Share News

‘మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌’ బరిలో వంశీ

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:30 AM

ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీకి సిద్ధమవుతున్నారు.

‘మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌’ బరిలో వంశీ

అభ్యర్థిత్వంపై ధీమా.. పోటీకి వ్యూహాలు సిద్ధం!

జడ్చర్ల నియోజకవర్గ పర్యటనే కారణమంటున్న నాయకులు

ఆమనగల్లు, జనవరి 2: ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున వంశీచంద్‌ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వంపై ఇప్పటికే భరోసాగా ఉన్న వంశీ.. పోటీకి తగిన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం అందుకు బలం చేకూరుస్తుంది. పాలమూరు పార్లమెంట్‌ బరిలో నిలువనున్నట్లు తన అనుచరులతో కూడా వంశీ పేర్కొన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను.. అన్నిటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ స్థానాన్ని సునాయాసంగా దక్కించుకోవచ్చన్న భావనలో వంశీ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా సీఎం రేవంత్‌రెడ్డి ఉండడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఎన్నికలను అప్పుడే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏఐసీసీలో వంశీచంద్‌ రెడ్డి కీలక పదవిలో ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి స్థానాన్ని కసిరెడ్డి నారాయణ రెడ్డికి త్యాగంచేసి ఆయన విజయానికి కృషిచేయడం వంటి అంశాలు పార్టీపరంగా ఆయనకు కలిసొచ్చే అంశాలు. తాను పోటీ చేయాలని నిర్ణయించుకుంటే అభ్యర్థిత్వం ఆయనకే లభిస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత కొంతకాలంగా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలతో వంశీచంద్‌రెడ్డి టచ్‌లో ఉంటూ వస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితం రేవంత్‌ రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వంశీ భేటీ అయ్యారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే విషయమే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా వంశీ పేరు దాదాపు ఖరారైనట్లేనని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. సోనియా, రాహుల్‌, ఖర్గేలతో కూడా వంశీకి మంచి సంబంధాలున్నాయి. తెలంగాణలో సౌమ్యుడిగా వంశీకి మంచి పేరుంది. యువకుడైన వంశీనే బరిలో నిలిపితే బాగుంటుందని పార్టీ అగ్రనేతలు కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jan 03 , 2024 | 12:30 AM