విద్యుదాఘాతంతో రెండు ఆవులు, ఎద్దు మృతి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:36 PM
విద్యుత్‌దాఘాతంతో రెండు ఆవులు, ఎద్దు మృతిచెందాయి. షాబాద్ మండల పరిధిలోని మన్‌మర్రికి చెందిన బాధితులు పొట్టిగారి నర్సింహులు తెలిపిన వివరాల మేరకు.. తన పొలం వద్ద ఆవులను మేపుతుండగా వర్షం రావడంతో వాటిని ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

షాబాద్/మాడ్గుల, జూన్ 7 : విద్యుత్‌దాఘాతంతో రెండు ఆవులు, ఎద్దు మృతిచెందాయి. షాబాద్ మండల పరిధిలోని మన్‌మర్రికి చెందిన బాధితులు పొట్టిగారి నర్సింహులు తెలిపిన వివరాల మేరకు.. తన పొలం వద్ద ఆవులను మేపుతుండగా వర్షం రావడంతో వాటిని ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో మార్గమధ్యలో ఐడియా టవర్ దగ్గర కరెంట్ పోల్‌కు ఉన్న వైర్‌కు తగిలి రెండు ఆవులకు షాక్ రావడంతో అక్కడకక్కడే మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుందని తెలిపాడు. తనకు జీవనాధారం ఆవులేనని, ప్రతీ రోజు వాటిని మేపుతూ పాలను అమ్మి జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం స్పందించి తనకు ఆర్థిక సాయం చేయాలని రైతు నర్సింహులు కోరాడు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని పెద్దమాడ్గుల గ్రామానికి చెందిన జిల్లెల రాములు పొలం వద్దకు ఎడ్లబండి కట్టుకొని కూలీలను ఎక్కించుకొని పనులకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణంలో కరెంటు స్తంభం కండెన్సర్ ఊడిపోవటంతో వైరు కాడెద్దుకు తగిలింది. విద్యుత్ షాక్‌తో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, మూడు రోజుల క్రితం కరెంటు వైరు కిందకి వేలాడుతోందని గ్రామస్తులు విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఉపసర్పంచ్ మిద్దే రాములు సంఘటన స్థలానికి చేరుకొని రాములును పరమర్శించారు. ఎద్దు మృతికి అధికారులే కారణమని, పరిహారం కింద రూ.లక్ష అందచేయాలని ఆయన కోరారు.