Share News

అంధకారంలో గ్రామాలు

ABN , Publish Date - May 17 , 2024 | 12:48 AM

అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నపాటి గాలి వీచినా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు.

 అంధకారంలో గ్రామాలు

  • అప్రకటిత కరెంటు కోతలతో ఇక్కట్లు

  • రాత్రంతా కరెంటు కట్‌

  • ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం

తాండూరు రూరల్‌, మే 16: అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నపాటి గాలి వీచినా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. గంటల తరబడి విద్యుత్‌ అంతరాయం కలుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాండూరు మండల పరిఽధిలోని మిట్టబాస్పల్లి, గుంత బాస్పల్లి గ్రామాల్లో కరెంటు సరఫరాను బుధవారం రాత్రి 9గంటలకు నిలిపివేసి తిరిగి గురువారం ఉదయం 11గంటలకు పునరుద్ధరించారు. ఒక్కరోజు రాత్రంతా ఆ రెండు గ్రామాలు అంధకారంలో మగ్గాయి. గ్రామాల ప్రజలు రాత్రి ఉక్కపోతతో నిద్రలేక అవస్థలు పడ్డారు. గంటల తరబడి విద్యుత్‌ నిలిపివేస్తే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రోజూ గంటల తరబడి అప్రకటిత విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు తీస్తారో ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి గాలి వీచినా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో తాగునీటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని వారంటున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించరాదని, ముఖ్యంగా రాత్రివేళల్లో విద్యుత్‌ అంతరాయం కలిగించొద్దని కోరారు.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

కులకచర్ల: చిన్నపాటి గాలి వీచిందంటే చాలు విద్యుత్‌ శాఖ అధికారులు సరఫరాను నిలిపి వేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పుట్టపహడ్‌లో 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో పాటు కులకచర్ల, ముజాహిద్‌పూర్‌, బండవెల్కిచర్ల గ్రామాల్లో 11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లు ఉన్నా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎంతటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు వచ్చినా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండేది కాదని, ప్రస్తుతం చీటికీ మాటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్న పరిస్థితులు దాపరించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కింద ఉన్న విద్యుత్‌ తీగలు తొలగించకపోవడంతో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. బుధవారం సాయంత్రం కురిసిన తేలికపాటి వర్షానికి మూడు గంటలు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

Updated Date - May 17 , 2024 | 09:22 AM