Share News

ఘనంగా వేంకటేశ్వరుడి కల్యాణోత్సవం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:05 AM

చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర్లస్వామి కల్యాణోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు.

ఘనంగా వేంకటేశ్వరుడి కల్యాణోత్సవం
మొయినాబాద్‌ రూరల్‌ : కల్యాణంలో పాల్గొన్న భక్తులు

చిలుకూరుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు

మొయినాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21: చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర్లస్వామి కల్యాణోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ, గరుడ వాహనసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణం వీక్షించేందుకు స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాదిలాగే కల్యాణప్రాప్తి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే, గత శుక్రవారం సంతాన భాగ్యం కోసం గరుడప్రసాద పంపిణీకి భక్తులు అనూహ్యంగా తరలిరావడంతో కల్యాణప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కేవలం స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదపండితులు వైభవోపేతంగా చేపట్టారు. వేదపండితులు తిరుల కిరణాచారి, పురావస్తు రామాచారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాల కృష్ణస్వామి, కన్నయ్య, సురేష్‌, అనిల్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

షాద్‌నగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 21: షాద్‌నగర్‌ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో వేదపండితులు కల్యాణాన్ని జరిపించారు. అంతకుముందు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో పల్లకీ సేవ నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేసి అన్నదానం చేశారు. కాగా, తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Apr 22 , 2024 | 12:05 AM