Share News

గొర్ల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:18 PM

ఇదిగో గొర్రెలు.. అదిగో గొర్రెలంటూ గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఊరించి.. ఊరించి చివరకు గొల్ల కుర్మలకు అరకొర గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది. మొదటి విడత నామ మాత్రంగానే గొర్రెలు పంపిణీ చేశారు.

గొర్ల కోసం ఎదురుచూపులు

సబ్సిడీ గొర్రెల కోసం కాపరుల నిరీక్షణ

అంతంత మాత్రంగా మొదటి విడత పంపిణీ

రెండో విడత పంపిణీ చేసినవి 1,342 యూనిట్లే!

అప్పు చేసి డీడీలు చెల్లించిన గొల్ల కురుమలు

కొత్త సర్కార్‌ యూనిట్లు ఇస్తుందని కోటి ఆశలు

గొర్రెల యూనిట్లు ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం అంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొర్రెల కాపరుల నుంచి డీడీలు కట్టించుకుందే గానీ చాలా మందికి యూనిట్లు పంపిణీ చేయలేదు. మొదటి విడత లక్ష్యంలో 40శాతానికి పైగా పెండింగ్‌ పెట్టిన గత సర్కార్‌.. ఎన్నికలకు ముందు రెండో విడత పంపిణీ కోసమంటూ పెంచిన యూనిట్‌ కాస్ట్‌తో డీడీలు కట్టించుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నామమాత్రంగా పంపిణీ చేసి మమ అన్పించింది. తీరా ఎన్నికల్లో పాత ప్రభుత్వం పోయి కొత్త పాలకులొచ్చారు. అప్పులు చేసి డీడీలు చెల్లించిన తమకు గొర్రెలయినా ఇవ్వండి లేదా.. డీడీల కోసం కట్టిన డబ్బయునా తిరిగివ్వండి అని గొల్ల కురుమలు డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఇదిగో గొర్రెలు.. అదిగో గొర్రెలంటూ గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఊరించి.. ఊరించి చివరకు గొల్ల కుర్మలకు అరకొర గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది. మొదటి విడత నామ మాత్రంగానే గొర్రెలు పంపిణీ చేశారు. కనీసం రెండో విడతలోనైనా గొర్రెలొస్తాయని చూసిన డీడీలు కట్టిక కాపరులకు నిరాశే ఎదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో కొందరికి గొర్లు ఇచ్చారు. అంతలోనే ఎన్నికల కోడ్‌ వచ్చి పంపిణీ నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో గొర్రెల కోసం డీడీలు చెల్లించిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కాపరులు వందకు మూడు రూపాయల చొప్పున వడ్డీకి తెచ్చి యూనిట్‌కు రూ.43,750 చొప్పున చెల్లించారు. నెలలు గడుస్తున్నా గొర్రెలు రాలేదు. డీడీలైనా తిరిగి ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా తమకు యూనిట్లు పంచుతుందని గొల్ల కురుమలు ఆశపడుతున్నారు. జిల్లాలో 368 సొసైటీల్లో 41,964 సభ్యులున్నారు. మొదట 20,297 యూనిట్లు పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా 11,685 యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో పంపిణీ అంతంత మాత్రంగానే జరిగింది. రెండో విడత లక్ష్యం 30,009 యూనిట్లు. 2 వేల మంది రూ.8.75కోట్ల విలువగల డీడీలు చెల్లించారు. 1,342 యూనిట్లను దశాబ్ధి ఉత్సవాల్లో పంపిణీ చేశారు. మరో 700మంది రూ.43,750 చొప్పున రూ.3,06,25,000 చెల్లించారు. అయితే గొర్లను పంపిణీ చేయలేదు.

