Share News

నాటుడు.. నరుకుడు!

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:09 AM

పచ్చని చెట్లు-ప్రగతి మెట్లు అని ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఏటా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచుతోంది.

నాటుడు.. నరుకుడు!
కమ్మెట రోడ్డు పక్కన నరికిన చెట్లు

ఇదేం పనని మండిపడుతున్న ప్రజలు

చోద్యం చూస్తున్న అటవీ శాఖ అధికారులు

చేవెళ్ల, జూన్‌ 10 : పచ్చని చెట్లు-ప్రగతి మెట్లు అని ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఏటా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచుతోంది. అయితే విద్యుత్‌ వైర్లకు వైర్లు తాకుతున్నాయని విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పెద్దపెద్ద చెట్లను నరికేస్తున్నారు. చేవెళ్ల మండలం కమ్మెట చౌరస్తా నుంచి చిలుకూరు రోడ్డులో రెండేళ్లుగా మెక్కలు పెంచుతున్నారు. ఈ చెట్లు వాహనదారులకు, బాటసారులకు నీడనిస్తున్నాయి. చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైర్లకు తగులుతున్నాయని రెండు రోజులుగా విద్యుత్‌ అధికారులు ఎక్స్‌కవేటర్లతో చెట్లను తొలగిస్తున్నారు. ఇది చూస్తూ ప్రజలు, వాహనదారులు విద్యుత్‌ శాఖ తీరుపై మండిపడుతున్నారు. రోడ్ల పక్కన, వైర్ల కింద మొక్కలు నాటడం ఎందుకు? మల్లా నరికేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొక్కలు వృక్షాలైన సమయంలో కొట్టేస్తే మరి నాటడం ఎందుకంటున్నారు. విద్యుత్‌ స్తంభాలు లేని చోటే నాటాలన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చెట్లను తొలగించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే చెట్ల నరికివేతపై అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. రైతులు తమ అవసరాలకు పొలాల్లోని చెట్లు నరికితే ఆక్షేపించే అధికారులు ఇప్పుడెందుకు పట్టించుకోవడంలేదో తెలియడం లేదు.

ఉన్నతాధికారులు స్పందించాలి : హన్మంతరెడ్డి, మాజీ సర్పంచ్‌, కమ్మెట

ప్రభుత్వం నాటించిన మొక్కలు పెరిగాక నరికివేయడం బాధాకరం. విద్యుత్‌ స్తంభాలు చిన్నగా ఉండటం వల్లే కొమ్మలు వైర్లకు తగులుతున్నాయి. రోడ్డు వెంట పొడవైన విద్యుత్‌ స్తంభాలు పాతితే కొన్నేళ్ల వరకు చెట్ల నరికివేత ఉండదు. ఉన్నతాధికారులు స్పందించి చెట్లు నరివేతను ఆపేయించాలి. చెట్లను పరిరక్షించాల్సిన యంత్రాంగం స్పందించకపోవడం సరికాదు. చెట్లు ఉంటేనే ప్రజలకు, పర్యావరణానికి మేలు.

Updated Date - Jun 11 , 2024 | 12:09 AM