Share News

ఉపాధి పనుల్లో వికారాబాద్‌ జిల్లాది అగ్రస్థానం

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:30 PM

వలసలు నివారించి స్థానికంగానే కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పనుల్లో రాష్ట్రంలో వికారాబాద్‌ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

ఉపాధి పనుల్లో వికారాబాద్‌ జిల్లాది అగ్రస్థానం
ఉపాధి పనుల్లో కూలీలు

మెరుగైన స్కోర్‌తో రాష్ట్రంలో టాప్‌

వికారాబాద్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వలసలు నివారించి స్థానికంగానే కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పనుల్లో రాష్ట్రంలో వికారాబాద్‌ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక కూలీలకు ఉపాధి కల్పించడంలో, అత్యధిక కుటుంబాలకు 100రోజుల పని కల్పించడం, అత్యధిక కుటుంబాలకు సగటు పనిరోజులు కల్పించడం, అత్యధిక సగటు వేతనం ఇవ్వడం, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం వంటి అంశాల్లో జిల్లా మెరుగైన స్కోర్‌ సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 566 గ్రామ పంచాయతీల్లో 1,82,794 ఉపాధి జాబ్‌ కార్డుల్లో 3,75,638 మంది కూలీలు నమోదయ్యారు. వారిలో 2.54లక్షల మంది కూలీలు పనులకు రెగ్యులర్‌గా హాజరయ్యే వారున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులకు 45,429 మంది కూలీలు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 7,212 కుటుంబాలు 100రోజుల పని పూర్తిచేసుకోగా, కూలీలు సరాసరి వేతనం రూ.187.30 పొందుతున్నారు. ఈ ఏడాది ఇంత వరకు కూలీలకు వేతనం కింద రూ.114.83కోట్లు, మెటీరియల్‌ కాంపౌండ్‌ కింద రూ.75.93కోట్లు వెచ్చించారు.

అన్నింటిలోనూ ఉత్తమ పనితీరుతో...

ఉపాధి హామీ పనుల్లో సగటున అత్యధిక కూలీలకు పని కల్పించడంలో జిల్లా మూడో స్థానంలో ఉంది. జిల్లాలో సగటున 81మంది కూలీలకు పనులు కల్పించారు. జిల్లాలో ఇంత వరకు 1,04,541 కుటుంబాలకు పని కల్పించారు. ఉపాధి కూలీలకు 62,83,158రోజుల పని కల్పించాలనే లక్ష్యం ఉండగా, ఈ నెల 26వ తేదీ వరకు కూలీలకు 60.71లక్షల రోజుల పని కల్పించారు. 7,212 కుటుంబాలు 100రోజుల పని రోజులు పూర్తి చేసుకున్నాయి. వీటి శాతం 6.9శాతంగా ఉంది. ఈ అంశంలో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. 80నుంచి 100 పని రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 27,257తో సగటున 26.1శాతం నమోదైంది. జిల్లాలో సగటున ఒక్కో కుటుంబానికి 58రోజుల పని కల్పించారు. కూలీలకు ఎక్కువ రోజులు పనికల్పించిన జిల్లాల్లో వికారాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. అత్యధిక సగటు వేతనం పొందడంలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఒక్కో కూలీ రోజుకు రూ.187.30 వేతనం సగటున పొందాడు. కూలీల్లో 98.53 శాతం మందికి సమయానికి వేతనాలు ఇచ్చారు. ఈ అంశంలో జిల్లా పదో స్థానంలో నిలిచింది. ఉపాధి పనుల్లో జిల్లా మెరుగైన పనితీరు కనబర్చి 25పాయింట్లతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధి హామీలో జిల్లా మెరుగైన పనితీరు కనబర్చడం పట్ల కలెక్టర్‌ నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన కూలీలు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీవోలు, ఎంపీడీవోలు, డీఆర్‌డీఏ కార్యాలయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Updated Date - Mar 28 , 2024 | 11:30 PM