అండర్‌పా్‌స.. యమ డేంజర్
ABN , Publish Date - May 04 , 2024 | 12:40 AM
స్థానిక మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ సమీపంలో గల రైల్వే అండర్ పాస్ యమ డేంజర్‌గా మారింది. అండర్‌పాస్ నిర్మించారే తప్పా.. ఎటువంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
సూచికలు లేక తరచూ ప్రమాదాలు
వాహనదారుల ఇబ్బందులు
కొత్తూర్, మే 3: స్థానిక మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ సమీపంలో గల రైల్వే అండర్ పాస్ యమ డేంజర్‌గా మారింది. అండర్‌పాస్ నిర్మించారే తప్పా.. ఎటువంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తిమ్మాపూర్ నుంచి గూడూర్, చేగూర్ గ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం రెండు సంవత్సరాల క్రితం రైల్వే అండర్‌పాస్ నిర్మించారు. అండర్‌పాస్ వద్ద వై అకారంలో గూడూర్, చేగూర్ గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు ఏర్పాటు చేశారు. అండర్‌పాస్ వద్ద వై ఆకారం కలిగిన రోడ్లు ఉండడంతో ఎదురెదురుగా వచ్చే వాహనలు దగ్గరకు వచ్చే వరకు కూడా కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అండర్ పాస్ వద్ద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనచోదకులు తికమకకు గురై ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ముందుకు సాగాల్సి వస్తుంది. రాత్రి సమయాల్లో వాహనచోదకులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ప్రయాణిస్తుంటారు. తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలతో పాటు, చేగూర్ శివారులో కన్హా శాంతివనం ఉండడంతో భారీ వాహనాలతో పాటు, ఇతర వాహనాల రాకపోకలు భారీగా ఉంటాయి. అలాగే ఈ ప్రాంత పరిసరాల్లో వ్యవసాయ భూములు ఉండడంతో రైతులు తమ పొలాలకు వచ్చి వెళ్తుంటారు. అండర్ పాస్ వద్ద రేడియం సూచిక బోర్డులతో పాటు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.