రెండు బైకులు ఢీ.. ఒకరు దుర్మరణం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:34 AM
రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమనగల్లు పట్టణ సమీపంలోని ఆమనగల్లు-మాడ్గుల ప్రధాన రహదారిపై ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

మరొకరి పరిస్థితి విషమం.. ముగ్గురికి గాయాలు
ఆమనగల్లు, జూన్ 16: రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమనగల్లు పట్టణ సమీపంలోని ఆమనగల్లు-మాడ్గుల ప్రధాన రహదారిపై ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసు, స్థానికుల కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి గ్రామానికి చెందిన రాయకంటి యాదగిరి అజిలాపూర్ గ్రామంలోని బొడ్రాయి ఉత్సవాలకు తన బావ సల్వాజీ యాదయ్య ఇంటికి వెళ్లాడు. రెండురోజుల పండుగ ముగియడంతో ఆదివారం రాయకంటి యాదగిరిని బైక్‌పై ఎక్కించుకొని సల్వాజీ యాదయ్య రాఘాయిపల్లికి బయలు దేరారు. అదే సమయంలో ఆమనగల్లు పట్టణానికి చెందిన లండం శివ పల్సర్ బైక్‌పై జూనియర్ కళాశాల మైదానం నుంచి రోడ్డుపైకి వస్తున్నాడు. ఈక్రమంలో అజిలాపూర్ నుంచి బైక్‌పై అతివేగంగా వస్తున్న సల్వాజీ యాదయ్యను రోడ్డుపైకి వస్తున్న లండం శివ బైక్‌తో వేగంగా ఢీకొట్టాడు. రోడ్డుపై పడ్డ బైక్ తీవ్రతకు ఆమనగల్లు నుంచి కూరగాయలు తీసుకొని ఎర్రబీక్య తండాకు బైక్‌పై వెళ్తున్న ఇస్లావత్ రోజాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజిలాపూర్ నుంచి వస్తున్న బైక్‌పై ఉన్న సల్వాజీ యాదయ్య(45) అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్‌పై ఉన్న రాగాయిపల్లి గ్రామానికి చెందిన రాయకంటి యాదగిరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈప్రమాదంలో మరో రెండు బైక్‌లపై ఉన్న ఆమనగల్లుకు చెందిన లండం శివ, ఎర్రబీక్య తండాకు చెందిన ఇస్లావత్ రోజాలు స్వల్పంగా గాయపడ్డారు. యాదగిరిని వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. యాదయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ రోజా, లండం శివలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాల్‌రామ్ నాయక్ తెలిపారు.