ఏర్పాటుచేయగా ఎమ్మెల్యే, చంద్రశేఖర్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పాలమూరు ట్రస్టు చైర్మన్‌ విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ వీర జవాన్‌ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సమాజం కూడా అండగా ఉండాలని కోరారు. చంద్రశేఖర్‌ స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, బాబయ్య, రాములు, శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:16 AM