నెరవేరని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

జిల్లాలో గొల్ల, కుర్మల కుటంబాలు అనేకం ఉన్నాయి. 2018 నుంచి ప్రభుత్వం రాయితీపై గొర్లు కొనివ్వడం మొదలు పెట్టింది. 18ఏళ్లు నిండి సొసైటీలో సభ్యత్వం ఉన్న వారు అర్హులు. లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్‌ చైర్మన్‌గా, పశుసంవర్ధకశాఖ అధికారి కన్వీనర్‌గా ఉండేవారు. యూనిట్ల ఎంపిక, కొనుగోలు బాధ్యత మండల కమిటీదే. ఆడ గొర్రెలు, పొట్టేళ్లను పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేవారు. మండల కమిటీలో ఎంపీడీవో, తహసీల్దార్‌, పశువైద్యాధికారి ఉంటారు. గొర్లు కొనేందుకు వెళ్లే సమయంలో లబ్ధిదారులై సైతం అధికారుల వెంట వెళ్లాలి. రవాణా, బీమా ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. వెటర్నరీ అధికారి గొర్లను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న వాటిని ఓకే చేస్తే అమ్మకందారులకు అధికారులు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తారు. మొదటి విడత అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. సబ్సిడీ గొర్లు తీసుకున్న కొన్నాళ్లకే అమ్మేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే యూనిట్లకు అవసరమైన మేరకు గొర్రెలు, మేకలు స్థానికంగా దొరకక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో గొర్లకు డిమాండ్‌ పెరిగింది. అలాగే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో రవాణా భారం పడింది. కరోనా కాలంలో ప్రభుత్వం సబ్సిడీ భరించడం కష్టంగా మారింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు గొర్రెల ధర తక్కువగా ఉంది. క్రమేణా అన్ని ధరలూ పెరిగాయి.

పెరిగిన యూనిట్‌ ధర

గతంలో యూనిట్‌ ధర రూ.1.25లక్షలు. బ్యాంకులతో సంబంధం లేకుండా 70శాతం సబ్సిడీతో మంజూరు చేశారు. లబ్ధిదారుడు రూ.31,250, ప్రభుత్వం 93,750 భరించారు. ఒక్కో యూనిట్‌కు 20గొర్రెలు, ఒక పొట్టేలుకు చొప్పున అందజేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో గత ప్రభుత్వం యూనిట్‌ కాస్ట్‌ రూ.1.75లక్షలకు పెంచి లబ్ధిదారుల వాటా యూనిట్‌కు రూ.43,750 చెల్లంచాలని నిర్ణయింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాం : ఈరమోళ్ల మల్లయ్య, చేవెళ్ల

నాలుగేళ్లుగా గొర్రెల కోసం ఎదురు చేస్తున్నాం. మొదటి విడత ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. రెండో విడత డీడీలు కూడా చెల్లించారు. డీడీలు కట్టి ఆరునెలలు అయిపోయింది. ఎన్నికలకు ముందు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో విడత అరకొరగా గొర్రెలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. చాలా మందివి గొర్రెల ఇస్తారని ఎదరుచూస్తున్నాం. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా మా కష్టాలు చూసి డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలి.

అప్పు చేసి డీడీ కట్టాను : నాగరాజు, రామన్నగూడ, చేవెళ్ల మండలం

గొర్రెలు వస్తాయంటే.. ఊళ్లో వందకు మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి డీడీ కట్టాను. ఇప్పటి వరకు గొర్రెలు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మాకు గొర్రెలు త్వరగా పంపిణీ చేయాలి. లేకుంటే మేం కట్టిన డబ్బులు వాపస్‌ ఇవ్వాలి.

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం : అంజిలప్ప, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

జిల్లాలో మొదటి విడత 11,685 యూనిట్లు పంపిణీ చేశాం. రెండో విడత 1,342గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం. మరో 700 మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వీరంతా డీడీలు చెల్లించారు. ప్రభుత్వం ఆదేశిస్తే గొర్రెలను పంపిణీ చేస్తాం.

Updated Date - Jan 04 , 2024 | 12:02 AM