Share News

గగనతలంలో విమానం డోర్‌ తీసేందుకు యత్నం

ABN , Publish Date - May 23 , 2024 | 11:51 PM

గగనతలంలో విమానం తలుపులు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు గురువారం 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చారు.

గగనతలంలో విమానం డోర్‌ తీసేందుకు యత్నం

ఐపీసీ 258, 336, 290 సెక్షన్ల కింద ప్యాసింజర్‌పై కేసులు

ప్రయాణికుడికి 41 సీఆర్‌పీ నోటీసులిచ్చిన పోలీసులు

శంషాబాద్‌ రూరల్‌, మే 23 : గగనతలంలో విమానం తలుపులు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు గురువారం 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చారు. ఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ అనిల్‌ ఈనెల 21న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానంలో వస్తున్నాడు. ఈక్రమంలో అతడు మిగతా ప్రయాణికులతో పాటు విమానంలో ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా గగనతలంలో విమానం తలుపులు తెరిచేందుకు యత్నించాడు. దాంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అతడిపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన తరువాత భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 258, 336, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకవేళ విమానం తలుపులు తెరుచుకుంటే పెను ప్రమాదం జరిగేది. కానీ, పోలీసులు అతడిపై పైన పేర్కొన్న సెక్షన్లు పెట్టి 41 సీఆర్‌పీ నోటీసులు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - May 24 , 2024 | 08:12 AM